B Vinod Kumar Reacts On Central Orders Over Power Issue: విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రాల మధ్య ఏమైనా వివాదాలుంటే, కేంద్ర హోంశాఖ మాత్రమే చొరవ తీసుకొని, వాటి పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. ఇప్పుడు విద్యుత్ బకాయిల విషయంలోనూ కేంద్ర హోంశాఖనే జోక్యం చేసుకోవాలే తప్ప.. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కాదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఏ మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు.
నిజానికి.. విద్యుత్ బకాయిల విషయంలో ఇరు రాష్ట్రాల వాదనలు వినాలని, ఆ తర్వాతే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలని వినోద్ కుమార్ చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా కేవలం ఏపీ వాదనల్ని మాత్రమే సమర్థించి, నెలరోజుల్లోగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేయడం సమర్థనీయం కాదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ తప్పిదమే అవుతుందని ఫైరయ్యారు. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్రం హోం మంత్రిత్వ వాఖ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని.. కానీ ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదంలో మౌనంగా ఉండటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య క్లెయిమ్స్ & కౌంటర్ క్లెయిమ్స్ పట్టించుకోక పోవడం చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందనే విషయం స్పష్టమవుతోందని ఆరోపణలు చేశారు.
తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ రూ. 12,940 కోట్లు బకాయి ఉందని చెప్తోన్నా.. వాటిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పట్టించుకోకుండా కేవలం ఏపీ వాదనల్ని మాత్రమే వినడం సరైన పద్ధతి కాదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ విద్యుత్ బకాయిల విషయంలో ఏపీ జెన్‌కో సంస్థ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. దాన్ని నిరసిస్తూ.. తెలంగాణ జెన్‌కో & తెలంగాణ డిస్కం సంస్థలు రాష్ట్ర హై కోర్టులో రిట్ పిటిషన్లు వేశాయని కూడా వినోద్ కుమార్ తెలిపారు.