Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో ఎండ ప్రతాపంతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావడం లేదు.అయితే నేడు, రేపు కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొననున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుండగా.. పలుచోట్ల వర్షాలు కూడా కురవనున్నాయి. ఏపీ నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, కర్ణాటక మీదుగా మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
ఏపీకి నేడు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఇక పలు మండలాల్లో 1వ తేదీ వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల తీవ్రత, వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. 2,3 తేదీల్లో ఎలాంటి వర్షసూచన వాతావరణ శాఖ జారీ చేయలేదు. 4వ తేదీన అనకాపల్లి, అల్లూరి సీతారామారాజు, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కోనసీమ, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యాసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. 5వ తేదీ నుంచి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Also: Tirupathi: బస్సును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..
ఇదిలా ఉండగా.. నేడు 15 మండలాల్లో, శుక్రవారం 302 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. రేపటి నుంచి రెండురోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఏపీలో దాదాపు చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి.