కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కాము అనుకున్న చాలామంది కోవిడ్ బాధితులను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది.. దీంతో, కరోనా బారిన పడినవారు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. అయినా, క్రమంగా దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే, బ్లాక్ ఫంగస్ ముప్పు ఎవరిలో ఎక్కువగా ఉంటుందనే విషయంపై ఓ అధ్యయనం నిర్వహించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టీమ్.. కీలక విషయాలను ఆ అధ్యయనం బయటపెట్టింది..
Read Also: Police: మహిళను కిడ్నాప్ చేసి అఘాయిత్యం, సీఐపై కేసు నమోదు
కరోనా నుంచి కోలుకున్నా.. బ్లాక్ ఫంగస్ చాలా మందిపై దాడి చేస్తున్న సమయంలో గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ), తైపీ మోడల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా బ్లాక్ ఫంగస్‌ను ముందస్తుగా గుర్తించే వ్యవస్థను రూపొందించాయి. ఎలాంటి లక్షణాలు ఉంటే అది బ్లాక్ ఫంగస్‌గా అనుమానించాలి..? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి..? అనేదానిపై క్లారిటీ ఇచ్చింది.. 30 నుంచి 75 ఏళ్ల మధ్య వయసు ఉన్న 1,229 మంది కోవిడ్ పాజిటివ్ రోగులు, బ్లాక్ ఫంగస్ బారిన పడిన 214 మందికి సంబంధించి డేటాను సేకరించి ఈ అధ్యయనం చేశారు.. రోగుల పూర్తి వివరాలు మరియు సమస్యలను క్రోడీకరించి డేటా సెట్‌గా రూపొందించారు. ఈ సమాచారం ఆధారంగా, ఊబకాయం, వాసన కోల్పోవడం, ఇన్సులిన్ వాడుతున్న మధుమేహగ్రస్థులు, కండరాల నొప్పులు, ముక్కు కారడం లక్షణాలు ఉన్నవారు బ్లాక్‌ఫంగస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. భవిష్యత్తులో ఈ నమూనాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే బ్లాక్ ఫంగస్ ను ముందుగానే గుర్తించి చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు..