Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్ సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు.