Jagadish Shettar: బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈ రోజు(సోమవారం) ఉదయం ఆయన బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.
మరి కొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన ప్రధాన పార్టీలు దశలవారిగా తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలివిడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 189 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 52 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే తొలివిడత జాబితలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.