Story Board: డబ్బులేకపోతే ఎన్నికలు కష్టం కానీ.. డబ్బుంటే ఏముంది నల్లేరుపై నడకే అనుకునే రోజులు పోయాయి. ఓటర్లను లెక్కపెట్టి.. తలకింత అని నోట్లు విదిల్చేసి.. హాయిగా ఇంట్లో కూర్చునే కాలం కాదిది. ఎంత డబ్బులు పంచినా.. ఓటు పంచిన వారికి పడుతుందనే గ్యారంటీ అసలు లేదు. ప్రజలకు విధేయంగా లేని పార్టీలకు.. తామెందుకు విధేయంగా ఉండాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
దశాబ్దాలుగా ఓటర్లకు డబ్బులు పంచే కల్చర్ కు రాజకీయ పార్టీలు అలవాటుపడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే తంతు నడుస్తోంది. పైగా రాష్ట్రాన్ని బట్టి ఓటు విలువ కూడా మారిపోతోంది. గతంలో పార్టీలు ఓటు విలువ నిర్ణయిస్తే.. ఇప్పుడు ఓటర్లే ఓటు విలువను డిసైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగని నోట్లు తీసుకున్నవాళ్లంతా ఓటేస్తారని గ్యారంటీ లేదు. ఓటు వేసినా.. డబ్బులు పంచిన వారికే వేస్తారనే అసలు నమ్మకం పెట్టుకోవడానికి లేదు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకో.. నచ్చినవారికే ఓటేసుకే అనే నినాదాన్ని ఓటర్లు నమ్ముతున్నారు. అన్ని పార్టీల దగ్గరా మీకే ఓటేస్తాం అని నోట్లు తీసుకుంటున్నారు. పోలింగ్ బూత్ కి వెళ్లాక మాత్రం మనసు చెప్పినవారికే ఓటేస్తున్నారు.
కొన్నేళ్లుగా ఓటర్లు తెలివిమీరిపోయారు. పార్టీలకే చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొందరు దేవుడి మీద ప్రమాణాలు చేయిస్తున్నారు. మరికొందరు ఏకంగా గుడి దగ్గరే డబ్బులు పంచుతున్నారు. ఇంకొందరు స్థానిక సంప్రదాయాల ప్రకారం ఓటర్ల దగ్గర మాట తీసుకున్నారు. ఇన్ని చేసినా ఓటర్లను పోలింగ్ బూత్ దాకాతీసుకెళ్లగలం కానీ.. ఓటుకు గ్యారెంటీ ఇవ్వలేమంటున్నారు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వరకూ ఓటర్లు నోటుకు కట్టుబడి ఉండేవారు. డబ్బులు తీసుకున్నాం కదా.. ఓటేయకపోతే బాగోదనే భావనతో ఓటేసేవారు. కానీ ఇప్పుడలా కాదు. డబ్బులేమైనా వారి జేబులోంచి ఇస్తున్నారా.. మనవే కదా అనే ధోరణి పెరిగిపోయింది. దీంతో ఎవరు ఎన్ని డబ్బులిచ్చినా మారు మాట్లాడకుండా తీసుకుంటున్నారు. ఎవరు డబ్బులిస్తున్నారో తెలుసుకుని మరీ వెళ్లి తీసుకుంటున్నారు. కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలనుకుంటే వారికే వేస్తున్నారు.
Also Read: Suryakumar Yadav: ఇది బిగ్ మూమెంట్.. చాలా సంతోషంగా ఉంది: సూర్యకుమార్
అసలు డబ్బులు పంచే సమయానికి ముందే ఓటర్లు ఏ పార్టీకి ఓటేయాలో ఫిక్స్ అవుతున్నారు. అందే డబ్బుల్ని బట్టి ఆ నిర్ణయం మార్చుకోవడం లేదు. సాధారణంగా పోలింగ్ తేదీకి కొన్ని నెలల ముందే ఓటర్లు ఏ పార్టీకి ఓటేయాలో ఫిక్స్ అవుతారనేది సర్వేల సారాంశం. ఆ తర్వాత ఎంత ప్రచారం చేసినా.. మనసు మార్చుకునేవారు చాలా తక్కువ. అలాంటప్పుడు డబ్బులతో ఓటర్ల మనసు మార్చాలనుకోవడం అత్యాశే అంటున్నారు నిపుణులు. ఏదో దింపుడు కళ్లెం ఆశతో పార్టీలు ప్రయత్నించడమే కానీ.. నోట్లు ఓట్లు రాల్చవని తేల్చేస్తున్నారు. పార్టీలు, నేతలు ఇప్పటికైనా ఓటర్లను కొనలేం అనే సంగతి గ్రహించాలని హితవు చెబుతున్నారు.
ఓటర్లకు నోట్లు పంచాక.. వారితో ఓటు వేయించుకోవడం.. రోజువారీ వడ్డీ వసూలు చేసుకోవడం కంటే చాలా కష్టంగా ఉందంటున్నారు నేతలు. డబ్బులు అందేదాకా ఒకలా.. తర్వాత మరోలా మాట్లాడే ఓటర్లకు కొదువలేదు. ప్రమాణం చేసారు కదా.. అంటే మీరిచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా అని కౌంటర్లు వేస్తున్నారు. పైగా ఎవరి డబ్బులిచ్చారు.. మా డబ్బులే మాకిచ్చారు అని మాట్లాడుతున్నారు. దీంతో నేతలు సైలంటైపోతున్నారు. ఇక్కడ గ్రామీణ, పట్టణ ఓటర్లనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఇదే వ్యవహారశైలి కనిపిస్తోంది. గతంలో మాదిరిగా డబ్బులు తీసుకుని ఓటెందుకు వేయలేదని నిలదీసే పరిస్థితి లేదు. అసలు డబ్బులు పంచారు కదా.. ఇంకా రోజువచ్చి విసిగిస్తారే అని ఓటర్లే కసురుకుంటున్నారు.
పోలింగ్ రోజుదాకా కనిపించొద్దని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో నేతలు బిత్తరపోతున్నారు. ఇంకొందరు ఓటర్లైతే డబ్బులివ్వడం మీ అవసరం.. ఏదో మాకోసం ఇస్తున్నట్టు మాట్లాడతారే అని విసుక్కుంటున్నారు. దీంతో డబ్బులు పంచినా ఓటుకు గ్యారంటీ లేదని క్యాడర్ అభ్యర్థులకు తేల్చి చెబుతోంది. నానాతిప్పలు పడి డబ్బు సమకూర్చుకుని మరీ నోట్లు పంచితే.. చివరకు ఓట్లు పడకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతామని నేతలు నిట్టూరుస్తున్నారు. మరికొందరు ఓటర్లను బతిమిలాడుతున్నారు. దయచేసి తమ బాధలు అర్థం చేసుకోమని అడుగుతున్నారు. కానీ ఓటర్ల మనసు కరగడం లేదు. చాల్లే దొంగ ఏడుపులు అని ఈసడిస్తున్నారు. ఎవరు గెలిచినా మా బతుకులు మారవు.. డబ్బులిస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం.. నచ్చినోడికే ఓటేస్తాం అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పైగా ఓటు తమకే వేయాలని నిర్బంధిస్తున్నారంటూ ఎదురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఎక్కడ ఈసీ సీరియస్ గా తీసుకుంటుందోనని రాజకీయ పార్టీలు కూడా నోరు మెదపటం లేదు. ఇలా ఓటర్లు తెలివిమీరిపోయి.. నేతల్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.
Also Read: Japan Movie: ‘జపాన్ ‘ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఐదేళ్లూ మాతో ఆడుకున్నారు. ఇప్పుడు మా టైమొచ్చిందని సినిమా చూపిస్తున్నారు. ఓటర్లు ఇలా తయారయ్యారేంటని నేతలు తల పట్టుకుంటున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నారు ఓటర్లు. డబ్బుల కోసం నేతలు కక్కుర్తిపడుతున్నప్పుడు.. డబ్బులు తీసుకుని నచ్చినవారికి ఓటేయడం తప్పెలా అవుతుందని నిలదీస్తున్నారు. ఈసీ కంటపడకుండా నోట్లు పంచాలి. అడిగినంత ఇవ్వాలి. ఓటేసినా.. వేయకపోయినా సైలంట్ గా ఉండాలి. ఇప్పటికింతే అంటున్నారు ఓటర్లు. దీంతో నేతలు కూడా ఎన్నికల్లో పంచే డబ్బు దేవుడి హుండీలో వేసినట్టే అని సరిపెట్టుకోవడం అలవాటుచేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పైగా ఐదేళ్లూ ఓటర్లను పట్టించుకోని పాపానికీ.. ఓటు సాకుతో అయినా జరిమానా కట్టక తప్పదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు.
ఓటర్లు అందరికీ జై అంటున్నారు.. ఓటు అడగడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మా ఓటు మీకే అంటూ సమాధానం ఇస్తున్నారు. ఈ సమాధానం విన్న అభ్యర్థులు తాము ఈ ఎన్నికలలో గెలుస్తామా.. లేదా ?అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు తెలివిగా ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై కొడుతున్నారు. నిజంగా ఓటర్లు డబ్బు, మద్యం, ఉచిత పథకాలు చూసే ఓట్లు వేసి ఉంటే.. చరిత్ర మరోలా ఉండేది. కానీ ఓటర్లు అందరినీ గమనిస్తుంటారు. అన్ని చూస్తుంటారు. ఈవీఎంలో ఓటు వేసే ముందు వారి మనసు మాటే వింటారు. ఎవరిని గెలిపించాలి..? ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందన్నది ఓటర్లు ఆలోచిస్తున్నారు. అందుకే తీర్పులు నాయకులు కోరుకున్నట్టుగా కాకుండా.. ఓటర్లు కోరుకుంటున్నట్టు ఉంటున్నాయి. చూసేవారి కోణంలోనే మార్పు ఉంది.. నాయకుల ఆలోచనల్లో తేడా ఉంది.. కానీ ఓటర్లు ఎప్పుడూ విజ్ఞతతోనే ఓటేస్తున్నారన్నది గత కొన్ని దశాబ్ధాలుగా ఓటర్ల తీర్పుతో తేలిన నిర్వివాదాంశం. నిజంగా ఎన్నికల్లో డబ్బు, మద్యం, అధికార బలం మాత్రమే శాసిస్తే ప్రతి చోటా డబ్బున్న నాయకుడే గెలవాలి. కానీ అలా జరగడం లేదంటే.. డబ్బుతో ఓటర్లను కొనలేరని తేలిపోయినట్టే.