ఎన్నికల ప్రచారంలో ఇచ్చినట్లే…ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు సకాలంలో పూర్తవుతాయా ? రైతులకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు నిలబెట్టుకుంటారా ? రాజధాని అజెండాతో మూడు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు…అమరావతి విషయంలో సాధించిందేంటి ? రాజధాని నిర్మాణాలు నత్తనడకన సాగితే…వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవా ? సీఆర్డీఏ అధికారుల విషయంలో రైతుల వాదనేంటి ? ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి ? తెలుగుదేశం పార్టీ ప్రధాన ఏజెండా…రాజధాని అమరావతి. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. అనుకున్నట్లు సకాలంలో రాజధాని నిర్మాణాలు పూర్తవుతాయా ? సకాలంలో టవర్ల నిర్మాణం జరుగుతుందా ? ఏపీ ప్రజల్లో ఇప్పుడిదే హాట్‌టాపిక్‌గా మారింది.
ఏపీకి రాజధాని అమరావతి గేమ్ ఛేంజర్ అవుతుందనేది చంద్రబాబు యోచన. అలా అయ్యేలా ఆయన రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే రాజధాని పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ ప్రణాళికలు కొనసాగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న పనుల్ని పూర్తిచేయటానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో మాస్టర్ ప్లాన్ కు తగ్గట్టుగా పనులు పూర్తిచేయటానికి లక్ష్యం నిర్దేశించుకున్నారు. అటు కేంద్రం కూడా రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్లు కేటాయించింది. ఇది చంద్రబాబుకు సక్సెస్ అనే చెప్పాలి. అదే సమయంలో రాజధానికి నిధుల సమస్య లేకుండా రుణాలివ్వటానికి కూడా ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు రావడం శుభ పరిణామంగా భావిస్తున్నారు.
చంద్రబాబు నిధుల కొరత గురించి ఎక్కువ ఆలోచించకుండా.. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటూ పోతున్నారు. ఒక్కో పని చేసుకుంటూ పోతే.. నిధులు అవే వస్తాయనే ఉద్దేశంతో ఉన్నారు. కేంద్రం అండగా ఉంటుందనే ధీమా కూడా కారణం కావచ్చు. అటు అప్పుల విషయంలో కూడా కేంద్రం సహకరించడంతో.. కూటమి సర్కారుకు పెద్దగా కుదుపులేవీ లేవు. దీంతో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవడంలో చంద్రబాబు దూకుడు చూపిస్తున్నారు. విజన్ 2047తో పాటు కీలకమైన రాజధాని అమరావతి విషయంలో పూర్తి ఫోకస్ పెడుతున్నారు. రాజధాని నిర్మాణ పనులు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. అయితే 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తవుతుందా అంటే…అంచనా వేయలేని పరిస్థితి.
ఏపీకి రాజధాని లేకపోవటం కచ్చితంగా లోటే. కానీ ఆ లోటు తీర్చే సత్తా, రిస్క్ తీసుకునే తత్వం చంద్రబాబుకే ఉందనడంలో సందేహం లేదు. అదే సమయంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం కూడా ఆయన లక్ష్యంగా ఉంది. ఈ రెండు పనులు చేయాలంటే నాయకుడికి సత్తాతో పాటు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే సామర్థ్యం కూడా ఉండాలి. చంద్రబాబుకు ఆ రెండూ ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు చంద్రబాబు మద్దతుపైనే ఆధారపడుతోంది. కాబట్టి నుంచి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవడం ఆయనకు తేలికవుతుందనే అభిప్రాయానికి తోడు.. ఇటీవల కేంద్రం చేస్తున్న ప్రకటనలు కూడా అదే నిజమని చాటుతున్నాయి. ఇప్పటికే అమరావతిని మూడేళ్లలో పూర్తిచేయాలని సంకల్పం తీసుకున్న చంద్రబాబు.. పోలవరాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని కేంద్రంతోనే చెప్పించారు.
ఒక్కసారి రాజధాని నిర్మాణం పూర్తైతే.. అదే ఏపీకి గ్రోత్ ఇంజిన్ గా మారేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి సమాంతరంగా అక్కడ వివిధ సంస్థలు కొలువుదీరేలా వ్యూహరచన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు విజిబుల్ డెవలప్ మెంట్‌తో పాటు వచ్చే మార్పులు కూడా జనం అనుభవంలోకి వచ్చేలా కార్యాచరణ తీసుకున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం దగ్గర్నుంచే అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకు తగ్గట్టుగానే అమరావతి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు, భవిష్యత్ పనులపై దిశానిర్దేశం విషయంలో చంద్రబాబు ఎక్కడా తగ్గటం లేదు. ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశిస్తూ…చంద్రబాబు అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. నిర్మాణాలు అదే స్థాయిలో జరుగుతున్నాయా అంటే అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత…అమరావతిని రాజధాని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కాకుండా అమరావతి నుంచే పాలన మొదలు పెట్టారు. తాత్కాలిక భవనాల్లో పాలన సాగించారు. 2014 ఎన్నికల్లో అయినా…2019లో అయినా..2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ…తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఎజెండా అమరావతే. ఆ తర్వాతే పోలవరం. ఆ మూడు ఎన్నికల్లోనూ అమరావతి నిర్మాణం గురించే ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి చోట అమరావతి నిర్మాణంపై ప్రజలను ఊహల్లో విహరింపజేశారు. 11 ఏళ్లు పూర్తయినా…రాజధాని నిర్మాణ పనులు మాత్రం అనుకున్న వేగంగా జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం క్వాంటమ్ వ్యాలీ అంటుంటే…అటు నారాయణ మరో దిశలో అమరావతి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. సరే ఆ పనులైనా స్పీడ్‌గా జరుగుతున్నాయా అంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో…అమరావతి గురించే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు అమరావతి నిర్మాణాలు మాత్రం జరగడం లేదు. టవర్ల నిర్మాణంలో పని విభజన అసలు జరగడం లేదు. విజన్ నాయకుడు చంద్రబాబు అయితేనే…రాజధానిని పూర్తి చేస్తాడని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. అయితే ప్రజలు అనుకున్నది ఒకటి…అక్కడ జరుగుతున్నది మరొకటి. 2028 నాటికి రాజధాని పూర్తవుతుందని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే అప్పటికి టవర్ల నిర్మాణం పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి. టవర్ల నిర్మాణాన్ని ఒకరిద్దరు పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి కంప్లీట్ చేయమంటే ఎలా చేస్తారు. ఒకరిద్దరికి ఇవ్వడం పనులు నత్తనకడక సాగుతున్నాయి. అలా కాకుండా పనులను డివైడ్ చేసి…పది ఇరవై మందికి అప్పగిస్తే…పనుల్లో వేగం పుంజుకుంటుంది. భవన నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.
2019-2024 మధ్య అమరావతి కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. రాజధాని రైతులు…తిరుపతికి పాదయాత్రగా వెళ్లారు. దుర్గమ్మను దర్శించుకున్నారు. సంవత్సరాలు తరబడి టెంట్లు వేసుకొని…ఉద్యమాన్ని చేశారు. రాజధాని రైతుల ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది. అమరావతి రైతులు వేసే ప్రతి స్టెప్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు అందించింది. 2024లో ప్రచారంలోనూ తెలుగుదేశం పార్టీ…ప్రధానంగా అమరావతి గురించే ప్రచారం చేసింది. రైతులు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. ఓట్లేసి గెలిపించారు. చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి ప్రధాన అజెండా అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోనూ…అమరావతే రాజధాని అని ప్రకటన చేయించారు.
రెండు సార్లు ఎన్డీఏ ప్రభుత్వం…అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 2025 మే 2న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…అమరావతి పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరావతి పునర్ నిర్మాణానికి గుర్తుగా ఏ అకారంలో ఉన్న 20 అడుగుల ఎత్తు పైలాన్‌ను ఆవిష్కించారు. 49వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు 2015 అక్టోబరు 22న కూడా అమరావతికి అప్పటి ప్రఫధాని మోడీ శంకుస్థాపన చేశారు. రెండు పర్యాయాలు ప్రారంభించిన అమరావతి పనులు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. రాజధానిని సకాలంలో పూర్తి చేయకపోతే…ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. ఏ ఎజెండాతో అయితే అధికారంలోకి వచ్చారో…అదే అజెండా ప్రభుత్వాన్నిముంచేయడం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.49 వేల కోట్ల పనులతో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. మరో రూ.61 వేల కోట్ల పనులు చేపట్టే అవకాశం కూడా ఉంది. రాజధాని చుట్టుపక్కల కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అయితే…ఐదు, పదేళ్లలో రాజధాని నిర్మాణం జరగదు. అభివృద్ది జరగాలంటే దశాబ్దాలు పడుతుంది.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిపోయినా.. ఏపీకి ఇంతవరకూ రాజధాని సాకారం కాలేదు. పదేళ్ల క్రితం రాజధాని పనులు మొదలైనా.. ఇంతవరకూ పూర్తికాలేదు. పైగా మధ్యలో ఐదేళ్లు పనులు నిలిచిపోయాయి. దీంతో పదేళ్లకుపైగా ఆంధ్రులు రాజధాని లేకుండా ఉండాల్సి వచ్చింది. దీంతో వీలైనంత త్వరగా ఏపీకి రాజధాని సాకారం కావాలని ప్రజల్లో డిమాండ్ కనిపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ప్రపంచంలో ఏ దేశానికి మీ రాజధాని ఏదంటే.. తెల్లమొహం వేయాల్సి వస్తోందనే అనుభవాలు చాలా మంది ఏపీ ప్రజలకు సుపరిచితం. ఇకపై అలాంటి అనుభవాలు ఉండకూడదనే భావనతో వారున్నారు. ప్రజల అభిప్రాయం గ్రహించిన ఏపీ సర్కారు రాజధాని నిర్మాణ పనుల్ని ప్రధాని మోడీతో పునఃప్రారంభించింది. వీలైనంత త్వరగా రాజధాని పూర్తిచేస్తామని ఆత్మవిశ్వాసంతో చెప్పింది.
గతంలో రాజధాని నిర్మాణానికి, ఈసారి పునఃప్రారంభానికి చాలా తేడా ఉందనే వాదన వినిపింస్తోంది. ఎందుకంటే మొదట్లో రాజధాని నిర్మాణానికి నిధుల సమస్య ఎదురైంది. కేంద్రం నుంచి పరిమిత సాయమే అందింది. దీంతో మొదటి ఐదేళ్లు కూడా పనులు అనుకున్నంత వేగంగా జరగలేదు. ఆ తర్వాత ఐదేళ్లూ అసలుకే మోసం వచ్చింది. మొత్తంగా రాజధాని నిర్మాణమే పడకేసింది. మళ్లీ పునఃప్రారంభమైన పనులు..ఆగకుండా కొనసాగి.. రాజధానిని సాకారం చేయాలని ఏపీ మొత్తం కోరుకుంటోంది. రాజధాని అమరావతి అభివృద్ధి ఐదు, పదేళ్లలో జరిగిదే కాదు…దశాబ్దాలు పడుతుంది. అమరావతి అభివృద్ధి జరగాలంటే…ఏళ్లకు ఏళ్లు శ్రమించాల్సిందే. అలా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్డీఏ సర్కార్‌కు…అలసత్వం వహిస్తే మొదటికే మోసం వస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే…మూడేళ్లలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి సీన్ రివర్స్ ప్రమాదమూ లేకపోలేదు. సమయానికి పూర్తి చేశారా సరే…లేదంటే ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పే అవకాశమూ ఉంది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను రూ. 77,249.15 వేల కోట్లు అంచనాతో చేపట్టినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఒకవైపు లోటు బడ్జెట్.. మరోవైపు అప్పుల భారం ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటోంది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చిన మొత్తంతో పాటు కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని ఈ ఏడాది ఏప్రిల్ 1న రూ.4,285 కోట్లు ఏపీకి అందాయి. ఇవి కాకుండా హడ్కో నుంచి రూ.11వేల కోట్లు రుణంగా తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి సమ్మతి లేఖను రాష్ట్ర సర్కారు అందించింది. బ్యాంకులు, ఫండింగ్ ఏజెన్సీల నుంచి తీసుకోగా.. మిగిలిన నిధులను భూములు మార్ట్‌గేజ్ చేయడం, విక్రయాలు, లీజుకు ఇవ్వడం ద్వారా సేకరిస్తోంది.
ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలనే నిబంధన ఉంది. అలాగే, మల్టీలేటరల్ లోన్ అసిస్టెన్స్ పేరుతో అమరావతి నిర్మాణానికి అప్పులు ఇస్తున్నామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఈ రుణాలు ఏపీకి అందనున్నాయి. ఏపీకి రాజధాని అవసరాన్ని గుర్తించి, మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందేందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు సమకూరుస్తాం. వచ్చే సంవత్సరాల్లోనూ అదనపు నిధులు సమకూరుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ రూ.15 వేల కోట్లు గ్రాంటా, లేక రుణమా అనేది ఆ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఆ రూ.15 వేల కోట్లతో పాటు చాలా వరకూ రుణాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అందేలా కేంద్రం ఫెసిలిటేట్ చేస్తుందని, వాటితో పాటుగా కొంత గ్రాంటు కూడా ఉంటుందని తర్వాతి పరిణామాల్లో తేలింది.
ఇప్పటివరకు స్పెషల్ అసిస్టెన్స్ గ్రాంటు రూపంలో ఏపీ రాజధాని ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. అమరావతి కోసం చేసే అప్పులు ఏపీ తీసుకునే రెగ్యులర్ రుణ పరిమితి కిందకు రావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, వరల్డ్ బ్యాంకు రుణానికి ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఏడీబీ ఇచ్చే అప్పులకు ఫిబ్రవరి 10 నుంచి లోన్ టర్మ్ మొదలైందని కేంద్రం చెప్పింది. తాజాగా ప్రాజెక్టు ఖర్చులో పది శాతం మించకుండా స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కింద రూ.1,560 కోట్లు ఇస్తోంది. ఏపీ బడ్జెట్‌లో గత పదేళ్లగా అమరావతికి జరిగిన నిధుల కేటాయింపులు పరిశీలిస్తే.. 2015-16 బడ్జెట్ లో రూ.3,168 కోట్లు కేటాయించారు. 2016-17 లో రూ.1,500 కోట్లు, 2017-18లో రూ.1,061 కోట్లు కేటాయించారు. 2018-19లో రూ.1,000 కోట్లు కేటాయించారు. 2019 బడ్జెట్లో మాత్రం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత నిధుల కేటాయింపు జరగలేదు.
2019 నాటికి రూ.39,875 కోట్ల విలువైన పనులు నిర్మాణదశలో ఉన్నాయి. ప్రస్తుత సర్కారు అధికారంలోకి వచ్చాక గత జులైలో అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేసింది. దాని ప్రకారం, 2019కి ముందు ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు, రోడ్లు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం రూ.51,687 కోట్లు అవసరమని అంచనా వేసింది. 2014-19 మధ్య దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. 2019తో పోల్చితే నిర్మాణాల్లో అంచనా వ్యయాలు భారీగా పెరిగాయి. అప్పటి ఖర్చులతో పోల్చితే భవనాలు, ఇతరత్రా వసతులకు సంబంధించి నిర్మాణ వ్యయం రూ.12,392 కోట్లు పెరిగింది. ఇందులో ఐకానిక్ టవర్ల నిర్మాణం 2018లో అంచనా వ్యయం రూ.2271.14 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.4,688 కోట్లకు పెంచింది. మరోవైపు, తాజాగా అసెంబ్లీ భవన నిర్మాణం రూ.590 కోట్లు అంచనా కాగా 4.48 శాతం ఎక్సెస్ తో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.617 కోట్లకు పనులు అప్పగించింది ఏపీ సర్కారు. హైకోర్టు భవన నిర్మాణానికి రూ.750 కోట్లు అంచనా వ్యయం కాగా, 4.52 శాతం ఎక్కువకు రూ.786 కోట్లకు ఎన్సీసీ సంస్థకు పనులు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టేలా రూ.77,250 కోట్లుగా అంచనా వేసింది.
కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో.. అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాలపై రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. హడ్కో మరో రూ.11 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు రూ.2,047 కోట్లు మంజూరు చేసింది. 189.4 కి.మీ. పొడవున అమరావతి అవుటర్ రింగ్ రోడ్డును రూ.16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. భూసేకరణ ఖర్చును కేంద్రమే భరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు…ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చిన తాము అవమానాలు పాలవుతున్నామని వాపోతున్నారు. గ్రామాల్లో సమస్యలు ఏవి పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సమస్యలు చెప్పుకుంటే సిఅర్డీ అధికారులు అత్యంత చులకనగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక కమిటీగా ఏర్పడి ఈ మధ్యనే గుంటూరులో సమావేశం నిర్వహించారు. వారి మాటల్లో రాజధాని కోసం భూములు ఇచ్చి అధికారులతో మాటలు పడాల్సిన కర్మ పట్టిందే అన్న బాధ ఎక్కువగా కనిపించింది. చంద్రబాబుపై నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు భూములు ఇస్తే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం నత్త నడకన పనిచేస్తోంది అనేది వారి ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా సిఆర్డిఏ అధికారులు కలవడానికి నానా అగుచాట్లు పడవలసి వస్తుందని అధికారులు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. నిజానికి 2019-24 మధ్య కాలంలో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వంపై మొట్టమొదట ఉద్యమాలు చేసింది తామే అని…దాని ఫలితంగా 2024 ఎన్నికల్లో కూటమి పెద్ద విజయం సాధించింది అనీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్య అసలు రాజధాని బౌండరీస్ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు అమరావతి గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంతో రాజధాని ఎల్లలపై సందిగ్దత అలాగే కొనసాగుతుంది. అదిగాక గ్రామ కంఠాల సమస్య అలాగే నిలిచిపోయింది. నిజానికి ప్రభుత్వం, అధికారులు దృష్టి పెడితే పది పదిహేను రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ కూటమి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికి సమస్య అలాగే ఉంది. CRDA అధికారులు మహిళలు, చిన్నకారు రైతులతో మాట్లాడే విధానం అసలు బాలేదని రాజధాని కోసం భూములు ఇచ్చి ఉద్యమాలు చేసిన తమతో వారి వ్యవహార శైలి ఏమాత్రం బాగుండడం లేదనేది వారి ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు వ్యతిరేకత లేదని కానీ కింద ఉన్న నాయకులు అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.
అమరావతికి 29 గ్రామాల ప్రజలు భూములు ఇవ్వగా… ఆయా గ్రామాల్లో ఇంకా కొన్ని పొలాల భూ సమీకరణ జరగాల్సి ఉంది. భూములు ఇచ్చిన రైతులకు ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే విషయంలో పనులు నత్త నడకన సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంకా భూములు ఇవ్వని 1250 ఎకరాల్లో రోడ్లు వేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దానితో అక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా గజిబిజిగా తయారైంది. 2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరావతి రైతుల JAC నాయకులపై నమోదు చేసిన కేసులు ఇప్పటికే అలాగే ఉన్నాయి. వీలైనంత త్వరగా తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ అలాగే ఉండిపోయింది.
ఇన్నాళ్ళు మనోళ్ళు అనుకున్న రైతుల వాయిస్ మెల్లిగా పెరుగుతుండటం ప్రభుత్వ పెద్దల్ని కంగారు పెడుతోంది. రాజధానిలోని కొందరు రైతులు తమ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ… ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే ప్రశ్నించారు. కొంతకాలంగా రాజధాని ప్రాంతంలో తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. తమను సీఆర్డీఏ అధికారులు వేధిస్తున్నారని, సమస్యలపై వెంటనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ…గెజిట్ వచ్చేలా చూడాలని, అప్పుడే తమకు భరోసా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబుకు వివరించారు రైతులు. తమకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నది వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు రైతులతో చర్చించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భరోసా కూడా ఇచ్చారు.
అంతవరకు బాగానే ఉన్నా.. పరిస్థితి ఇలాగే ఉంటే.. బాగా బ్యాడ్ అయిపోతామన్న చర్చ ప్రభుత్వ పెద్దల మధ్య మొదలైంది. రైతుల సమస్యలు ఇలాగే ఉంటే.. వాళ్ళు ఇంకా వాయిస్ పెంచితే.. కూటమి ప్రభుత్వానికి నష్టం కలుగుతుందన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి రైతులను పట్టించు కోలేదంటూ ఇన్నాళ్ళు చెప్పామని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా…ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటం ఇబ్బందికరమైన పరిణామమేనని అంటున్నారు అధికార పార్టీ నేతలు కొందరు. రాజధాని రైతుల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోతే…ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో బలపడుతోంది. రాజధాని రైతులు గతంలో దీక్షలు చేసినప్పుడు ఆదుకుంటామని, అన్ని సమస్యలు తీరుస్తామని ఇచ్చిన హామీల్ని గుర్తు చేసుకుంటున్నారు కూటమి నేతలు.
రైతులు ప్రస్తుతానికైతే…మాట్లాడ్డం, ప్రశ్నించడం వరకే పరిమితం అయ్యారు. ఇది ఇంకా ముదిరి వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి వస్తే మాత్రం..తలెత్తుకోవడం కష్టమని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు. అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని…ఆ భూమి ఇచ్చిన రైతుల సమస్యలపై దృష్టి పెట్టకపోతే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టేనన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకమంటూ ప్రచారం చేశామని, ఇప్పుడు రైతుల నుంచి ఇబ్బందులు వస్తే మనం సమాధానం చెప్పుకోవడం కూడా కష్టమని అధికార పక్షం నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని రకాల ఈక్వేషన్స్‌ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా..రైతుల సమస్యల్ని పరిష్కరించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ప్రభుత్వం వచ్చిన కొత్తలో మున్సిపల్ మంత్రి నారాయణ కలిసి అమరావతి జేఏసీ 14 సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. అయితే వాటిలో నెరవేరింది మాత్రం కేవలం ఒక్కటే. అది రైతులు ఇచ్చిన భూములకు ఏడాది పొడవునా ఇచ్చే కౌలు. అలాగే అమరావతిలో ఉన్న అసైండ్ భూములకు సంబంధించి ఇచ్చే నష్ట పరిహారంపై ఇప్పట్లో ఏమి తేల్చలేదని స్పష్టత రైతులకు ఇచ్చేసింది ప్రభుత్వం. మిగిలిన 12 సమస్యలపై ప్రభుత్వం గానీ సిఆర్డిఏ అధికారులు కానీ ఏమి తేల్చకుండా ఉండడం వల్ల రైతుల నుంచి జేఏసీ నాయకులు పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఈ నెలాఖరున మరోసారి సమావేశమై తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అమరావతి రైతుల JAC చెబుతోంది.
రాజధాని రైతుల సమస్యలను ఆరు నెలల్లోగా పరిష్కరిస్తామని త్రిసభ్య కమిటీ హామీ ఇచ్చింది. స్వార్థం కోసం ఒకరిద్దరు చెప్పే మాటలు నమ్మొద్దని, రెండు వారాలకోసారి సమావేశమై రైతుల సమస్యలను పరిష్కరించేలా ముందుకెళతామని స్పష్టం చేసింది. రైతుల సమస్యలను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. జరీబు భూముల గుర్తింపు, గ్రామకంఠాల సమస్యను 30 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. లంక, ఎసైన్డ్ భూముల సమస్యలపై న్యాయవివాదాలు ఉన్నందున 90 రోజుల్లో పరిష్కరించడానికి చొరవ చూపుతామన్నారు.