IMD Weathter: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథులను కేంద్రం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విభిన్న ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
గాంధీ ఆస్పత్రిలో కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసన చేపట్టిన వైద్యులకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు. ఓ రోగిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్క.. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలని వ్యాఖ్యానించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకం కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై 'స్టే' సుప్రీంకోర్టు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే అమలులో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, గండిపేట్, తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.