హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రతి 5 వేల నుంచి 10 వేల వరకు జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్.. దూల్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: కాల్ సెంటర్ల నుంచి సైబర్క్రైమ్ ఆపరేషన్
బస్తీ దవాఖానాలలో ఉచితంగా వైద్య సేవలు, మందులను ప్రజలకు అందజేస్తున్నామని మంత్రి తలసాని వెల్లడించారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తలసాని కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు ఉండగా… ఈరోజు నూతనంగా మరో 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించామని తలసాని పేర్కొన్నారు. మరోవైపు పురానాపూల్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నం.10లో ఉన్న గురుబ్రహ్మనగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.