VC Sajjanar : హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ‘అరైవ్ & అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ జోయిస్ డేవిస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, యువత, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అర్రివ్ అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని, ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.
Bihar Elections: బీహార్ రాజకీయాలను మలుపు తిప్పిన రో-కో జోడీ వీళ్లది!
ప్రస్తుతం హైదరాబాద్‌లో సంవత్సరానికి సుమారు 3 వేల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందులో 300 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అవయవ రవాణాలో హైదరాబాద్ పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించారని, అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌ను నిలిపి ఉంచి గ్రీన్‌చానెల్ ద్వారా అవయవాలను వేగంగా తరలించే సేవల్లో ముందంజలో ఉన్నామని సజ్జనార్ పేర్కొన్నారు. వర్షాలు, ఎండలు, విపత్తులు.. ఏ పరిస్థితుల్లోనైనా పోలీసులు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని గుర్తుచేశారు.
పడిన చోట ప్రమాదాన్ని చూసే వెంటనే సహాయం చేసే వారికి హైదరాబాద్ పోలీసులు గౌరవం అందిస్తున్నారని, ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకమని తెలిపారు. ‘అర్రివ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసి, ప్రమాదరహిత హైదరాబాద్‌ను నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా, ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు.