వేసవికాలం మొదలైనప్పటి నుంచి.. ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా తగలబడుతున్నాయి. మొదట్లో ఒకట్రెండు వాహనాల్లో మంటలొచ్చినప్పుడు.. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, క్రమంగా ఈ స్కూటర్స్ ఎక్కువ సంఖ్యలో దగ్ధమవ్వడం మొదలైంది. ఒకట్రెండు ఘటనల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. దీంతో.. అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల లాంచింగ్‌ను ఆపేయాలని సూచించిన కేంద్రం.. ఈ ప్రమాదాలపై హైలైవెల్ విచారణ కమిటీని నియమించింది.
దీంతో రంగంలోకి దిగిన ఆ కమిటీ.. అగ్ని ప్రమాదాలు జరిగిన చోట స్కూటర్స్ నుంచి శాంపిల్స్ సేకరించి, దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బ్యాటరీ సెల్స్, మాడ్యుల్స్‌లో లోపాల కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగినట్టు ఆ కమిటీ తన ప్రాథమిక విచారణలో వెల్లడించింది. ఒకినావా ప్రమాదానికి సంబంధించి.. సెల్స్, బ్యాటరీ మాడ్యుల్స్ లోపాలే కారణమని తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్యూర్ ఎలక్ట్రిక్ అగ్నిప్రమాదానికి సంబంధించి.. బ్యాటరీ కేసింగ్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించారు.
ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ.. మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్టుగా తెలిసింది. అయితే.. ఓలా సంస్థ దీన్ని ఖండిస్తోంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఏ సమస్యా లేదని స్పష్టం చేసింది. కానీ.. ఐసోలేటెడ్ థర్మల్ ఇష్యూ కారణంగా ఓలా స్కూటర్లు ఫైర్ యాక్సిడెంట్‌కి గురైనట్టుగా అంగీకరించింది. ప్రస్తుతం ప్రాథమిక అంచనాలకే వచ్చిన ఈ కమిటీ.. లోతుగా పరిశీలించిన తర్వాత తుది నివేదికను వెల్లడించనుంది. ఇందుకు రెండు వారాల సమయం పట్టొచ్చు.