Bandi Sanjay Again Fires On Telangana CM KCR: సీఎం కేసీఆర్కు కేవలం మందు మీద మాత్రమే ప్రేమ ఉందని, తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మూడో దశ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ధర్మపురంలో ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో భాగ్యలక్ష్మీ అమ్మవారు సాక్షిగా పాదయాత్రి ప్రారంభిస్తే, టీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ప్రధాన్ ఆవాజ్ యోజన కింద రెండు లక్షల ఇళ్లు ఇస్తే, కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. అంగట్లో సరుకుల్లాగా.. స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరించి మరీ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. విస్నూర్ రామచంద్రారెడ్డికి, కేసీఆర్కు ఏమీ తేడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పండించే ప్రతీ ధాన్యం బీజేపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే ప్రతి పైసా ఇస్తోందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతులు, యువకులు, ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు. తండాలకు, గ్రామాలకు కేసీఆర్ ఏమీ ఇవ్వలేదని.. లైట్ కాదు కదా కనీసం మోరి కూడా కట్టివ్వలేదని ఆగ్రహించారు. పేదల ఓటును డబ్బుతో కొనడమే కేసీఆర్ పని అని విమర్శించారు. హుజూరాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు పంచినా.. అక్కడి ప్రజలు ప్రధాని మోదీ పాలన చూసి, బీజేపీని గెలిపించారని బండి సంజయ్ పేర్కొన్నారు.