మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపార్తవేత్త రామోజీరావు కన్నుమూశారు.. ఆయన మరణం అందరినీ కదిలిస్తోంది.. ఇక, రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. రామోజీ రావు మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు తెలుగు వెలుగు. రామోజీ మృతి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీ అసామాన్య విజయాలు సాధించారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారు అని గుర్తుచేశారు
తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివి అని పేర్కొన్నారు బీజేపీ ఏపీ ఛీప్ దగ్గుబాటి పురంధేశ్వరి.. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకి సంతాపం ప్రకటించిన ఆమె.. ఈనాడు అధినేత రామోజీ రావు లేరన్న వార్త తెలుగు జాతిని శోకసంద్రంలో ముంచిందన్నారు.