రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.