దేశంలో ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 5జీ టెలికాం సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 2022, ఆగస్టు 15 కల్లా 5జీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. దీంతో 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన సిఫార్సులను మార్చికల్లా అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. వివిధ బ్యాండ్‌లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణం, ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ చేయనుంది.
అటు అల్ట్రా హైస్పీడ్ డాటా కోసం ఉద్దేశించిన 5జీ సేవలపై ఇటీవల ట్రాయ్ పలు పరిశ్రమల ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో ఒక చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది. ఈ అంశాన్ని పరిశీలించి, త్వరితంగా సిఫార్సులను, అభిప్రాయాలను తెలియచేయాలంటూ ట్రాయ్‌ని టెలికాం శాఖ ఒక లేఖ ద్వారా కోరింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే.. ఇప్పుడు 4జీలో ఉన్న డౌన్‌లోడ్ స్పీడ్ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.