ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం.. సీఎంకు నివేదిక..
విజయవాడను వరదల అతలాకుతలం చేశాయి.. ఓవైపు బుడమేరు.. మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో.. విజయవాడలోని చాలా కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి.. అయితే, ఇదే సమయంలో.. కృష్ణా నదిలో బోట్లు వచ్చి.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం సంచలనంగా మారింది.. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో .. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.. దీని కోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.. ఇంకో వైపు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీ-కొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది.. బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో వెల్లడించారు అధికారులు.. ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమన్న నివేదికలో పేర్కొన్నారు అధికారులు.. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు.. కార్యకర్తలవని నివేదికలో నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్టు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు.. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలిపారు.. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017 నెంబర్లున్న బోట్లతో పాటు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి మరో రెండు బోట్లు. ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీల బోట్లుగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందన్న నివేదికలో వెల్లడించారు.
నేను పార్టీ మారలేదు.. సమయం వచ్చినప్పుడు చెబుతా..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. పార్టీ మారుతున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతూ వస్తుంది.. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరతారనే చర్చ సాగింది.. అయితే, ఆయన ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు.. తాజాగా మరోసారి తిరుమల వేదికగా క్లారిటీ ఇచ్చారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను పార్టీ మారలేదు అని స్పష్టం చేశారు.. అయితే, సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ ఉత్కంఠమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు మల్లారెడ్డి.. దీంతో.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? ఇంకా ఏదైనా ఆలోచన ఉందా? అనే కొత్త చర్చ మొదలైంది..మరోవైపు ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు, వరదలపై స్పందించిన మల్లాడిరెడ్డి భారీ వర్షాలు.. వరదలు విజయవాడను అతలాకుతలం చేసినా.. 74 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక.. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేశారు.. తెలంగాణను తిరిగి కేసీఆర్, కేటీఆర్ అభివృద్ది చేస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. కాగా, నిన్న తిరుపతి చేరుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు.. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా నడకమార్గంలో తిరుమల చేరుకున్న విషయం విదితమే.
భారీ వర్షాలు.. 9వ రోజు సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్..
వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు.. మరోవైపు భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.. మరోవైపు.. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గింది. ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయట పడతాయి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్స్ ను ఉపయోగించండి.. కాలువల్లో వరద ప్రవాహాలు, గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయండి అని సూచించారు సీఎం చంద్రబాబు.. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్దరణ పూర్తి అయ్యిందని తెలిపిన అధికారులు.. అయితే, అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.. మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సూచించారు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు.. ఎర్రకాల్వకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలన్నారు..
ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్..! వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు..!
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్యే ఆదిమూలంపై నమోదైన అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టారు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వరలక్ష్మి… ఇక, కేసు విచారణలో భాగంగా వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావించారు.. అయితే, అనారోగ్యంతో పాటు.. గుండె నొప్పిగా ఉందని చెబుతున్న బాధితురాలు వరలక్ష్మి.. తనకు వైద్య పరీక్షలకు కొంత సమయం కావాలని ఈస్ట్ పోలీసులను కోరారు.. అనారోగ్య సమస్యలు.. గుండె నొప్పితో బాధపడుతున్న నాకు.. వైద్య పరీక్షల కోసం కొంత సమయం ఇవ్వాలంటూ రాతపూర్వకంగా పోలీసులను కోరారు వరలక్ష్మి. దీంతో అమెకు వైద్య పరీక్షలను పూర్తిగా కోలుకున్నాక నిర్వహించడానికి అంగీకరించారు పోలీసులు..
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్..
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్ విడుదలకు హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. పిటిషన్ల విచారణపై షెడ్యూల్ రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, బీఆర్‌ఎస్ బీ-ఫారంపై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు ముగించింది. అయితే.. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది..
నేను హైడ్రాకి సపోర్ట్ చేశా.. ఇప్పుడు విశ్వాసం పోతుంది..
హైడ్రా పై విశ్వాసం పోతుంది.. నేను మొదట హైడ్రాకి సపోర్ట్ చేశానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రాతో డైవర్ట్ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల ను కొట్టాలి. పేదలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. పేదల ఇళ్లను కూలుస్తున్నారు సామాన్యులను ఇబ్బందులు పెడితే ఊరుకోమన్నారు. హైడ్రా ను ఒక్కపుడు స్వాగతించాం.. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువగా సభ్యత్వం చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారికే టికెట్ పైరవీలు నా దగ్గర నడవదని తెలిపారు. ఇచ్చిన మాట తప్పకుండ నిలబెట్టుకుంటా అన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో విరక్తి స్టార్ట్ అయ్యిందని తెలిపారు. బీఆర్ అవుట్ డేటెడ్ పార్టీ అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలన్నారు. బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నాడని విమర్శించారు. రీ ఎంట్రీ కాదు …పాలిటిక్స్ లో నో ఎంట్రి బోర్డు రాసి పెట్టారన్నారు.
కోల్ కతా డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ.. వచ్చే మంగళవారానికి వాయిదా
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు తదుపరి విచారణ నేడు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవరును సమర్పించారు. అందులో ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఈ ఘటనకు నిరసనగా వైద్యుల సమ్మెలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణను వచ్చే మంగళవారానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఘటనాస్థలంలో సేకరించిన సాంపిల్స్పై సీబీఐ అనుమానం వ్యక్తం చేయగా.. వచ్చే మంగళవారంలోపు ఈ కేసుకు సంబంధించిన కొత్త స్టేటస్ రిపోర్ట్‌ని సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ను మళ్ళీ ఫైల్ చెయ్యాలని సుప్రీం కోర్ట్ సీబీఐని ఆదేశించింది. సీబిఐ విచారణ కు మరో వారం రోజుల గడువు ఇచ్చింది. బెంగాల్ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ అధికారులకు సహకరించటం లేదని సోలిసిట్ జనరల్ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా అర్జీ కార్ ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్ల క్వార్టర్లు, మెడికల్ కాలేజ్, ఇందిరా మైత్రి సదన్ ల వద్ద సీఐఎస్ఎఫ్ అధికారులు వసతి కల్పించాలని ఆదేశించింది. అర్జీ కార్ ఆస్పత్రి వద్ద డాక్టర్ల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. రక్షణ చర్యల పై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చామని బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
భారత్ జోడో యాత్ర నన్ను.. దేశ రాజకీయాలను మార్చేసింది : రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో జరిగిన ఇంటర్వ్యూలో ఇండియా జోడో యాత్ర గురించి మాట్లాడారు. యాత్ర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర నన్ను మరియు దేశ రాజకీయాలను మార్చిందన్నారు. సెప్టెంబరు 8న అమెరికా చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడ సెప్టెంబర్ 10 వరకు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు సహా పలువురితో కాంగ్రెస్ నేతలు మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీతో ముఖాముఖి సందర్భంగా భారత్ జోడో యాత్రకు సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. మీరు 4 వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణించారు? దానికి అతను, ముందుగా నేను ఈ ప్రయాణం ఎందుకు ప్రారంభించానో తెలుసుకోవడం ముఖ్యం? రాహుల్ గాంధీ స్పందిస్తూ, నేను భారత్ జోడో యాత్రను ప్రారంభించాను. ఎందుకంటే పౌరులు మాట్లాడే హక్కును కోల్పోయారు. అందుకోసం పార్లమెంటు, మీడియా, మేము న్యాయ వ్యవస్థకు సంప్రదించాం.. కానీ అన్ని దారులు మూసుకుపోయాయి. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్లోకి ఈ పరిస్థితిని తీసుకెళ్లాలని భావించామన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు నాకు మోకాళ్లలో నొప్పి వచ్చిందని.. మూడు నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడ్డానని రాహుల్ గాంధీ అన్నారు. పొద్దున్నే లేచి ఈరోజు 10 కిలోమీటర్లు నడవాలని అనుకున్నానని అలా నాలుగు వేల కిలోమీటర్లు నడిచానని అన్నారు. తర్వాత తర్వాత ఈ ప్రయాణం నాకు కష్టంగా అనిపించలేదన్నారు.
ఎవరైనా అలా చెయ్.. ఇలా చెయ్‌మని చెబితే నచ్చదు: పంత్
తనకు ఎవరైనా ఇలా చేయాలి, అలా చెయ్‌మని చెబితే పెద్దగా నచ్చదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తనకే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తే మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తాను ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో కాస్త తడబాటుకు గురయ్యానని, ఆ సమయంలో అప్పటి కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు ఇచ్చాడని పంత్ పేర్కొన్నాడు. పంత్ చివరిసారిగా 2022లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపుగా 18 నెలలు ఆటకు దూరమై కోలుకొని టీ20 ప్రపంచకప్ 2024లో ఆడాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2024లో రిషబ్ పంత్ ఆడుతున్నాడు. ఇండియా-బికి ఆడుతున్న పంత్.. ఇండియా-ఎపై అర్ధ శతకం చేశాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించగా.. అందులో చోటు దక్కించుకుని సుదీర్ఘ ఫార్మాట్‌లోకి పునరాగమనం చేశాడు. బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం జరిగే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో కీలకంగా మారతాడని అందరూ భావిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ దక్కించుకోవడంలో పంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
దర్శకుడిగా తమిళ విజయ్ కొడుకు.. హీరోగా మన తెలుగు కుర్రాడే..
ఇళయదళపతి విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా విజయ్ గోట్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో ఉంది. త్వరలో పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు విజయ్. ఈ కారణంగా చిత్ర పరిశ్రమ తప్పుకోనున్నాడు విజయ్. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. కానీ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తమిళ సినీపరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. కానీ తన తండ్రిలా హీరోగా కాదు మాత్రం కాదు. అవును జాసన్ సంజయ్ తన తాత అడుగుజాడల్లో నడుస్తూ దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. గతంలో ఇందుకు సంబంధించి 2023లో ప్రకటన కూడా చేసారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జాసన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇన్నాళ్లు ఈ సినిమాలో నటించే హీరోఎవరు అనే తకరారు నడిచింది. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు జాసన్ దర్శకత్వంలో నటిచబోయే హీరో మాన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అని తెలుస్తోంది.సందీప్ కిషన్ తమిళ పరిశ్రమకు కొత్తేమి కాదు. గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలలో ఈ యంగ్ హీరో నటించాడు. ఇటీవల ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రాయన్ లోను సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. జాసన్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ AR. రెహమాన్ కొడుకు సంగీత దర్శకుడుగా పరిచయం కాబోతున్నట్టు కూడా న్యూస్ వినిపిస్తోంది. అన్నట్టు తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ కనకరాజ్ మొదటి సినిమా నగరం లోను సందీప్ కిషన్ హీరోగా నటించాడు.
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత..
తమిళ సినీమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ Axess Film ఫ్యాక్టరీ నిర్మాత G. ఢిల్లీ బాబు ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సెప్టెంబర్ 9 తెల్లవారుజామున సుమారు 12.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఢిల్లీ బాబు అంత్యక్రియలు సెప్టెంబర్ 9 సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జరుగుతాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బాబు నిర్మాతగా రాట్ సన్ 9 తెలుగులో( రాక్షసుడు) , ఓ మై కడవులే తెలుగులో ( ఓరి దేవుడా ) రీమేక్ అయ్యాయి, అలాగే జీవీ ప్రకాష్ హీరోగా వచ్చిన బ్యాచిలర్, మిరల్, మరకతమణి వంటి చిత్రాలను నిర్మించారు. ఢిల్లీ బాబు అకాల మరణం యావత్ సినీ వర్గాలను, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళ నిర్మాత డిల్లీ బాబు భౌతికకాయాన్ని చెన్నైలోని పెరుంగళత్తూరులోని ఆయన స్వగృహానికి ఉదయం 10.30 గంటలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. దురదృష్టకర వార్త తెలియగానే పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు G. ఢిల్లీ బాబు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.