ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వినాయకనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట వినాయక నగర్‌లో ఉన్న జ్యూయల్ గ్రాండ్ అపార్ట్మెంట్‌లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. లలిత (56) దివ్య (32) శివ కార్తికేయ (వన్ అండ్ ఆఫ్ ఇయర్) ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే.. లలిత, శివ అక్కడికి అక్కడే మృతి చెందగా.. దివ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం హాస్పిటల్‌లో దివ్య చికిత్స పొందుతున్నట్లు తెలిపిన పోలీసులు.. లలితకు దివ్య కూతురు, శివ మనవుడు అవుతాడని వెల్లడించారు. అయితే.. కూకట్‌పల్లిలో దివ్య తన భర్తతో నివాసం ఉంటోంది. కొద్దీ రోజుల క్రితమే తల్లి లలిత ఇంటికి కూతురు దివ్య, మనవుడు శివ వచ్చారు. కొన్ని ఏళ్ల క్రితమే లలితను ఆమె భర్త వదిలేశాడు. లలితకు దివ్య, శ్రీకర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకర్‌కు వివాహం అవ్వకపోవడంతో పాటు కొన్ని రోజుల నుండి లలిత, దివ్య డిప్రెషన్‌లో ఉంటున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని లలిత, దివ్యలు నిర్ణయించుకుని.. మొదట మనవుడు శివ మెడకు చున్నీతో లలిత బిగించగా.. తరువాత లలిత మెడకి దివ్య చున్నీతో బిగ్గించినట్లు.. ఆ తరువాత దివ్య మెడకి చున్నీతో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో లలిత కొడుకు శ్రీకర్ డోరు కొట్టి లోపలికి వెళ్లేసరికి కొన ఊపిరితో ఉన్న అక్క దివ్యను చూసి హుటాహుటిన హాస్పిటల్‌కు శ్రీకర్ తరలించాడు. అయితే సమాచారంతో ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుంది. మరి కొద్దీసేపట్లో లలిత, శివ మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.