విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..
శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి వంగలపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నాను అన్నారు. కానీ, ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు బొత్స..
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మహీంద్రా థార్ కారులో వెళ్తూ గన్నవరం - కేశరపల్లి రూట్‌లో కారుతో సహా గల్లంతైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫణి.. సోమవారం బుడమేరులో శవమై తేలాడు.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద యువకుడి ప్రాణాలను ఓ పోలీసు అధికారి కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వరద నుంచి యువకుడిని గన్నవరం సీఐ శివప్రసాద్ రక్షించారు.
బుడమేరు కొల్లేరులోకి ప్రవహించడంతో చుట్టు పక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఏలూరు నుండి కైకలూరు వచ్చే రహదారి మీదగా నీరు ప్రవహించడంతో ముందస్తుగా వాహనాలను నిలిపివేశారు పోలీసులు.. ఈ రాత్రికి కొల్లేరు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని గ్రామాలు నీట మునిగాయి.. కొల్లేరులోకి వరద రెండు అడుగుల మేర పెరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.
కొల్లేరు చేపల చెరువులకు బుడమేరు ముంపు గండం పొంచిఉంది.. బుడమేరుకు వరద పెరగటంతో వేల ఎకరాల్లో ఉన్న చెరువులకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు.. ఇవాళ సాయంత్రానికి బుడమేరు వరద మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.. మరో రెండు అడుగులు వరద పెరిగితే 10 వేల ఎకరాల్లో చెరువులు నీట మునుగుతాయనే భయంతో వ్యాపారుల ఆందోళన నెలకొంది..