హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా మొదలు పెట్టింది. గాజులరామారం చెరువును ఆక్రమించి నిర్మించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం విజయవంతంగా తొలగించారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది.
షాద్ నగర్ పట్టణ పోలీసులు ఒక చోరీ కేసులో దళిత మహిళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి శిక్షించిన.. అంశంపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం స్పందించారు. కేసు పూర్వపరాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, దళిత కుటుంబానికి అండగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడారు.
మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలోని కాటేదాన్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని.. ఆ కార్యక్రమ పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా.. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్లో ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ, రాహూల్ గాంధీల నాయకత్వంలో 8 నెలల క్రితం అధికారం ఇచ్చారని.. ఈ 8 నెలల కాలంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సీనియర్ మంత్రుల నాయకత్వంలో రైతు రుణమాఫీ అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.