Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 20కి పైగా మున్సిపాలిటీలు..
- స్థానిక రాజకీయ సమీకరణాలు, గెలుపు అవకాశాలే ప్రధాన పాత్ర..
- ఏ స్థానంలో ఎవరికి బలం ఉంటే వారే ఆ స్థానంలో పోటీ ..
- సీట్ల సంఖ్య కంటే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యమన్న కూటమి..
- కూటమి పార్టీల తరఫునే అభ్యర్థుల ప్రకటన..
- జనసేనకు విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు కార్పొరేషన్లు..
- మున్సిపాలిటీల్లో పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం..
- మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం..
- బీజేపీకి రాజమహేంద్రవరం కార్పొరేషన్ దక్కే అవకాశం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి షురూ అయింది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉందో…అక్కడే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే…వచ్చే ఎన్నికల్లో నేతలకు టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల వ్యవహారం వచ్చేసినట్లేనా ? కచ్చితంగా గెలుస్తామనే సీట్లనే మూడు పార్టీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయా ? ఏ యే మేయర్ పీఠాలు…మున్సిపల్ చైర్మన్లు ఎవరికి అన్నది అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. దీంతో స్థానిక సమరం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల పంపకంపై ఉత్కంఠకు తెరపడుతోంది. మేయర్ పీఠాలు, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలపై రెండురోజులుగా సాగిన చర్చలు కీలక దశకు చేరాయి. విజయవాడ సహా నాలుగు కార్పొరేషన్లు, 20కి పైగా మున్సిపాలిటీలపై జనసేన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో పాటు నాలుగైదు మున్సిపాలిటీల్లో బీజేపీ పోటీకి సిద్ధమవుతున్నట్లు కూటమి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే దానికంటే స్థానిక రాజకీయ సమీకరణాలు, గెలుపు అవకాశాలే పార్టీల సీట్ల ఖరారులో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. త్వరలోనే కూటమి నేతలు వీటిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
Also Read
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు…గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్ధులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా…క్లీన్ స్వీప్ చేయాలని ఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూటమి పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పంతాలు, పట్టింపులకు పోతే…ఇబ్బందులు వస్తాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గ్రహించారు. ప్రతిపక్ష వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా…దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఏ స్థానంలో ఎవరికి బలం ఉంటే వారికే ఆ స్థానంలో పోటీ చేయాలని ఫిక్సయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో…జనసేన, బీజేపీ నేతలు బుధవారం అర్ధరాత్రి వరకూ కూడా చర్చోపచర్చలు కొనసాగాయి. పలుదఫాలుగా జరిగిన చర్చల్లో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా స్పష్టత వచ్చింది. సీఎం చంద్రబాబుతో మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్, ఎంపీ లింగమనేని…మరోసారి భేటీ అయ్యారు.
సీట్ల సంఖ్య కంటే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యమని కూటమి పార్టీలు నిర్ణయించాయి. ఎక్కడ ఎవరు బలంగా ఉన్నారనే అంశానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు నేతలు తెలిపారు. కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. అన్ని పార్టీల కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఫిక్స్ అయ్యాయి. అభ్యర్థుల ప్రకటన కూడా కూటమి తరఫునే ఉంటుందని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే వివరాలను రెండు రోజుల్లో వెల్లడిస్తామని నేతలు చెప్పారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తరహాలోనే స్థానిక ఎన్నికల్లోనూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని వారు నిర్ణయించారు. 2024 ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీట్ల కోసం గొడవ పడుతున్నామనే సంకేతాలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే వెళ్తామని అన్నారు.
స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి కొన్ని స్థానాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన స్థానాల జాబితాలో విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు కార్పొరేషన్లు జనసేనకు కేటాయించే అవకాశముంది. మున్సిపాలిటీల్లో పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, రంపచోడవరం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుట్టపర్తి, ఆదోని స్థానాలు చర్చకు వచ్చాయి. నగర పంచాయతీల్లో పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
బీజేపీకి రాజమహేంద్రవరం కార్పొరేషన్ దక్కే అవకాశం కనిపిస్తోంది. యలమంచిలి, బాపట్ల, శ్రీకాళహస్తి, ఎర్రగుంట్ల, కర్నూలు జిల్లాలోని గూడూరు మున్సిపాలిటీల పేర్లు కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. మొత్తంగా ఒక కార్పొరేషన్, నాలుగు నుంచి ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 20 నుంచి 24 మున్సిపాలిటీలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో అవకాశం కల్పించే అంశం చర్చకు వచ్చింది. ఇవాళ వీటిపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ స్థానాన్ని జనసేన, బీజేపీ రెండూ కోరుతున్నట్లు సమాచారం. అక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. పార్టీ ముఖ్య నేతలు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశం అవుతున్నారు. మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. మేయర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తవ్వడంతో ఇప్పుడు మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక, స్థానికంగా పార్టీ పరిస్థితులు, ఎన్నికల ప్రచార ప్రణాళికలపై చర్చించారు. గెలుపు అవకాశాలు, స్థానిక నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల నిర్వహణలో నేతలకు బాధ్యతలు అప్పగించడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి అంశాలపైనా చర్చించారు.
తాజావార్తలు
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!