Story board: ఎవరో ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ చెబుతుంటే.. ఆయనవన్నీ అభూత కల్పనలే అంటోంది ఈసీ. బీజేపీ కూడా వరుస ఓటముల ఫ్రస్ట్రేషన్‌తో అలా మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తోంది. కానీ ఓట్ల చోరీ అంశానికి ఓ హేతుబద్ధ ముగింపు ఇవ్వల్సిన పని లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి.
Read Also: IND vs PAK: పాక్తో మ్యాచ్కి ముందు టీమిండియాకు బిగ్ షాక్..
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్‌పై స్పందించిన ఎన్నికల సంఘం, ఆయన ఆరోపణలు తప్పు, నిరాధారమైనవంటూ తోసిపుచ్చింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఒక ట్వీట్ చేసింది. ఒక పౌరుడి ఓటును ఆన్‌లైన్‌లో డిలీట్ చేయడం కుదరదు. ఇది అపోహ. 2023లో ఆలంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల పేర్లను తొలగించడానికి కొన్ని విఫల యత్నాలు జరిగాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి స్వయంగా ఎన్నికల సంఘమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని ట్వీట్‌లో పేర్కొంది. రికార్డుల ప్రకారం, 2018లో ఆలంద శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సుభాష్ గుట్టేదార్, 2023లో కాంగ్రెస్ నుంచి బి.ఆర్. పాటిల్ గెలుపొందారని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం భుజాలపై తుపాకీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అఫిడవిట్ సమర్పించాలి, లేదా దేశానికి క్షమాపణలు చెప్పాలని గతంలోనే సీఈసీ జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే, ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ నేరుగా సమాధానం ఇవ్వలేదని ఆ తర్వాత కాంగ్రెస్ పేర్కొంది.
Read Also: CM Revanth Reddy: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రాహుల్ గాంధీ దేశ ఓటర్లను అవమానిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి అసలు రాజ్యాంగం అర్థమవుతుందా? ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. వాటి గురించి ఆయన ఏమైనా చేశారా? ఆయనకు చట్టాలు, సుప్రీంకోర్టు సూచనలు అర్థం కావు. కేవలం రాజ్యాంగం, రాజ్యాంగం అని అరుస్తుంటారని బీజేపీ సెటైర్లు వేస్తోంది. పైగా రాహుల్ గాంధీకి ఓట్లు రాకపోతే మనం ఏం చేయగలం? ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయనకు కొన్ని విలువలు ఉండాలి. ప్రజలు ఆయనకు మరోసారి గట్టి సమాధానం ఇస్తారు. ఆయన బాంబులేవీ పేలవు. ఆయన ఎవరినీ నమ్మరంటూ కౌంటరిచ్చింది బీజేపీ. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓడిపోయిందని.. అందుకే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. కోర్టుల నుంచి చీవాట్లు తినడం కూడా రాహుల్ గాంధీకి అలవాటైందని కామెంట్ చేశారు.
Read Also: MLC Kavitha: కొత్త పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు..
ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాల్సిన ఈసీ.. బీజేపీతో కలిసి జట్టుకడుతోందన్న రాహుల్ ఆరోపణలపై అటు ఈసీ, ఇటు బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. సరైన ఆధారాల్లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాహుల్ ఆరోపణలకు ఈసీ ఆధారాలతో సహా కౌంటర్లు ఇచ్చినా.. ఇంకా సమాధానం చెప్పలేదని ఆరోపించడం సరికాదని పేర్కొంటున్నాయి. బీహార్ ఎన్నికల ముందు ఓట్లచోరీని వెలుగులోకి తెచ్చి.. అక్కడ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టడం ద్వారా రాహుల్ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
Read Also: Singer Zubeen Garg: మరణానికి ముందు సింగర్ జుబీన్ గార్గ్ చివరి క్షణాలు.. వీడియో వైరల్
రాహుల్ ఓట్ల చోరీ విషయానికంటే ముందు ఈవీఎంలపై కూడా సందేహాలు లేవనెత్తారు. దీంతో ఈవీఎంలపై కూడా ఈసీ గతంలో వివరణ ఇచ్చింది. పోలింగ్‌కు ఐదు నుంచి ఆరు రోజుల ముందు ఈవీఎంను కమీషన్ చేస్తారని, ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని ఈసీ తెలిపింది. గుర్తులను సైతం అదే రోజు ఫీడ్ చేస్తారంటోంది. కమీషన్ చేసిన తర్వాత, బ్యాటరీ సీల్ చేస్తారని.. అభ్యర్థితో పాటు ఏజెంట్లు సంతకం చేస్తారని వెల్లడించింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఈవీఎంలు మూడంచెల భద్రతలో ఉంటాయని.. పోలింగ్ రోజు సైతం ఇదే జరుగుతుందని తెలిపింది. ఓటు వేసిన తర్వాత కూడా ఈవీఎం చూపించి అభ్యర్థి ఏజెంట్ సంతకం తీసుకుంటారని తెలిపారు. ఇలా మరెక్కడా జరుగదని.. ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారన్నారి ఈసీ బల్లగుద్ది మరీ వాదిస్తోంది. ఈవీఎంలలో సింగిల్ యూజ్ బ్యాటరీలు ఉంటాయని, బ్యాటరీ వేసిన సమయంలో ఛార్జ్ శాతం, వోల్టేజ్ ఎంత వరకు ఉందో కనిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఈవీఎంలను పారదర్శకంగా ఉంచామని చెప్పింది.
ఈవీఎంలపై రాజకీయ పార్టీలు లేవనెత్తే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈసీ మరింత చురుకైన విధానాన్ని అవలంబించాలనే సూచనలు కూడా వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా EVM బ్యాటరీ 99 శాతం ఛార్జ్‌ని చూపిందని అభ్యర్థి ఆరోపించినప్పుడు, ఈసీ తక్షణమే పోలింగ్ అనంతర మెషీన్లు దాదాపు పూర్తిగా ఛార్జ్ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేయడానికి వివరణలు ఇవ్వాలి. అందుకు తగిన ఆధారాలను అందించాలి. అదేవిధంగా మిగిలిన అన్ని అనుమానాలు నివృత్తి చేయాలి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో.. అటు ఈసీ.. ఇటు పార్టీలు రెండూ పరస్పర విశ్వాసం, జవాబుదారీతనానికి కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంలపై చర్చ పెడితే.. ఓటర్లలో కూడా లేనిపోని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ అని ఈసీ ఆధారాలతో నిరూపించాలి. అదే సమయంలో ఈవీఎంలను తప్పుబడుతున్న పార్టీలు కూడా ట్యాంపర్ అవుతాయని నిరూపించాలి. అప్పుడు ఎవరి వాదన కరెక్టో తేలిపోతుంది. ఈ భిన్నాభిప్రాయాలు ఇలాగే కొనసాగితే.. కొన్నాళ్లకు ఎన్నికల్లో గెలుపోటములకు అసలు కారణాలపై అసలు చర్చే జరగకుండా పోయే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో వ్యవస్థలో భాగస్వాములంతా అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఓట్లచోరీ అనేది సున్నితమైన అంశం. ఈ ఆరోపణల్ని మిగతా రాజకీయ ఆరోపణల్లాగా తేలిగ్గా కొట్టిపారేయటానికి వీల్లేదు. ఇక్కడ రాహుల్ ఆరోపణల్లో నిజానిజాల సంగతి పక్కనపెడితే.. అసలేం జరిగిందో.. లేదంటే ఏమీ జరగలేదనో ఈసీ కచ్చితంగా ఆధారాలతో సహా ప్రజలకు వివరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే ప్రజల్లో మొలకెత్తిన అనుమానాలు పెరిగి పెద్దవి కాకముందే.. ఓట్లచోరీ అంశానికి హేతుబద్ధ ముగింపు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది.
ఓట్లచోరీపై రాహుల్ ఆరోపణలు భారత్ ప్రజాస్వామ్యానికి సవాలుగా మారాయి. అడిగిన డేటా ఈసీ ఇవ్వకపోతే, అది ఓట్ల దొంగల్ని కాపాడుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా, ఫ్రాడ్ బయటపడకపోతే ఓటమి ఎదురయ్యేదని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బీహార్‌లో కూడా మాస్ డిలీషన్లు జరుగుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంలో మార్పులు చేయాలని, ఓటర్ రోల్స్ ఆడిట్ చేయాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు.
మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ఎన్నికల నిర్వహణ అన్నది ఎన్నికల సంఘానికి పెద్ద సవాల్. ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహిస్తుంది. రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను…నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుందనే పేరుంది. అలాంటి ఈసీ పనితీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు, పక్షపాత్ర ధోరణి అవలంభిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అరికట్టడం లో విఫలమైందని, అధికారపార్టీలకు అనుకూలంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలున్నాయి.
రాహుల్ గాంధీ బయటపెట్టిన మహారాష్ట్ర ఎన్నికల చిత్రవిచిత్రాలు ప్రజలలో అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఓటర్ల సంఖ్య అమాంతం పెరిగిపోవడం, ఓటింగ్ శాతంలో భారీ తేడాలు నమోదు కావడం, ఫేక్ ఓటర్లు, జీరో ఓటర్లు, ఎన్నికల సాక్ష్యాధారాలు బయట పెట్టకపోవడం మొదలైన అంశాలు భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తినే ప్రశ్నార్థకం చేస్తూ దాని పని తీరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2024 మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు నుంచి 2024 నవంబర్ విధానసభ ఎన్నికల నాటికి…అంటే ఐదు నెలల కాలంలో ఓటర్ల సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. స్వల్ప కాలంలో 41 లక్షల కొత్త ఓటర్లు పుట్టుకు వచ్చారు. ఐదు సంవత్సరాల కాలంలో 31 లక్షల ఓటర్లు పెరిగితే…కేవలం ఐదు నెలల కాలంలోనే 41 లక్షల ఓటర్లు నమోదు కావడంలో ఆంతర్యం ఏంటన్నది అంతుచిక్కడం లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఓటర్ల సంఖ్యలో పెరుగుదల వాస్తవమా? అవాస్తవమా? ఓటర్ల సంఖ్య అమాంతం పెరగడానికి కారణాలేమిటి? బోగస్ ఓటర్లు ఉన్నారా ? లేరా ? మొదలగు ప్రశ్నల నిజానిజాలను ఎన్నికల కమిషనే నిగ్గుతేల్చాలి. రాహుల్ గాంధీ చెప్పిన అంశాలలో అసత్యం ఉంటే పౌర సమాజంలో ఆయన విశ్వసనీయతే దెబ్బతింటుంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కౌంటర్లు ఇవ్వడానికి పరిమితం కాకుండా.. మొత్తంగా ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందనే విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత తీసుకోవాలి.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్ 1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాలని…సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో సూచించింది. ఈసీ అధికారులు…ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనలేదు. ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన విషయంలో వారి చిత్తశుద్ధి ఏ పాటిదో తేలిపోయిందని ఏడీఆర్ అభిప్రాయపడింది.
ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం వంటివి. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభువులు ఓటర్లైన ప్రజలు. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వాల పనితీరును సమీక్షించుకుని వారు తమ తీర్పును వెలువరిస్తారు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు ఎన్నికలను…సామాజిక విప్లవ సాధనాలుగా అభివర్ణించారు. అలాంటి ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఇంతటి కీలక పాత్ర పోషించే బాధ్యత ఈసీదే. అయితే కొంతకాలంగా ఎన్నికల సంఘం తీరు…తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రాజ్యాంగం నిర్వచించిన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మొదట ఎన్నికల కమిషన్ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. పూర్తి స్వతంత్రంగా పనిచేయాలి.
ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు..ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. పోలైన ఓట్ల వివరాలు, సాయంత్రం ఐదు గంటల తరువాత జరిగిన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ, మిషన్ రీడింగ్ ఓటర్ రోల్స్ ఎన్నికల సంఘం బయటపెట్టి తమ నిష్పాక్షికతను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి దాపరికం పనికిరాదు. పారదర్శకమైన పనితీరే ప్రజాస్వామ్య విజయానికి, ఎన్నికల కమిషన్ పవిత్రతకి గీటురాయి.
ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటింగ్ ప్రక్రియ అనవసర సందేహాలకు తావివ్వటం ఎవరికీ మంచిది కాదు. ఒకవేళ రాహుల్ చేసినవి తప్పుడు ఆరోపణలని ఈసీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తే.. మరోసారి ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయటానికి జంకే అవకాశం ఉంటుంది. కానీ ఈసీ ఆ పని చేయకుండా.. కేవలం ఖండన ప్రకటనలతో సరిపెడుతుంది. అప్పుడు పార్టీలకు, ప్రజలకు ఉన్న అపోహలు ఎలా దూరమౌతాయనేది అసలు ప్రశ్న.ఇప్పటికైనా ఎన్నికల ప్రక్రియపై అనుమానాలకు తావివ్వకుండా.. పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే కార్యాచరణ తీసుకోవడం అవసరం. ఇక్కడ వ్యక్తులు, పార్టీలు, సంస్థల ఇగోల కంటే.. దేశ ప్రతిష్ఠ ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన ఎన్నికల వ్యవస్థపై సందేహాలు రావడం దేశ ప్రతిష్ఠకే దెబ్బ అనే సంగతిని గమనించాలి. ఎన్నికల ప్రక్రియలో ఈసీ, పార్టీలే కాదు.. ఓటర్లు కూడా భాగస్వాములే. అందుకే స్టేక్ హోల్డర్లందరితో కలిసి ఈ సందేహాలకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగం ఈసీ మీదే పెట్టిందనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా ఈసీ తన రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తుకుతెచ్చుకుని.. ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.