Story Board: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 20 మంది ప్రాణాలు బలి తీసుకుంది. జరిగిన ఘటనను విశ్లేషిస్తే.. ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్,ఆర్టీఏ అధికారులు.. ఇలా అన్నివైపుల నుంచీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. డ్రైవర్లు ప్రమాద సమయంలో నిద్రమత్తులో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయం అలాంటిది. సహజంగా ఆ సమయంలో నిద్రవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది గత అనుభవాలు చెబుతున్న సత్యం. హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వేమూరి కావేరీ సంస్థకు చెందిన బస్సు ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించేదికాదని జరిమానాలను బట్టి అర్థమవుతోంది. ఒకటిరెండు సార్లు అయితే పొరపాటున తప్పు చేశారని అనుకోవచ్చు… కానీ ఒక్క హైదరాబాద్ లోనే ఏకంగా 16 ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడ్డారు ప్రమాదానికి గురయిన బస్సు డ్రైవర్లు, సిబ్బంది. ఇందులో ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ జరిమానాలు కూడా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన కూడా హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలో ప్రమాదానికి గురయిన బస్సు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసింది… దీంతో ఫైన్ పడింది. ఇలా 2024 నుండి ఇప్పటివరకు అంటే దాదాపు రెండేళ్లలో ఈ బస్సు హైదరాబాద్ లో 16 సార్లు ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడింది. ప్రతిసారి వెయ్యి రూపాయలకు పైనే జరిమానాలున్నాయి. బస్సుపై ఏకంగా రూ.23,120 ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి.
ఇక ప్రమాదం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ స్పందన తగినట్టుగా లేదు. బైక్ ను ఢీకొట్టిన తర్వాత ఆగకుండా కొంత దూరం వెళ్లటమే కొంప ముంచిందని కూడా చెబుతున్నారు. అదే బైక్‌ను ఢీకొట్టగానే ఆగి ఉంటే.. వెంటనే మంటలు అంటుకునేవి కాదు. ఈలోగా ప్రయాణికుల్ని లేపటానికి కూడా అవకాశం ఉండేది. అప్పుడు అతి తక్కువ ప్రాణనష్టంతో బయటపడే అవకాశం ఉండేది. కానీ డ్రైవర్ మాత్రం బైక్ ను ఢీకొట్టడమే కాకుండా ఏకంగా 300 మీటర్ల దూరం ఈడ్చుకుపోయారు. అప్పుడు బైక్ పెట్రోల్ ట్యాంకు ఓపెనై..అందులో పెట్రోల్ బస్సుమీద పడి.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి మెయిన్ డోర్‌ను బ్లాక్ చేయడంతో.. ఇక ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అసలే నిద్రలో లేచిన ప్రయాణికులకు ఏం జరిగిందో అర్ధమయ్యేలోగానే సజీవదహనమయ్యారు. మరో దారుణం ఏమిటంటే.. మంటల్ని ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో ఆర్పే ప్రయత్నం చేయకుండా తీరిగ్గా నీళ్లతో ఆర్పాలని చూశారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోయి.. ప్రమాద తీవ్రత ఇంకా పెరిగింది. ఆ తర్వాత అధికారుల తనిఖీల్లో అసలు అగ్నిప్రమాద నివారణకు కనీస జాగ్రత్తలు కూడా బస్సులో లేవని తేలింది.
పోనీ బస్సు ఫిట్ నెస్ సంగతి చూద్దామంటే.. దీనిపై భిన్నకథనాలు వచ్చాయి. మొదట ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదని ప్రచారం జరిగినా.. అది నిజం కాదని ఏపీ హోం మంత్రి క్లారిటీ ఇచ్చారు. అయితే ఫిట్‌నెస్ ఉంటే మాత్రం దానికి గ్యారెంటీ ఉందా అనేది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తారో అందరికీ తెలుసు. ఇవ్వాల్సిన మామూళ్లు ఇస్తే చాలు. .అసలు వాహనం ఏంటో కూడా చూడకుండా సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆర్టీఏ అధికారులు సిద్ధహస్తులు. అలాంటప్పుడు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉన్నా.. బస్సు ఫిట్టుగా ఉందని చెప్పడం కష్టమే.
ఇక రిజిస్ట్రేషన్ వ్యవహారం, సిట్టింగ్ నుంచి స్లీపర్ గా కన్వర్షన్ చేసిన తీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. రోడ్లపై ప్రయాణ వేగాన్ని తగ్గించే ఉద్దేశంతో.. ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణల్ని.. ప్రైవేట్ ట్రావెల్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఓరాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసి.. మరో రాష్ట్రంలో తిప్పుతూ అందరికీ మస్కా కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ ఇలాంటి ఘోర బస్సు ప్రమాదాలు జరిగాయి. 2018 సెప్టెంబర్‌లో కొండగట్టు అంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్న భక్తులతో కూడిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 57 మందికి పైగా భక్తులు దుర్మరణం చెందారు.
మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద 2013 సంవత్సరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన 45 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.
నిపుణుల ప్రకారం, ప్రమాదం జరిగిన తర్వాత మొదటి రెండు నిమిషాలలో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడగలవు. స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది నిద్రలో ఉండటంతో మొదటి క్షణాల్లోనే గందరగోళం నెలకొంటుంది. లోయర్ బెర్త్‌లలో ఉన్నవారికి బయటపడే అవకాశం ఉన్నా, అప్పర్ బెర్త్‌ల్లో ఉన్నవారు చిక్కుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయానికి తలుపులు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు తెరవకపోతే పరిస్థితి భయంకరంగా మారుతుంది.స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా.. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు.
అన్నింటికీ మించి వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నా.. కఠిన చర్యలు లేకపోవటం ప్రైవేట్ ట్రావెల్స్ కు వరంగా మారుతోంది. పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వాలు మాత్రం దుర్ఘటన జరిగినప్పుడే హడావుడి చేసి.. తర్వాత వదిలేస్తున్నాయి. అధికారులు కూడా ఒకటి, రెండు రోజులు స్ట్రిక్ట్గ్ గా ఉన్నట్టు హడావుడి.. మళ్లీ షరా మామూలుగా మామూళ్లకు తెరలేపుతున్నారు. ఇక ప్రమాదాలు జరిగిన ఘటనల్లో బాధ్యులకు శిక్షలు పడ్డ సందర్భాలు చాలా తక్కువ. ఇక ప్రమాదానికి గురైన బస్సు ట్రావెల్స్‌ను బ్యాన్ చేసిన సందర్భాలైతే దాదాపుగా లేవని చెప్పాలి. ఎప్పుడైనా మరీ సీరియస్ యాక్షన్ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే.. వెంటనే కొందరు నేతలు రంగంలోకి దిగుతారు. అలా రాజకీయ ఒత్తిళ్లతో సర్కారు కూడా లైట్ తీస్కుంటుంది. ఇలా ప్రమాదాలు జరిగినా.. వాటి ఫలితంగా తమకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో బస్సు ఓనర్లు ఆరితేరారు. కొందరు నేతలే బస్సులు నడిపిస్తుండగా.. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా.. ప్రభుత్వాలనే శాసించే రీతిలో రాజ్యం చేస్తోంది. ఎక్కడైనా కొందరు అధికారులు పొరపాటున నిజాయతీగా ఉన్నా.. ఈ మాఫియా పడనివ్వదు. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అని వ్యవస్థ అంతా వారు చెప్పినట్టే వింటోంది. అలా ఓ విషవలయం తయారై.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.