Andhrapradesh Weather: రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల స్వల్ప వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. 4వ తేదీ పార్వతీపురం మన్యం, విజయనగరం, కాకినాడ, చిత్తూరు, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనుండగా.. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పడనున్నాయి.
6వ తేదీ వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షాలతో కాస్త ఉపశమనం లభించనుంది. వర్షాలతో పాటు రానున్న మూడు రోజుల పాటు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాల్లోని కొన్ని మండలాలకు తీవ్ర వడగాల్పులు, మరికొన్ని మండలాలకు సాధారణ స్థాయిలో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత, వడగాల్పుల వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మినహా బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచించారు. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Read Also: Odisha Train Accident: 230 దాటిన మృతులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
నేడు అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్రవడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. వైయస్సార్ జిల్లాలోని కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాల్లో.. ఏలూరు జిల్లా కుకునూర్, మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. 256 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు 127 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. నిన్న పల్నాడు జిల్లా ఈపూర్, విజయనగరం జిల్లా కనిమెరక లో 44.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 మండలాల్లో తీవ్రవడగాల్పులు,105 మండలాల్లో వడగాల్పులు వీచాయి . ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.