Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో సగం జనాభా. 40 శాతం జీడీపీ. 26 శాతం అంతర్జాతీయ వాణిజ్యం.. ఇదీ ప్రస్తుతం బ్రిక్స్ దేశాల ఆర్థిక సత్తా. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో.. బ్రిక్స్ సదస్సు ఇచ్చే సందేశం కీలకం కానుంది. అదే సమయంలో డాలర్ ఆధిపత్యానికి బీటలు వారే ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది. బ్రిక్స్‌లో భారత్, చైనా, రష్యా అవలంబించే వైఖరిని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. సిల్వర్ జూబ్లీ పూర్తిచేసుకున్న బ్రిక్స్.. కీలక మలుపులో ప్రపంచ గతిని మలుపు తిప్పే నిర్ణయాలకు వేదిక అవుతుందా.. లేదా అనేది ఆసక్తికరం. గడిచిన రెండున్నర దశాబ్దాల్లో బ్రిక్స్ కొన్ని సమస్యలను ఎదుర్కొంది, కొన్ని విజయాలూ సాధించింది. కొంతమంది విశ్లేషకులు బ్రిక్స్‌ను కబుర్లతో కాలక్షేపం చేసే సంస్థగా తీసిపడేస్తుంటే, మరికొందరేమో బ్రిక్స్ దేశాలు, వాటి ఆశయాలు ప్రత్యేక పరిగణనకు అర్హమైనవని వాదిస్తున్నారు. జీ20, జీ7, ఎస్సీవో వంటి బహుళపక్ష సంస్థలు ప్రాధాన్యాన్ని సంతరించుకోవడానికి కష్టపడుతుంటే, వర్ధమాన దేశాలకు కీలక వేదికగా బ్రిక్స్ గుర్తింపు తెచ్చుకుంటోంది. అయినప్పటికీ, అది తీవ్రమైన సవాళ్లనూ ఎదుర్కొంటోంది.
బ్రిక్స్ ఒక సాధికార ఒప్పందం ద్వారా ఏర్పడిన సంఘం కాదు. పెద్దమనుషుల తరహాలో వివిధ అంశాలపై చర్చించుకుని, పరిష్కారం కనుగొనడానికి ఏర్పడిన అనధికార వేదిక అది. అయినా నేటి ప్రపంచంలో ముఖ్యమైన బహుళపక్ష సంస్థగా పేరుతెచ్చుకుంది. ప్రపంచంలో నేడు అశాంతి, ఉద్రిక్తతలు నెలకొని ఉండటంతో ఈసారి బ్రిక్స్ సదస్సుపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. ఫిబ్రవరి 2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రతిష్టంభనకు దారితీసింది. బ్రిక్స్ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఈ యుద్దంలో అమెరికా వైపు ఉండి, ఇరాన్ ప్రతిదాడికి గురవుతున్నాయి. ఇరాన్ మొదటినుంచీ అమెరికా, ఇజ్రాయెల్‌లకు బద్ధ విరోధి. ఇరాన్, సౌదీ, యూఏఈల వైరం బ్రిక్స్ వేదికలో చీలికను చూపుతోంది. అయినప్పటికీ, బ్రిక్స్ సదస్సు మంచి ఫలితాన్ని ఇస్తుందనే ఆశ ఎంతోకొంత ఉంది. మూడేళ్ల కిందట జోహన్సెస్‌బర్గ్, కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశాలు సభ్యత్వ విస్తరణపై దృష్టి పెట్టాయి. అది ఫలించి ఇప్పుడు యురేసియా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల నుంచి మొత్తం 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాలు బ్రిక్స్ ఛత్రం కిందకు చేరాయి. బ్రిక్స్‌లో భాగస్వామి అయిన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాక జూలై 2025లో రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పెద్దగా సందడి కనిపించలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు గణనీయ ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Also Read
- Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
- Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
- Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలను పరిష్కరించడంలో బ్రిక్స్ ఇప్పటివరకూ ముఖ్య పాత్ర పోషించలేకపోయిన మాట వాస్తవం. ఈ రెండు ఘర్షణలలో పాత్రధారులైన రష్యా, ఇరాన్‌లు బ్రిక్స్ సభ్యదేశాలే. అందువల్ల కూటమిలో అంతర్గత చీలికలు వాస్తవం. కానీ బ్రిక్స్ ఆ చీలికలతో జీవించడం నేర్చుకుంది. ఈ రెండు యుద్ధాలకు కారకులెవరో నిశ్చయించకుండా… సంభాషణ, దౌత్యాల ద్వారా శాంతిసయోధ్యలను సాధించాలని బ్రిక్స్ సదస్సు పిలుపిచ్చే అవకాశం ఉంది. బ్రిక్స్ స్పష్టమైన ఒకేస్వరంతో అలా పిలుపిస్తే దానికి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే భారత్ ఏకాభిప్రాయ సాధనకు శాయశక్తులా ప్రయత్నించనుంది. మరోవైపు ఇరాన్‌పై తాజాగా అమెరికా ప్రకటించిన కరకు వైఖరి బ్రిక్స్‌కు ఇబ్బందులు కలిగించవచ్చు. ఇరాన్‌పై ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ని ప్రారంభించనున్నట్లు అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ ఇటీవల ప్రకటించారు. దీని ఉద్దేశం ఇరాన్ ఆర్థిక జీవనాడులన్నింటినీ కత్తిరించి ఒంటరి చేయడం. టెహరాన్‌తో ఆర్థిక సంబంధాలు ఉన్న దేశాలు ఇరాన్‌ను లేదా అమెరికాను ఎంచుకోవాలని వాషింగ్టన్ పేర్కొంది. బ్రిక్స్ సదస్సు ఈ క్లిష్టమైన సవాలును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. జరుగుతున్న ఘర్షణలను పరిష్కరించడంలో బ్రిక్స్ అశక్తత స్పష్టంగానే తెలుస్తున్నప్పటికీ… రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారం, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని బ్రిక్స్ దేశాల నాయకులు మరోసారి చెప్పే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలను బ్రిక్స్ గట్టిగా ప్రతిపాదించనుంది. కానీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం దక్షిణాఫ్రికా అభ్యర్థిత్వాన్ని సాటి ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ఇథియోపియాలు ప్రశ్నించడం చిక్కులను సృష్టించనుంది. దీనివల్ల భారత్, బ్రెజిల్లకూ ఆశాభంగం ఎదురుకావచ్చు.
ఆచరణాత్మక సహకారాన్ని ఉమ్మడిగా వివిధ రంగాలకు విస్తరించడానికి ఈ ఏడాది బ్రిక్స్ ఛైర్మన్ హోదాలో భారత్ ప్రయత్నిస్తుంది. స్థితిస్థాపకత, నవీకరణ, సహకారం, సుస్థిరత అనే లక్ష్యాల సాధనకు ముందుకు సాగుతుంది. మానవాళి శ్రేయస్సుకే అగ్ర ప్రాధాన్యమనే నినాదంతో పురోగమిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేచారు. ఆర్థికం, వాణిజ్యం, పర్యావరణం, సంస్కృతి, విద్య, పరిశ్రమలు తదితర రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసువాకోలనే పిలుపు కూడా బ్రిక్స్ సదస్సులో వెలువడుతుందని ఆశిస్తున్నారు. అయితే, దాన్ని ఆచరించి చూపడంలోనే బ్రిక్స్ సత్తా బయటపడుతుంది. అలాగే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌ను బలోపేతం చేసి వాణిజ్యం, పెట్టుబడి ప్రవాహాలకు మద్దతు ఇవ్వాలి. బ్రిక్స్ రాజ్యాలు, ఇతర దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులను తక్కువ ఖర్చుతో వేగవంతంగా జరపడానికి చర్యలు తీసుకోవాలి. చివరగా, బ్రిక్స్ సభ్యత్వం భారత విదేశాంగ విధానానికి వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. వర్ధమాన దేశాలకు భారత్‌ను మార్గదర్శిగా నిలుపుతుంది. అత్యంత ముఖ్యమైన దేశాలతో, ప్రాంతాలతో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, దౌత్య సంబంధాలను విస్తరించడానికి సాయపడుతుంది. వాయిస్.. ఇదిలా ఉండగా ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ హాజరుకావడం లేదని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. ఆయనకు ప్రధాని హోదాలో భారత్ నుంచి ఆహ్వానం అందలేదని, కేవలం ఏడు దేశాల ప్రాంతీయ కూటమి అయిన బిమ్స్టెక్ అధ్యక్షుడి హోదాలోనే అందిందని బంగ్లాదేశ్ చెబుతోంది. బంగ్లాదేశ్ ప్రధాని భారత్ ద్వైపాక్షిక పర్యటనకు సంబంధించిన ఆహ్వానం ఫిబ్రవరి నుండి పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. బహుళ పక్ష సదస్సుల కంటే భారత్‌తో నేరుగా జరిపే ద్వైపాక్షిక చర్చలు, పర్యటనలకే తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని బంగ్లాదేశ్ అంటోంది. అయితే ఈ పర్యటన విషయంలో ఎలాంటి తొందరపాటూ లేదని, పరస్పర గౌరవం, అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు తగిన సమయంలో ద్వైపాక్షిక పర్యటనలు జరుగుతాయని బంగ్లాదేశ్ అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య కీలకమైన 1996 నాటి గంగా జలాల భాగస్వామ్య ఒప్పందం 30 ఏళ్ల గడువు పూర్తి చేసుకుని ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుందని తెలిపారు. తమ జాతీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఈ అంశాన్ని తాము అత్యంత తీవ్రంగా, సమర్థవంతంగా భారత్ ముందు ఉంచబోతున్నాం అని స్పష్టం చేశారు.
మరోవైపు రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షల మధ్య ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ద్వైపాక్షిక చర్చల్లో సుఖోయ్ యుద్ద విమానాలు, వాణిజ్యం, ఆర్థికపరమైన ప్రధాన అజెండా ఉంది. 2026 జనవరి 1న బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టిన భారత్ .. నాలుగోసారి ఈ కూటమికి అధ్యక్షత వహిస్తోంది. రష్యా చమురు దిగుమతి చేసుకుంటే 100 శాతం పన్నులు తప్పవని అమెరికా హెచ్చరించిన వేళ.. భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక చర్చలు కీలకంగా మారాయి. బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ వంటివి పూర్తిస్థాయి సభ్య దేశాలుగా పాల్గొంటుండగా.. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ ,వియత్నాం భాగస్వామ్య దేశాలుగా పాలు పంచుకుంటున్నాయి. భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు చైనా మద్దతు ప్రకటించింది. బ్రిక్స్ కూటమితో అనుబంధం ఉన్న దేశాలతో సహకారానికి చైనా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సు తరుణంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సెప్టెంబర్ 12న కీలక ద్వైపాక్షిక భేటీ జరగనుంది. భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచడం వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన ఒత్తిళ్ల తరుణంలో మోదీ-జిన్‌పింగ్ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తంగా గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పెంచడం, వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలపై చర్చించడం బ్రిక్స్ సదస్సులో కీలకంగా ఉండనుంది.
- Tags
- BRICS
- NTV Telugu
- story board
తాజావార్తలు
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!