ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 13 నుండి అత్యంత పవిత్రమైన ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ నుండే కాకుండా ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఏపీ సహా పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు కాళేశ్వరం తరలివచ్చే అవకాశం ఉందన్నారు. హిందూ భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో ప్రాణహిత పుష్కరాల్లో స్నానాలు చేసి, పూజలు నిర్వహించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారన్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రాణహిత నదికి ఇవే తొలి పుష్కరాలు అయినందున ముఖ్యమంత్రి కేసీఆర్ భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అందులో స్నాన ఘట్టాలు, మరుగుదొడ్ల నిర్మాణం సహా తాగునీటి, వైద్య శిబిరాలు వంటి కనీస సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయడంతో పాటు గడువు సమీపిస్తున్నందున యుద్ద ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.