Story Board: దేశంలో ఉన్న సమస్యలు చాలవన్నట్టుగా.. కొత్తగా బెట్టింగ్ భూతం వచ్చిపడింది. 12 ఏళ్ల పిల్లల దగ్గర్నుంచీ వృద్ధుల దాకా అన్ని వర్గాలవారూ ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు అలవాటుపడుతున్న బాధితులు.. ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తీరా అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడమే.. ఇంట్లోవాళ్లను హత్యచేయడమో చేస్తున్నారు. దీంతో బెట్టింగ్ రెండు రకాలుగా ముప్పుగా పరిణిస్తోంది. ఓవైపు వేల కోట్ల రూపాయల ధన నష్టం జరుగుతోంటే.. మరోవైపు నేరాలు పెరిగిపోయి ప్రాణనష్టం కూడా అధికమౌతోంది. ఎప్పటికప్పుడు బెట్టింగ్ పై ప్రభుత్వాలు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. జనం మారటం లేదు. అటు బెట్టింగ్ మాఫియా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రిక్కులతో బాధితుల్ని బుట్టలో వేస్తోంది. అనుక్షణం నీడలా వెంటాడుతున్న బెట్టింగ్ భూతం.. అదను చూసి కసిగా కాటేస్తోంది. తెలియకుండా బెట్టింగ్ ఊబిలోకి దిగినవాళ్లు.. బయటపడే దారి లేక.. తమ చుట్టూఉన్నవారిని కూడా అందులోకి లాగి.. తాము మునుగుతూ.. అందర్నీ ముంచేస్తున్నారు. బెట్టింగ్ ఉచ్చులోపడి.. కష్టార్జితంతో పాటు.. విలువైన ప్రాణాలనూ పోగొట్టుకుంటున్నారు. ఏతావాతా బెట్టింగ్ కు బాగా అలవాటుపడ్డవారు అదే ట్రాన్స్‌లో ఉంటున్నారు. తప్పొప్పుల విచక్షణ వదిలేస్తున్నారు. ఏం చేసైనా సరే బెట్టింగ్‌లో డబ్బులు పెట్టాలి.. పెట్టిన డబ్బులన్నీ వచ్చేదాకా ఆడుతూనే ఉండాలి. ఇదే ధ్యాస. ఇంతకుమించి ఇంకేం ఆలోచించడం లేదు. ఉచితానుచితాలు మరిచిపోయి ఆత్మహత్యలు, హత్యలు దేనికైనా రెడీ అంటున్నారు. కొత్తగా దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు కూడా మొదలుపెట్టారు. గతంలో ఎలాంటి దురలవాట్లు లేనివారు కూడా.. బెట్టింగ్‌లో దిగాక చెడిపోతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తున్న బెట్టింగ్ భూతం.. అంతకంతకూ పెనుముప్పుగా పరిణమిస్తోంది.
ఆన్లైన్ బెట్టింగ్ లపై అవగహన కల్పించేదే పోలీసులు. కానీ ఆ పోలీసులే బెట్టింగ్ భూతానికి బలై ప్రాణాలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ యువ కానిస్టేబుల్ బెట్టింగ్ లలో నష్టపోయి రివాల్వార్ తో కాల్చుకుని చనిపోయాడు. అసలు ఆ కానిస్టేబుల్ చేతికి అంత సులువుగా రివాల్వర్ ఎలా వచ్చిందనేది ఇప్పడు మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండేళ్లలో ముగ్గురు కానిస్టేబుళ్లు బెట్టింగ్ లలో నష్టపోయి సూసైడ్ చేసుకున్నారు. మరోచోట బెట్టింగ్ ఊబిలో దిగబడిపోయిన ఓ తమ్ముడు.. డబ్బుల కోసం సొంత అక్కనే చంపేశాడు. ఇంకోచోట బెట్టింగ్‌కు బాగా అలవాటుపడ్డ ఓ పిల్లాడు తల్లిదండ్రులిద్దర్నీ పొట్టనపెట్టుకున్నాడు. బెట్టింగ్ మోజులో, క్షణికావేశంలో సొంత కుటుంబసభ్యుల్నే పొట్టనపెట్టుకుంటున్నా.. తర్వాత తెలివితెచ్చుకుని కుమిలిపోయినా.. జరిగిన నష్టం పూడే అవకాశం లేదు.
కొందరు యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్స్, బల్లితెర నటులు తమ వీడియోలు, నటన ద్వారా తక్కువ సంపాదిస్తున్నారు. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా.. ఎంత ఎక్కువమందిని ఆకర్షించవచ్చనేది వీరి ప్లాన్. ఎంత ఎక్కువ డిపాజిట్ చేయిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. కాబట్టి వారు ఈ యాప్స్ ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ అందరూ ఇలా చేస్తున్నారని చెప్పలేం కానీ.. కొందరు కన్నింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్లు చేసే పని మాత్రం ఇదే. చాలామంది టెలిగ్రామ్‌లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. వాటిలో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా కంటెంట్ అప్‌లోడ్ చేస్తుంటారు. అనంతరం అదే గ్రూపులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. మొదట యాప్‌లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్‌తో పాటు లాస్ పేమెంట్‌పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షిస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల బాధ్యతారాహిత్యం నిండు ప్రాణాలు నిలువునా తీస్తోంది. ఏ అంశం గురించీ సరైన అవగాహన లేకుండా.. తామేదో నిపుణులమైనట్టుగా ఇచ్చే ఉచిత సలహాలు కొంపలు ముంచుతున్నాయి. ఎన్ని వ్యూస్ ఉన్నాయి. ఎన్నిలైక్‌లు ఉన్నాయనే ప్రాతిపదికన ఇన్‌ఫ్లుయెన్సర్లుగా అవతరిస్తున్న అనామకులు.. తమను మించిన ఎక్స్‌పర్ట్స్ లేరన్నట్టుగా పోజులు పెడుతూ.. యువతను పూర్తిగా దారితప్పిస్తున్నారు. కాసుల కక్కుర్తితో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ.. మొత్తం సమాజాన్నే భ్రష్టుపట్టిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. బెట్టింగ్ భూతానికి వీరే కళ్లూ, చెవుల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు అమాయకత్వం నటించడం.. కాస్త వేడి చల్లారగానే షరామామూలుగా ప్రమోషన్లు చేయడం వీరికి అలవాటేనని విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే అతి అన్న విధాలుగా నష్టం చేస్తోంది. మిగతా విషయాల సంగతి పక్కనపెడితే.. బెట్టింగ్ భూతాన్ని మాత్రం ఇన్‌ఫ్లుయెన్సర్లే పాలు పోసి పెంచారని చెప్పటానికి ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు.
బెట్టింగ్ యాప్ ల కేసును పోలీసులే దర్యాప్తు చేస్తున్నా.. భారీ మొత్తంలో డబ్బు చేతులు మారతుండటం చూసి.. ఈడీ కూడా రంగంలోకి దిగింది. దీంతో డబ్బు చెల్లింపుల్లో హవాలా, మనీ ల్యాండరింగ్ కోణాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే కేసు మరింత సీరియస్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు కూడా పిలిచారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లలో బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా జనాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లవల్ల ఎంతో మంది డబ్బు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. బెట్టింగ్ యాప్‌ల మాయలోపడి, అప్పులపాలై, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది. ముందుగానే ఆటను యాప్‌లో ప్రోగ్రామ్ చేస్తారు. నమ్మకం కలిగించేందుకు చిన్న మొత్తాలతో ఆటలు ఆడించి లాభాలు వచ్చేలా చేస్తారు. తరువాత ఒకేసారి పెద్దమొత్తంలో అంటే వేలు, లక్షలు పెట్టేలా చేసి, అవి పోయేలా చేస్తారు. బెట్టింగ్ యాప్‌లలో గేమ్ ఆడేందుకు బోనస్ ఇస్తారు. ఆ బోనస్‌తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్లుగా చూపించి, మళ్లీ మళ్లీ డిపాజిట్ చేయిస్తారు. తరువాత డిపాజిట్ పోయినట్లుగా చూపిస్తారు. తప్పుడు సమాచారంతో ఫలానా దానిపై పెడితే లాభం వస్తుందని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో చెప్పిస్తారు. అందులో పెట్టుబడి పెట్టాక డబ్బు పోయిందని చెబుతారు. ఇవే కాక వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఇతరులకు విక్రయిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. వాలెట్‌లో డబ్బులు ఉన్నట్లుగా చూపించి పెట్టుబడి పెట్టిస్తారు. కానీ, గేమ్ అయ్యాక డబ్బు తీసుకునేందుకు వీల్లేకుండా చేస్తారు. ఇలాంటి మోసాలకు పాల్పడే బెట్టింగ్ యాప్స్ కు ఏపీ, తెలంగాణకు చెందిన యూట్యూబర్లు ప్రమోషన్ చేస్తున్నారనేది ఆరోపణ. ఫలానా యాప్‌లో గేమ్ ఆడి డబ్బులు గెలుచుకున్నానంటూ నమ్మిస్తుంటారు. ఆ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెబుతూ గేమ్ ఆడే విధానాన్ని తెలుపుతుంటారు. బెట్టింగ్ యాప్‌కు సంబంధించి లింకులు ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రమోట్ చేస్తుంటారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో యాప్ లింక్‌ను ఫార్వర్డ్ చేస్తామని, డౌన్‌లోడ్ చేసుకుని గేమ్ ఆడాలని కోరుతుంటారు. లైవ్‌లో ఫేక్ వీడియో లేదా గేమ్ ఆడుతున్నట్లుగా చూపించి, తనతో కలిసి ఆడాలని యాప్ లింక్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తుంటారు. ఇలా ప్రమోషన్స్ చేసే యూట్యూబర్ల మాయలో ఫాలోయర్లు పడకూడదంటున్నారు పోలీసులు.
బెట్టింగ్ అంటేనే పెద్ద మోసం. ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే టోపీ పెడతారు. ఇక టెక్నికల్ గా అన్నీ వారి చేతుల్లో ఉంటే మోసం చేయకుండా ఉంటారా?. మొదట కొంత మందికి కాస్తంత డబ్బులు వచ్చేలా చేసినా ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఎలా అంటే ఇల్లు, ఒళ్లు గుల్ల చేసేలా చేస్తారు. చివరికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదన్నట్లుగా చేస్తారు. ఇలాంటి మాఫియా అత్యంత ప్రమాదకరం. ఆ మాఫియా మూలాలను పట్టుకోవాలి. బెట్టింగ్ యాప్స్ ను లోకల్ సెలబ్రిటీలతో ఇంత ఎక్కువగా ప్రమోట్ చేయించారంటే కచ్చితంగా ఇక్కడ కూడా కింగ్ పిన్స్ ఉన్నారని అర్థం అవుతుంది. వారిని పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. నేరం మూలాల్ని పెకిలించినప్పుడే ఆ నేరం ఆగుతుంది. లేకపోతే పెరుగుతూనే ఉంటుంది.బెట్టింగ్ యాప్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఓ మాజీ మంత్రి సినీ సెలబ్రిటీలతో కలిసి తన ఫామ్ హౌస్ వేదికగా బెట్టింగ్ ప్రమోషన్స్ డీల్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లోనే రూ.12 వందల కోట్ల వ్యాపారం జరిగినట్లు ఈడీ భావిస్తోంది. చివరకు సర్వీస్ లో ఉన్న పోలీసులు కూడా బెట్టింగ్ మనీ కోసం కక్కుర్తిపడి.. బెట్టింగ్ యాప్ కేసుల్లో ఇరుక్కుని ఉద్యోగాలు పోగొట్టుకునే దుస్థితి కొనితెచ్చుకుంటున్నారు.