మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోంమంత్రి అనితా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వీటిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని అడిగారు. చంద్రబాబును ఈ జిల్లా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుటి నుంచి ఒక మాఫియా పాలనా చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారని... వీరి అరాచకాలపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి డబ్బులు, పథకాలు వచ్చేవీ అవన్నీ మాయం అయ్యాయన్నారు.
గుంటూరు శ్యామలా నగర్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై దాడి జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కొంతమంది యువకులు కర్రలు రాడ్లతో వాహనాలపై దాడి చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ చేసింది లేదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇరిగేషన్ , ఇండస్ర్టీలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
పంచ గ్రామాల సమస్యకు టైం బాండ్ పెట్టుకొని పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నగరంలో గుంతల రోడ్లు ఉండటానికి వీలు లేదు.. ఎక్కడైనా ఉంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు.
రాష్ట్రం వెంటిలేషన్ మీద ఉందని.. నేడు వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసుకునే పొజిషన్‌కు వచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తారు కానీ.. ఈ రాష్ర్టానికి అప్పులు ఉన్నాయని చెబితే వినే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం అదృష్టమన్నారు. క్లిష్ట సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని వెల్లడించారు.