Constitution of India : దేశం సమాఖ్య రాజ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. కానీ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. అసలు దేశంలో ఫెడరలిజం ఉందా అనే ప్రశ్నలు వచ్చేలా చేస్తున్నాయి. రాష్ట్రాలకూ కొన్ని అధికారాలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి.. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. జీఎస్టీ దగ్గర్నుంచి విద్యుత్ వరకు ఏ చట్టం తీసుకున్నా.. కేంద్రం మాటే నెగ్గింది. చివరకు బియ్యం కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్రాల మాట చెల్లుబాటు కాకపోవడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
దేశంలో సమాఖ్యవాదం మాటలకే పరిమితమౌతోంది. కేంద్రం పైకి సమాఖ్య స్ఫూర్తి అంటున్నా.. ఆచరణలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తోందని కొందరు సీఎంలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమన్వయం లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమౌతోంది.
రాష్ట్రాల సమిష్టి కృషి వల్లే దేశం కరోనా మహమ్మారి నుంచి బయటపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అంటుంటారు. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమాఖ్య స్వరూపాన్ని తీర్చిదిద్దారు. కానీ గత కొంతకాలంగా.. కేంద్ర ప్రభుత్వ ధోరణి భిన్నంగా ఉంటూ రాష్ర్టాలను ఉక్కిరి బిక్కిరి చేసే విధంగానూ, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగానూ ఉంటోందనే వాదన ఉంది. కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాలు రాష్ర్టాల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నప్పుడు, దేశాభివృద్ధిలో తగిన వాటా దక్కనప్పుడు అది దేశాభివృద్ధికే గాక, సమాఖ్య స్ఫూర్తినే ప్రమాదంలో పడేస్తుంది.
అధికారంలో లేనప్పుడు సమాఖ్య స్ఫూర్తి, కేంద్రం సహకారం, బాధ్యత గురించి మాట్లాడిన పార్టీలు, అధికారంలోకి రాగానే అవి కూడా పాత పాటనే పాడుతుండటం విషాదం. ఈ విధమైన ధోరణి దేశంలో ఒక విషవలయంగా మారింది. అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాటగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఘనతకెక్కిన మన దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంప్రదాయాల వారు సహజీవనం చేస్తున్నారు. మన ప్రాచీన ఇతిహాసాలు చెప్పిన వసుధైక కుటుంబం స్ఫూర్తిని గౌరవిస్తూ, పాటిస్తూ విభిన్న వర్గాలు భిన్నత్వంలో ఏకత్వం విలువతో శాంతియుత జీవనం కొనసాగించటం మన దేశ ప్రత్యేకత. దీన్ని గౌరవించటం, కొనసాగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ భుజస్కంధాలపై ఉంటుంది. రాష్ర్టాలు అభివృద్ధి చెందినప్పుడే భారత్ ఒక దేశంగా అభివృద్ధి చెందుతుంది.
సమాఖ్య విధానంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలనేవి అతి ప్రధానమైనవి. ఒకరకంగా ఇదే మూలస్తంభం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దృఢమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యత ఏర్పర్చే క్రమంలోనే హక్కులు, బాధ్యతలను రాజ్యాంగం వర్గీకరించింది. హక్కులు, బాధ్యతలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా విభజించారు. ఉమ్మడి జాబితా ఆసరాతో కేంద్రం రాష్ర్టాల హక్కుల్లోకి చొరబడుతోందనే విమర్శలున్నాయి. ఈ మధ్యకాలంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లులు. ఇలాంటి చట్టాలు రాష్ర్టాలకు ముఖ్యంగా రాజకీయంగా ప్రబలశక్తిగా లేని రాష్ర్టాలకు శరాఘాతాలుగా మారుతున్నాయి. దీనివల్లే చాలా సందర్భాల్లో రాష్ర్టాల హక్కులకు భంగం కలిగినప్పుడల్లా ఫెడరల్ నినాదం ముందుకొస్తోంది.
భారతదేశ అస్తిత్వం దానికదిగా ప్రత్యేకమైనది కాదు. ఇది రాష్ర్టాలతో కూడినదే కాకుండా.. రాష్ర్టాల నుంచి వచ్చే పన్నులపై ఆధారపడినది. ఇదంతా రాజ్యాంగబద్ధంగా నిర్వచించుకున్నది. అంటే.. ఏవో కొన్ని రాష్ర్టాల ప్రయోజనాల కోసం దేశంలోని మిగతా రాష్ర్టాల నుంచి వచ్చే పన్నులను అప్పనంగా వినియోగించాలని కాదు. బిమారుగా పిలువబడుతున్న బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు.. మిగతా రాష్ర్టాలు కేంద్రానికి ఇస్తున్న పన్నుల నిధులను వెచ్చించటం కాకూడదు. ఈ మధ్యకాలంలో ఇది కొంత మారినా.. కేంద్రం అనుసరిస్తున్న విధానం మాత్రం స్థూలంగా ఈ విధంగానే ఉంటున్నది. రాష్ర్టాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల నుంచి ఆ రాష్ర్టాలకు వాటాగా దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా కొన్ని రాష్ర్టాలకే వెచ్చిస్తున్న పరిస్థితి ఉంటున్నది. ఇది ఎంత మాత్రమూ అనుసరణీయం, ఆమోదయోగ్యం కాదు. దీంతో కొన్ని రాష్ర్టాల్లో నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడటమే కాదు, ఆ రాష్ర్టాలు వెనకబడిపోయే ప్రమాదం ఉన్నది. ఒక కుటుంబంలో నలుగురు పిల్లలుంటే.. అందులో ఇద్దరు మంచిగా పనిచేస్తూ ప్రయోజకులుగా మారి ఉన్నతి దిశగా పయనిస్తుంటే.., మరో ఇద్దరు ఏ పని చేయకుండా అప్రయోజకులుగా మారి ఎదగకుండా ఉంటున్నప్పుడు.. వృద్ధి చెందుతున్న వారి నుంచి అప్రయోజకులకు ఫలాలు అందించటం సబబేనా? సక్రమమేనా? ఒకస్థాయి వరకు ఇది కొంత సమంజసమైనా.. ఇలాంటిది ఎంతకాలం అనే ప్రశ్న ముందుకువస్తుంది. ఇది సుదీర్ఘకాలం కొనసాగితే.. పర్యవసానం విపరీతాలకు దారితీస్తుంది. కష్టించి పనిచేస్తూ ప్రయోజకులైనవారు వృద్ధిలో వెనకబడిపోవటం ఒకవైపు జరిగితే.. అప్రయోజకులు పరాన్నభుక్కులై కుటుంబానికే భారంగా తయారవుతారు. ఇది అంతిమంగా కుటుంబ ప్రయోజనానికీ, అభివృద్ధికీ ఆటంకంగా మారుతుంది. ఈ నీతినే రాష్ర్టాలకూ వర్తింపజేసుకుంటే.. ఫలితమేంటో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాలు ఉచిత పథకాల పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని కేంద్రం వాదిస్తోంది. పరిమితికి మించి చేసే అప్పులకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ ఉండాలంటోంది.
పెరుగు, పనీర్, తేనె వంటి వాటిపైనా జీఎస్టీ విధించటాన్ని ఆర్థిక మంత్రి సమర్థించుకుంటూ.. రాష్ర్టాలు కూడా భాగస్వాములుగా ఉండే జీఎస్టీ మండలి ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. జీఎస్టీ మండలి నిర్ణయాలన్నీ కేంద్రం, బీజేపీ రాష్ర్టాలు కూడబలుక్కొని ఏకపక్షంగా తీసుకుంటున్నాయని, తమ అభిప్రాయానికి ప్రాధాన్యతే ఉండటం లేదని పలు విపక్ష పాలిత రాష్ర్టాలు వాపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులను ఎంతలా బాధపెడుతున్నాయో యూపీకి చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోడీకి రాసిన లేఖ వెల్లడిస్తుంది. దేశంలో కోట్లాదిమంది నిరుపేద కూలీలకు అంతోఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తున్నది కేంద్రప్రభుత్వం. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులను 25 శాతం తగ్గించటమే ఇందుకు నిదర్శనం. ఉపాధి హామీ కింద ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయటం లేదని, రాష్ర్టాలను సమన్వయం చేసుకొని వెళ్లటం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలే తీవ్రంగా ఆక్షేపించింది. ఈ పరిస్థితి చూస్తుంటే మొత్తం పథకానికే ఎసరు పెట్టే ఆలోచనలో సర్కార్ ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని చేయాల్సి చట్టాలను కూడా ఏకపక్షంగా తెస్తుండటంతో.. సమస్య ముదురుతోంది. రాష్ట్రాలకు నేరుగా సంబంధం ఉన్న రంగాల్లో అయినా.. ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలి. కానీ అది కూడ జరగకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఆఖరికి బియ్యం కొనుగోళ్లు కూడా కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన వచ్చిన పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి.
దేశం సమాఖ్య స్ఫూర్తితో నడుస్తుందా? . ఇటీవలి కాలంలో ఈ ప్రశ్న తరచుగా తెరపైకి వస్తోంది. విపక్ష పాలిత రాష్ట్రాలపై అప్రకటిత వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
భారత సమాఖ్య విధానంపై ప్రప్రథమ ప్రధాన దాడి 1959లో కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంపై జరిగింది. అధికరణ 356 (రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంలో కేంద్ర ప్రభుత్వ అధికారాలను వివరిస్తుంది)ను ఉపయోగించడం ద్వారా, ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.
నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న 17 ఏళ్ళ కాలంలో అధికరణ 356ను మొత్తం ఎనిమిదిసార్లు ప్రయోగించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత ఆ అధికరణను తరచుగా ఉపయోగించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989 సార్వత్రక ఎన్నికలలో ఓడిపోవడంతో భారత రాజకీయాలలో ఇందిర శకం అంతమయింది. రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన దరిమిలా పాతిక సంవత్సరాల పాటు సంభవించిన రాజకీయ పరిణామాలను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఆ కాలం భారత సమాఖ్య విధానంలో స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు. లైసెన్స్-పర్మిట్‌రాజ్ వ్యవస్థ కూలిపోయింది. సార్వత్రక ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వకుండా దేశ పౌరులు అపూర్వ ప్రజాస్వామిక వివేకాన్ని ప్రదర్శించారు. అదే కాలంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. పాలనలో సహకార భావన విలసిల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం గౌరవించుకున్నాయి.
2014 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ గెలవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత సమాఖ్య విధానానికి మళ్లీ ముప్పు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన విధానాలను, ముఖ్య చట్టాలను వాటిని అమలుపరచవలసిన రాష్ట్రాలను సంప్రదించకుండా రూపొందిస్తున్నారు. కేంద్రం ఇటీవల ఉపసంహరించుకున్న మూడు సాగు చట్టాలే ఇందుకొక ఉదాహరణ. అలాగే విద్య, సహకార సంఘాలు, బ్యాంకింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిర్ణయాలను కూడా కేంద్రమే స్వయంగా తీసుకుని వాటిని రాష్ట్రాలపై రుద్దుతోంది.
శాంతిభద్రతలు. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అయినప్పటికీ కేంద్రం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచింది. తమ అధికార పరిధిలోని ప్రాంతాలలో స్వతంత్రంగా చర్యలు చేపట్టలేని పరిస్థితిని కల్పించింది. రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు ఊపాను విచక్షణారహితంగా ప్రయోగించింది. జాతీయ దర్యాప్తు సంస్థకు విస్తృత అధికారాలు కల్పించింది. రాష్ట్రాలను సంప్రదించడం ద్వారా దేశాన్ని కలసికట్టుగా నడిపించేందుకు కొవిడ్ ఉపద్రవం ఒక అవకాశాన్ని కల్పించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంతవరకు కొవిడ్‌ను ఒక మహమ్మారిగా ప్రకటించడాన్ని వాయిదా వేసింది. ఆ తరువాత కేవలం నాలుగు గంటల వ్యవధిని మాత్రమే ఇచ్చి లాక్‌డౌన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలను మాత్రమే కాదు, కేంద్రమంత్రి మండలిని కూడా సంప్రదించకుండానే లాక్‌డౌన్‌ను ప్రకటించారు. లాక్‌డౌన్‌తో పాటు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కూడా ప్రయోగించారు. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించనే లేదు.
తమను వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచేందుకు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మొదలైన దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని ఆరోపణలున్నాయి. తమను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతి ప్రకారం దాడి చేయడానికే ఆలిండియా సివిల్ సర్వీస్ రూల్స్ సవరణకు పూనుకున్నారని కూడా గగ్గోలు పుడుతోంది. వ్యక్తిపూజను పెంపొందించడం. భారత్ ఒక సమాఖ్య రాజ్యం అన్న భావనను బలహీనపరుస్తోంది. విద్యావైద్యాలు, సాంఘిక సంక్షేమం మొదలైన రంగాలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాల అమలును ప్రధానితో వ్యక్తిగతంగా ముడిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. వ్యక్తి పూజ రాష్ట్రాలపై గుర్తించని ఆర్థిక భారాన్ని కూడా మోపుతోంది. పిఎమ్ -కేర్స్ ఫండ్‌నే తీసుకోండి. అదంతా ఒక గోప్య వ్యవహారం. జవాబుదారీతనం పూర్తిగా కొరవడిన ఆ ఫండ్ సమాఖ్య విధాన సూత్రానికి పూర్తి ఉల్లంఘన. ఈ ఫండ్‌కు వివిధ కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న విరాళాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పన్ను మినహాయింపు ఇస్తున్నారు. అయితే ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ముఖ్యమంత్రి సహాయక నిధికి వచ్చే విరాళాలకు అటువంటి పన్ను మినహాయింపు ఏదీ లేదు.
కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. అలా ఇవ్వాల్సిన పని లేకుండా సుంకాలు విధించడాన్ని కూడా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కోవిడ్ కాలంలో కేంద్రం కంటే రాష్ట్రాలే అధిక నిధులు ఖర్చు చేశాయని, కానీ దానికి తగ్గట్టుగా ఊరట మాత్రం దక్కలేదని ముఖ్యమంత్రులు వాపోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలకు మధ్య వారధిగా ఉండాల్సిన వ్యవస్థలపై కూడా పక్షపాతం చూపుతున్నాయనే విమర్శలు రావడం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం లాంటి దేశంలో.. రాష్ట్రాల్ని విస్మరిస్తే.. భిన్నత్వాన్ని మర్చిపోయినట్టేననే వాదన వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల పరిధులపై రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా.. అనవసర వివాదాలు కొనితెచ్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాల కలిసికట్టుగా పనిచేయాలి. అంతకానీ ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే అనవసర చర్చ తీసుకొస్తే.. అసలు విషయం పక్కతోవ పడుతోంది. ఈ సంగతి తెలిసినా ప్రభుత్వాలు పద్ధతి మార్చుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం బలోపేతమైతే తప్ప.. ఇలాంటి పోకడలకు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా రాజ్యాంగ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటేనే.. ఫెడరలిజం బతకి బట్టకడుతుంది.
మన రాజ్యాంగపు మౌలిక లక్షణాలలో ఫెడరలిజం ఒకటి.రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాలు ఒక జాబితాగా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలు మరొక జాబితాగా, రెండింటి పరిధిలోనూ ఉండేవి మూడో జాబితాగా పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో రాష్ట్రాల పరిధిలో ఉండే అంశాలలోకి చొరబడడానికి కేంద్రం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వుంది. అయితే ఈ ధోరణి ప్రస్తుతం మరింత జోరందుకుంది. అప్రకటితంగానే ఈ దేశాన్ని ఒక కేంద్రీకృత పాలనా వ్యవస్థ కిందకు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఏమాత్రం అతిశయోక్తి కాదు.
రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా అమ్మకం పన్ను ఉండేది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానికి బదులు జిఎస్‌టి వ్యవస్థ లోకి వచ్చేందుకు రాష్ట్రాలను ఒప్పించారు. ఈ జిఎస్‌టి వ్యవస్థ ప్రధానంగా కేంద్రం డామినేట్ చేసే జిఎస్‌టి కౌన్సిల్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలా జిఎస్‌టి లోకి మారినందున రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గనుక తగ్గితే ఆ మేరకు దానిని కేంద్రం భర్తీ చేస్తుందన్న హామీ ఇచ్చి రాష్ట్రాలను ఒప్పించారు. ఇప్పుడు కేంద్రం చల్లగా ఆ హామీని అటకెక్కించింది. ఇప్పుడు రాష్ట్రాలకు మూడే మూడు వస్తువుల పైన తప్ప తక్కిన వేటిపైనా పన్ను విధించే అధికారం లేకుండా పోయింది. కేంద్రం ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు.
ఆర్థిక వనరులపై అధికారం మాత్రమే కేంద్రీకృతం అయిందనుకుంటే పొరపాటు. నిర్ణయాధికారాలు కూడా కేంద్రీకృతం అవుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఉదాహరణకు విద్యారంగాన్ని తీసుకోండి. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. కాని, రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రాలు మర్యాదగా దానిని అంగీకరించి అమలు చేయాల్సిందే. అలాగే వ్యవసాయం. ఇది రాష్ట్రాల జాబితాలో ఉంది. కాని కేంద్రం పార్లమెంటులో హడావుడిగా మూడు బిల్లులనూ ఆమోదింపజేసుకుంది. ఇందులో రాష్ట్రాలను సంప్రదించినదీ లేదు. ఈ బిల్లులు దేశంలో ఉన్న వ్యవసాయ విధానంలో చాలా తీవ్రమైన మార్పులను తీసుకువచ్చి రైతాంగాన్ని చాలా దెబ్బతీయడమేగాక, రాష్ట్రాల ఆదాయ వనరులను కూడా దెబ్బతీయనున్నాయి.
నీతి అయోగ్ సమావేశాల ఎజెండా తయారీలో రాష్ట్రాల సహకారం తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు వార్షిక ప్రణాళికలు రూపొందించే సమయంలో రాష్ట్రాలతో వివరణాత్మక చర్చలు జరిపేది. ఇప్పుడు ఒక ప్రణాళిక లేదు.. రాష్ట్రాల ప్రమేయం లేదని విమర్శలున్నాయి. నీతి ఆయోగ్ సమావేశాల ప్రక్రియ అర్ధవంతమైన చర్చలకు అతి తక్కువ అవకాశం ఇస్తోంది. ఎందుకంటే సమావేశంలో పాల్గొనే ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్రాల పరిధిలోకి చొరబడడమేకాదు, వాటి ఉనికిని కూడా ఏకపక్షంగా కేంద్రం మార్చివేయవచ్చు. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాన్ని అక్కడి అసెంబ్లీ ఆమోదం లేకుండానే కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తీరు ఇందుకు నిదర్శనం. అప్పుడు ఆ రాష్ట్రం గవర్నరు పాలన కింద ఉన్నది కనుక, గవర్నరు ఆమోదం తెలిపారు గనుక రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి రాష్ట్ర ఆమోదం లభించినట్టేనని కేంద్రం అంటోంది. తాము నియమించిన గవర్నరు నుండి ఆమోదం వస్తే అది రాష్ట్రం నుండి వచ్చినట్టేనని చెప్పుకుంటోంది. గవర్నరు ఆమోదం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదంతో సమానం అన్న కేంద్రం వాదన చట్టబద్ధమే అయితే రేపు వేరే ఏ రాష్ట్రాన్నైనా విడగొట్టాలనుకుంటే ముందు దానిని గవర్నరు పాలన కిందకు తెచ్చి ఆ గవర్నరు ఆమోదం తీసుకుని ఆతర్వాత రాష్టాన్ని ముక్కలు చేసేయవచ్చునన్నమాట. ఇలా రాష్ట్రం మనుగడే కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన పరిస్థితి వచ్చిందంటే మనం ఒక కేంద్రీకృత పాలనావ్యవస్థ దిశగా చాలా దూరం వచ్చేసినట్టేనని భావించాల్సి వుంటుంది.
మన దేశంలో ప్రతి పౌరుడికీ ద్వంద్వ జాతీయ చైతన్యం ఉంటుంది. మన దేశ పౌరుడు ఏదో ఒక ప్రాంతీయ-భాషా సమూహానికి చెందివుంటాడు. ఒక తెలుగువాడిగానో, బెంగాలీగానో, మలయాళీగానో, తమిళుడిగానో ఉంటాడు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఒక భారతీయుడిగా కూడా ఉంటాడు. ఈ రెండు రకాల చైతన్యాలూ జాతీయోద్యమకాలంలో పెనవేసుకుని బలపడ్డాయి. అందుచేత స్వాతంత్య్రానంతర కాలంలో ఈ రెండింటినీ సమన్వయం చేసే ఒక రాజకీయ వ్యవస్థ అవసరమైంది. అదే ఫెడరల్ వ్యవస్థ. ఆ విధంగా జాతీయోద్యమం పెంపొందించిన చైతన్యం ఈ ఫెడరల్ రాజ్యాంగం రూపకల్పనలో పాత్ర పోషించింది. ఈ రెండు తరహాల చైతన్యాల నడుమ ఉండే సున్నితమైన సమతుల్యతను నిలబెట్టుకోవాలంటే ఈ ఫెడరల్ స్వభావాన్ని నిలబెట్టుకోవాలి. అతిగా ఒకవైపు నొక్కి కేంద్రీకరణకు పూనుకుంటే అది ప్రాంతీయ-భాషా చైతన్యం గాయపడడానికి, దరిమిలా వేర్పాటుతత్వానికి, ఆఖరుకు దేశం నుండే వేరుపడాలనే డిమాండ్‌కు దారితీస్తుంది.
వ్యవసాయ బిల్లులనే తీసుకోండి. వీటిని రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో గనుక ప్రవేశపెడితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దానికి సవరణలు, మార్పులు వస్తాయి. కానీ రాజ్యాంగాన్ని తోసిరాజని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దారు. ఇలా చేయడం చట్టరీత్యా చెల్లుతుందా లేదా అన్న చర్చ ఉంది. కేవలం రాజకీయ, ఆర్థిక అంశాలకు మాత్రమే ఈ కేంద్రీకరణ పరిమితం కాదు. సాంస్కృతిక రంగంలో, విద్యా రంగంలో సమాంతరంగా ఈ కేంద్రీకరణ సాగుతోంది. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నంనుంచి ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు కనపడుతోంది. కాని ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తుంది. నూతన విద్యా విధానంలో బోధనాంశాలను మొత్తంగా కేంద్రీకృతంగానే నిర్ణయిస్తారు. రాష్ట్రాలను సంప్రదించవలసిన అవసరం లేదు. అందుచేత ఒకే సంస్కృతి పేరుతో బలవంతంగా ఈ దేశంలోని భిన్నత్వాన్ని నాశనం చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. బలవంతంగా పైనుండి రుద్దే ఏకరూపత వలన మన దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వుంటుంది. వైవిధ్యం కలిగిన ప్రాంతీయ-భాషా చైతన్యాన్ని గనుక ఉపేక్షిస్తే అది ఈ దేశ భవిష్యత్తునే ప్రమాదం లోకి నెడుతుంది.