అంబాసిడర్ కార్.. ఈ ఐకానిక్ కార్ గురించి తెలియని భారతీయుడు ఉండడు. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారు తయారీ 2014 నుంచి ఆగిపోయింది. విదేశీ కార్లపై భారతీయుల మోజు పెరిగిపోవడం, అంబాసిడర్ అమ్మకాలు తగ్గిపోవడం, అప్పుడు కూడా పెరిగిపోవడంతో.. హిందూస్తాన్ మోటార్స్ వీటి తయారీని నిలిపింది. అయితే, ఇప్పుడిది సరికొత్త అవతారంలో త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. అంబాసిడర్ 2.0 గా రెండేళ్ళలో మార్కెట్‌లోకి రానుందని ఆ సంస్థ ప్రకటించింది.
ఫ్రాన్స్‌కు చెందిన ప్యూజట్ అనే కార్ల తయారీ సంస్థతో కలిసి.. అంబాసిడర్ కొత్త వెర్షన్‌ను డెవలప్ చేస్తున్నట్లు హిందూస్తాన్ మోటార్స్ తెలిపింది. చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్లాంటులో కొత్త కార్ల తయారీ జరగనుంది. బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్-3 ఆధారంగా ఈ కొత్త వర్షన్‌ను తయారు చేస్తున్నారు. 1956 నుంచి దేశంలో ఈ అంబాసిడర్ కార్లు తయారయ్యేవి. బ్రిటీష్ మోడల్ కార్ ఆధారంగా తయారైనప్పటికీ, దీన్ని ఇండియన్ కారుగానే చూసేవారు. 1960-90 మధ్యకాలంలో ఎవరి వద్ద అయితే అంబాసిడర్ కార్ ఉండేది.. వారికి ఓ ప్రత్యేకమైన స్టేటస్ సింబల్ ఉండేది.
అప్పట్లో కొత్త మోడల్స్ ఎన్ని వచ్చినా, అంబాసిడర్‌కి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ, కాలక్రమంలో ఈ కార్ల అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో హిందుస్తాన్ మోటార్స్ సంస్థ నష్టాల్లో కూరుకుపోవడం.. 2014 నుంచి ఈ కార్ల తయారీని నిలిపివేయడం జరిగింది. 2017లో కంపెనీలోని వాటాలను ప్యూజట్ సంస్థకు అమ్మేసింది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసి, కొత్త కారును తయారు చేస్తున్నాయి. మరో రెండేళ్లలో ఇది మార్కెట్‌లోకి రానుంది. మరి, ఈసారి అంబాసిడర్ 2.0 పూర్వవైభవాన్ని సాధిస్తుందా? లేదా? చూడాలి.