మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ప్రైవసీకి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వాట్సాప్ తన యూజర్ల మెసేజ్‌లను రహస్యంగా చదువుతోందని అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా కొత్త చర్చకు దారితీసింది. దీనిపై టెక్ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్, తాము అందించే ప్రతి మెసేజ్ ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్’ (End-to-End Encrypted) అని, అంటే పంపేవారు, స్వీకరించేవారు తప్ప మరెవరూ (చివరికి కంపెనీ కూడా) వాటిని చదవలేరని ఎప్పటినుంచో చెబుతోంది. అయితే, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలైన తాజా దావా ఈ నమ్మకాన్ని ప్రశ్నిస్తోంది.
Chhattisgarh: 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతం.. ఈ 47 గ్రామాల్లో తొలిసారి ఎగిరిన త్రివర్ణ పతాకం..
అమెరికా కోర్టులో దాఖలైన దావా ప్రకారం, వాట్సాప్ తన యూజర్లను మోసం చేస్తోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. వాట్సాప్ కేవలం మెసేజ్‌లను బట్వాడా చేయడమే కాకుండా, వాటిలోని కంటెంట్‌ను విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉందని దావాలో ఆరోపించారు. యూజర్లు తమ స్నేహితులు , కుటుంబ సభ్యులతో చేసే ప్రైవేట్ చాట్‌ల ఆధారంగా వారికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు (Targeted Ads) చూపించేందుకు ఈ డేటాను మెటా వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
కంపెనీలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు యూజర్ల డేటాను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉందని, ఇది యూజర్ల ప్రైవసీకి పెద్ద ముప్పు అని దావాలో స్పష్టం చేశారు. ఈ వార్తలపై ఎక్స్ (X – గతంలో ట్విట్టర్) వేదికగా ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. గతంలోనూ మెటా సంస్థపై విమర్శలు చేసే మస్క్, ఈసారి మరింత ఘాటుగా స్పందిస్తూ.. “వాట్సాప్ తన యూజర్ల డేటాను ప్రతిరోజూ రాత్రి ఎగుమతి చేస్తూనే ఉంటుంది. ఇది అస్సలు సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. మస్క్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది యూజర్లు ఇప్పుడు వాట్సాప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆరోపణలను మెటా సంస్థ , వాట్సాప్ అధిపతి విల్ క్యాత్‌కార్ట్ తీవ్రంగా ఖండించారు. ఈ దావాలోని అంశాలు కేవలం అపోహలు మాత్రమేనని, వాట్సాప్ ఎప్పుడూ యూజర్ల ప్రైవసీని ఉల్లంఘించదని వారు స్పష్టం చేశారు. మెసేజ్ ఎన్‌క్రిప్షన్ కీలు కేవలం వినియోగదారుల పరికరాల్లోనే ఉంటాయని, కంపెనీ సర్వర్లలో కావాలన్నా మెసేజ్‌లను చదవడం అసాధ్యమని వాట్సాప్ ప్రతినిధులు వివరించారు. తప్పుడు ఆరోపణలతో కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిపై తాము కోర్టులో ధీటుగా పోరాడతామని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ హెచ్చరించారు.
యూజర్లు ఏం చేయాలి?
ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున, రాబోయే రోజుల్లో వాట్సాప్ ప్రైవసీకి సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.