డ్రగ్స్, మాఫియా, సెలబ్రిటీ హత్య…వరుస వివాదాలు ఏం చెప్తున్నాయి?ఆప్ ప్రభుత్వం ముందు అన్నీ సవాళ్లేనా?పంజాబ్ మళ్లీ ఖలిస్తాన్ గా మారబోతోందా?తీవ్రవాదం, మాఫియాతో రగిలిపోనుందా?
పంజాబ్‌లో ఏం జరుగుతోంది?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.ఆ రాష్ట్రలో ఏం జరుగుతోంది?ఏం జరగబోతోందనే ఆందోళన పెరుగుతోంది.నిజానికి అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వివాదాలు మాత్రం కామన్.
డ్రగ్స్ మాఫియా, ఇటీవల రైతు ఉద్యమాలు, ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ హత్య..ఇలా నిత్యం ఏదో వివాదంలో నిలుస్తోంది.ఇప్పుడు ఖలిస్తాన్ నినాదం మళ్లీ ఊపందుకుంటోంది.
కొంత కాలంగా మళ్లీ పంజాబ్ హెడ్ లైన్స్ లో ఉంటోంది. వరుసగా వివాదాలు..చర్చనీయాంశంగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం ఆ రాష్ట్రంలో అతి పెద్ద సమస్య. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హత్యాకాండ ప్రారంభమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆప్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరస్థులకు అప్పగించిందని ఆరోపిస్తూ వివాదానికి తెరలేపాయి. పంజాబీల మనస్సుల్లో అభద్రతా భావం నెలకొందని విమర్శలు చేస్తున్నాయ్.
నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో నెత్తుటేర్లు పారించిన పీడకల ఖలిస్థాన్ ఉద్యమం. ఇండియాలో సమైక్యతను దెబ్బ కొట్టేందుకు ఉగ్రమూకలు ప్రయోగించిన పదునైన ఆయుధం ఖలిస్థాన్. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆరంభమైన ఈ ఉద్యమానికి పంజాబ్ యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. వీరికి ఆయుధాలు, నగదు సరిహద్దులకు ఆవలి నుండి సమకూరేవి. ఆయుధాలపై మోజు ఉన్న ప్రతి యువకుడు ఉద్యమంలో చేరేవాడు. దేశ సమగ్రతకు వ్యతిరేకంగా లేవదీసిన పోరాటానికి బింద్రేన్‌వాలే నేతృత్వం వహించారు. దేశంలో వారి ఆగడాలు మితిమీరడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైన్యాన్ని రంగంలోకి దించి స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో తుద ముట్టించారు. ఈ పరిణామ క్రమంలోనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బలైపోయారు. దాంతో పోరాటం అంతమైనప్పటికీ దాని ఛాయలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి.
ఇటీవల కొన్ని కేసుల దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పంజాబ్ లో అరాచకం సృష్టిస్తున్న స్థానిక ముఠాలకు నిధులు అందిస్తున్న ఖలిస్తానీ మద్దతుదారులకు గ్యాంగ్‌స్టర్‌ల మధ్య అనుబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. పంజాబ్ గ్యాంగ్‌లకు హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌లు సహాయం చేస్తున్నాయి, వీరు కబడ్డీ ఆటగాళ్లను చంపడమే కాకుండా పంజాబీ సినీ నటులు మరియు గాయకుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్న హత్యలు, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌ల కోసం కబడ్డీ టోర్నమెంట్‌లను నియంత్రించడానికి క్రిమినల్ ముఠాలు ప్రయత్నిస్తున్నాయని స్పష్టమైంది. పంజాబ్ పోలీసు క్రైమ్ వింగ్ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులపై గ్యాంగ్‌స్టర్లను ప్రయోగిస్తున్నారు. రాజకీయ అండదండలు లేకుండా ముఠాలు మనుగడ సాగవనే చెప్పాలి. ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌తో సహా అన్ని రాజకీయ పార్టీల నేతలకు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలున్నాయి.
లారెన్స్ బిష్ణోయ్, సందీప్ అలియాస్ కాలా జాతేడి, వీరేంద్ర ప్రతాప్ అలియాస్ కాలా రాణా, సుబే గుర్జార్ నేతృత్వంలోని ముఠాల కూటమి వెలుగులోకి వచ్చింది. కెనడా కేంద్రంగా పనిచేస్తూ, ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్‌లో హత్యలకు ప్లాన్ చేస్తున్నట్టు తేలింది. కబడ్డీ ప్లేయర్ సందీప్ నంగల్ అంబియా హత్యకేసులో భింద్రన్‌వాలే మద్దతుదారుడు స్నోవర్ ధిల్లాన్ ప్రధాన నిందితుడని పోలీసులు నిర్థారించారు. అమృత్‌సర్‌కు చెందిన ఇతగాడు ఒంటారియోలోని బ్రాంప్టన్ లో ఉంటున్నాడు. ఆర్మీ మిలటరీ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. గ్యాంగ్‌స్టర్ల వల్ల పంజాబ్ కే కాదు… దేశభద్రతకు కూడా ప్రమాదం ఉందనే అంచనాలున్నాయి.
మరోవైపు భారత్‌లో పరిణామాలను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్‌తనకు అనుకూలంగా మలచుకోవడం సాధారణంగా కనిపించే విషయం. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం ద్వారా దేశీయంగా అలజడులు సృష్టించడానికి, ఖలిస్థానీ ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి ఐఎస్‌ఐ పావులు కదిపిందనే వాదనలున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వెనక ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.ఓ పక్క రైతులు ప్రశాంతంగా ఉద్యమంలో ఉంటే, దాన్ని వాడుకుంటూ, రైతుల మాటున ఉగ్రవాదులు కూడా చొరబడ్డారనే అభిప్రాయాలున్నాయి. మొత్తంగా ఖలిస్థానీ ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు స్థానిక ముఠాలను ఐఎస్‌ఐ ఎంపికచేసుకొని, వారిని విద్రోహ శక్తులుగా మార్చిందని చెప్పాలి. రైతు ఉద్యమంలోకి వారిని ప్రవేశపెట్టి ఎర్రకోట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. తద్వారా దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఐఎస్‌ఐ కుట్ర పన్నింది.
రైతు ఉద్యమానికి మద్దతుగా గతంలో కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో కొన్ని ఖలిస్థానీ ముఠాలు నిరసన ప్రదర్శనలు జరిపాయి. అంతర్జాతీయంగా ఇండియా పరువును మసకబార్చేందుకు ఐఎస్‌ఐ అలాంటి చవకబారు జిత్తులు వేసినట్లు నిఘాసంస్థలు తేల్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం ముందు గతంలో వేల సంఖ్యలో నిరసనకారులు ఖలిస్తానీ జెండాలను ప్రదర్శించారు. దేశీయంగా ఖలిస్థాన్ ఉద్యమానికి సరైన మద్దతు లేకపోయినా- కొన్ని గ్రూపులు ఉత్తర అమెరికా, యూరప్ నుంచి పనిచేస్తూ దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి పంజాబ్‌లో వరుస వివాదాలు హాట్ టాపిక్‌గా మారాయ్. దీంతో మున్ముందు రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయాననే ఆందోళన నెలకొంది.
ఇప్పటికే పంజాబ్ అంటే డ్రగ్స్ అడ్డా అనే అభిప్రాయం బలపడింది. ఎడాపెడా అందుబాటులోకి వస్తున్న మాదక ద్రవ్యాలు మత్తుకు బానిసలైనవారి సంఖ్యను పెంచి డిమాండును మరింత ఎగదోస్తున్నాయి. హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారు ఎంతటి అకృత్యాలు మరియు నేరాలు చేయడానికి వెనుకాడటం లేదు. దీనికి ఖలిస్తాన్ ఉద్యమం తోడవటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఆందోళన ఏర్పడింది.
పంజాబ్ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా హత్య సంచలనం సృష్టించింది. వీఐపీ కల్చర్‌కు ముగింపే పలికే క్రమంలో భాగంగా.. భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. సిద్ధూ మూసే వాలా నిర్లక్ష్యమే అతని ప్రాణం తీసినట్లు తేలింది. 29 ఏళ్ల ఈ యువ ర్యాపర్ గ్యాంగ్‌స్టర్‌లను ప్రొత్సహించేలా ర్యాప్‌లకు కడుతుంటాడు. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు. సిద్ధూ మూసే వాలాతో పాటు 424 మందికి పంజాబ్ ప్రభుత్వం శనివారం వీఐపీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. సిద్ధూకి నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. ఇద్దరిని మాత్రమే వెనక్కి తీసుకుంది పంజాబ్ పోలీస్ శాఖ. అయితే సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత నిషేధిత ఖలిస్తాన్ గ్రూపులు పంజాబీ గాయకులకు జారీ చేసిన బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. ఖలిస్తాన్ కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు.
సిద్ధూ మూసేవాలా ఘటనకు ముందు కొద్ది నెలలుగా ఖలిస్తాన్ గ్రూపుల అరాచకాలు పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ఏకంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం గేటుకు ఖలిస్తానీ జెండాలు కట్టడం సంచలనం రేపింది. గేటుకు రెండు వైపులా పసుపు రంగు జెండాలు ఎగరేసశారు. అటు అసెంబ్లీ గోడలపై కూడా ఖలిస్తాన్ అని రాశారు. అంతకుముందే హర్యానాలో కొందరు ఖలిస్తాన్ ఉగ్రవాదులు భారీ మొత్తంలో ఆయుధాలతో పట్టుబడ్డారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను అందుకొని.. వాటిని పంజాబ్ నుంచి హర్యానా మీదుగా నాందేడ్, తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా.. హర్యానా పోలీసులు పట్టుకున్నారు. ఇక రెండు వారాల క్రితమే పంజాబ్‌లోని ఒక పార్క్ గోడపై ఖలిస్తాన్ జిందాబాద్ నినాదం కనిపించడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది దానిపై పెయింట్ వేసి కనిపించకుండా చేశారు.
మే9న పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడి జరిగింది.
మే8న పంజాబ్ పోలీసులు పాకిస్తాన్ సరిహద్దులోని తార్న్ తరన్ జిల్లాలో నౌషేహ్రా పనువాన్ నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.వారి వద్ద నుండి ఒకటిన్నర కిలోల ఆర్డీఎక్స్ తో ప్యాక్ చేసిన పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఇలాంటి వరుస ఘటనలు ఖలిస్తానీ గ్రూపుల యాక్టివిటీస్ ఉధృతంగా మారుతున్నాయని చెప్తున్నాయి.
అంతకుముందు పంజాబ్ లో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరపొద్దంటూ బెదిరింపులకు పాల్పడింది. పైగా ఈ అంశంపై దర్యాప్తును నిలిపివేయాలంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం కూడా తెలిపింది. ఇదే కాకుండా, పంజాబ్ లో కొంత కాలంగా అరాచకాలు పెరుగుతున్నాయి. డ్రోన్ లతో ఆయుధాలు దిగుతున్నాయి. బాంబుదాడులు జరుగుతున్నాయి. గ్రేనేడ్ లు పేలుతున్నాయి. ఇలాంటి అనేక ఘటనల వెనుక ఖలిస్తాన్ గ్రూపుల హస్తం ఉందనే ఆధారాలు లభిస్తున్నాయి.
హర్యానాలో పంజాబ్ ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు లభించటం, హిమాచల్ అసెంబ్లీ వెలుపల ఖలిస్తాన్ జిందాబాద్ పోస్టర్లతో ఆ రాష్ట్రంలో ఉగ్రవాద మేఘాలు కమ్ముకుంటున్నట్లు స్పష్టమైంది. ఇండియన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం, పంజాబ్‌లో గత కొంకాలంగా అంతర్గతంగా ఉగ్రవాద సంస్థలు మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా జీవం పోసుకుంటున్నాయి. ఇందులో గ్యాంగ్‌స్టర్లు.. నిరుద్యోగ యువతకు గాలం వేస్తూ ఖలిస్తాన్ వేవ్‌తో ముడిపెడుతున్నారు.
పంజాబీలు ప్రపంచంలో అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే అమెరికా, యూకె, కెనడా లాంటిదేశాలకు వలస వెళ్లిన వేలాది కుటుంబాలు అనేక వ్యాపారాల్లో సెటిలయ్యాయి. అంతెందుకు అమెరికాలో సిక్కులు ప్రత్యేక గుర్తింపు కోసం కూడా పోరాడారు. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 10 లక్షల మంది సిక్కు జనాభా ఉంది. దీంతో ఖలిస్తాన్ ఉద్యమానికి ఇటు భారత గడ్డపై ఎంత సపోర్ట్ ఉందో, అంతకంటే ఎక్కువగా విదేశాల్లో ఉన్న సిక్కుల నుండి ఉందనే వాదనలున్నాయి.
ఖల్సా అంటే పంజాబీ భాషలో పవిత్రం అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్రభూమి. తెల్లవాడు దేశాన్ని వదిలిన తర్వాత, సిక్కులు కూడా తమకంటూ ప్రత్యేకంగా ఒక దేశం కావాలని ఉద్యమం చేపట్టారు. 1941 లో పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో సిక్కుల జనాభా దాదాపు 20శాతం ఉంటే, విభజన తర్వాత మెజారిటీ సిక్కులు భారతదేశానికి వచ్చేసారు. ఈ జనాభాలో కొందరి నుండి వచ్చిన డిమాండే ఖలిస్తాన్.
1970లనుండి ఖలిస్తాన్ ఉద్యమం మరింత ఊపందుకుంది. భారత ప్రభుత్వం ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సిక్కులు ఈ ఉద్యమాన్ని ఆపలేదు. 1984 జూన్ 3న భారత సైన్యం కుల్దీప్ సింగ్ బ్రార్ నేతృత్వంలో గోల్డెన్ టెంపుల్ ను చుట్టుముట్టారు. బింద్రన్ వాలేని మరియు ఉగ్రవాదుల్ని లొంగిపోవాలని ఆదేశించారు. కానీ వారు లొంగిపోలేదు. ఇక చేసేదేమి లేక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్ లో వున్న సందర్శకులను బయటకు విడిచిపెట్టమని కోరారు. ఉగ్రవాదులు ఎంతసేపటికి లొంగిపోకపోవడంతో ఇక చేసేదేమి లేక సైనికులు కాల్పులు చేపట్టారు. 24 గంటలు కాల్పులు జరిపిన తర్వాత గోల్డెన్ టెంపుల్ సైనికుల ఆధీనంలోకి వచ్చింది. ఈ కాల్పుల్లో బింద్రన్ వాలే మరణించాడు. ఈ ఆపరేషన్లో భారత ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 1592 మందిని పట్టుకున్నారు. 493 మంది మరణించారు. ఇందులో ఉగ్రవాదులు మరియు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు సైనికులనుంచి తప్పించుకోవడానికి సాధారణ పౌరులను అడ్డుపెట్టుకోవడంతో ఎక్కువమంది అమాయకపు ప్రజలు బలయ్యారు. ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల ఖలిస్థాన్ ఉద్యమం కొంతవరకు అణిచివేయబడింది. కానీ, ఇది 1984 అక్టోబర్ 31న ఏకంగా ఈ దేశ ప్రధానినే బలితీసుకుంది. ఇందిరాగాంధీ హత్యతో ఉత్తర భారతదేశంలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 3,000 మంది సిక్కులు మరణించారు.
ఇలా చాలా ఏళ్ల పాటు సాగిన ఖలిస్తాన్ ఉద్యమం క్రమంగా చల్లబడింది. ముఖ్యంగా 2000 వ సంవత్సరం తర్వాత సిక్కు ఉగ్రవాదంపై సిక్కుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ఉద్యమం చాలా వరకు సమిసిపోయింది. అయితే, కొంతకాలంగా, మళ్లీ ఖలిస్తాన్ నినాదాలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల ఉద్యమకారుల పేరుతో కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్థాన్ కమెండో ఫోర్స్ , ఆల్ ఇండియా సిఖ్ స్టూడెంట్ ఫెడరేషన్ , ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ , ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ , సిఖ్స్ ఫర్ జస్టిస్ లాంటి ఖలిస్తాన్ గ్రూపుల యాక్టివిటీస్ పెరిగాయి. దీనికి పొరుగునున్న పాకిస్తాన్ నుండి మద్దతు అందుతోందనే ఆధారాలు లభిస్తున్నాయి.
నిజానికి ఖలిస్తాన్ డిమాండ్ 1946 నుండే వినిపిస్తున్నా… 1970ల తర్వాతే ఊపందుకుంది. ఇందిర హత్య తర్వాత, ప్రభుత్వాలు క్రమంగా అణచివేస్తే 2000 సంవత్సరం తర్వాత సద్ధుమణిగింది. మళ్లీ ఇప్పుడు పంజాబ్ లో ఉగ్రమేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖలిస్తాన్ జెండా ఎగరాల్సిందే అంటున్న వేర్పాటువాదుల తీరుతో పంజాబ్ ప్రమాదంలో ఉందని స్పష్టమౌతోంది.
జరుగుతున్న పరిణామాలను గమనిస్తే పంజాబ్‌లో మళ్లీ ఉగ్రవాదం జడలు విప్పుతోందనే చెప్పాలి.
వరుస ఘటనలు దేశాన్ని హెచ్చరిస్తున్నాయి. ఖలిస్తాన్ నినాదాలు, డ్రోన్ ల ద్వారా బాంబుల సరఫరా, ఆర్డీఎక్స్ పట్టివేత లాంటివి గమనిస్తే,
రాష్ట్రంలో ఉగ్రవాద మేఘాలు కమ్ముకుంటున్నట్లు స్పష్టమవుతోంది. మరోపక్క ఏప్రిల్ 29న పాటియాలాలో కొన్ని సిక్కు హిందూ మితవాద సంస్థల మధ్య జరిగిన మత ఘర్షణ మరింత ఆందోళనకు కారణమైంది.
ఈ ఘటనల్లో కొన్ని అమెరికా కేంద్రంగా పనిచేసే వేర్పాటువాద సంస్థ, సిఖ్స్ ఫర్ జస్టిస్ స్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పిలుపు మేరకే జరిగాయని భద్రతా దళాలు నిర్ధారణకు వచ్చాయి. నిజానికి పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని పునరుజ్జీవం పోసేందుకు పాకిస్తాన్ చాలా కాలంగా నీచమైన ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం పంజాబ్ నుంచి పారిపోయి పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందిన ఉగ్రవాది బబ్బర్ ఖల్సా చీఫ్ వాధ్వా సింగ్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా, భారతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ చీఫ్ భాయ్ లఖ్బీర్ సింగ్ రోడే, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్‌కు చెందిన పరమ్‌జిత్ సింగ్ పంజ్వాడ్‌లను పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI బహిరంగంగా ఉపయోగించుకుంటుంది.
ఇటలీ, కెనడా, యుఎస్‌తో పాటు, పాకిస్తాన్‌కు చెందిన దేశ వ్యతిరేక గ్రూపులు ప్రజలను రెచ్చగొట్టి పంజాబ్ ని అల్లకల్లోలం చేయటానికి ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. గత ఏప్రిల్ 15న, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను హర్యానా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల్లో ఖలిస్తాన్ జెండాను ఎగురవేయాలని విజ్ఞప్తి చేశాడురు. హర్యానా బనేగా ఖలిస్తాన్ అనే శీర్షికతో పన్ను ఒక లేఖను విడుదల చేశాడు.
అయితే గతంలో అమరీందర్ సింగ్ హయాంలో కొన్ని కఠిన చర్యలతో ఖలిస్తాన్ గ్రూపుల కదలికలు తగ్గినప్పటికీ, ఇప్పుడు ఆప్ సర్కారు రాగానే ఒక్కసారిగా పెరిగాయనే వాదనలున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి భవత్ సింగ్‌మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో క్షీశాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
రైతు ఉద్యమం తర్వాత యూకెలో భారత హై కమిషన్ కార్యాలయం ముందు గతంలో వేల సంఖ్యలో నిరసనకారులు ఖలిస్తానీ జెండాలను ప్రదర్శించారు. ఐఎస్‌ఐ నిధులు అందించే సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన పరమ్‌జీత్ పన్ను ఆ నిరసనల్లో పాల్గొన్నాడు. పఠాన్‌కోట్‌లోని సైనిక కంటోన్మెంట్ గేటు వద్ద గతేడాది నవంబర్‌లో జరిగిన గ్రెనేడ్ దాడి వెనకా పాకిస్థాన్ హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. పంజాబ్ కు పాకిస్తాన్ కు 553 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. గతేడాది పంజాబ్ సరిహద్దు సమీపంలో 42 గుర్తు తెలియని డ్రోన్లు గాలిలో చక్కర్లు కొట్టాయి. డ్రోన్లద్వారా ఆయుధాలు అందుకుంటున్న ఖలిస్థానీ తీవ్రవాదులు వరుసగా పట్టుబడుతున్నారు. గత సంవత్సరం ఆగస్టులో పంజాబ్ పోలీసులు ఖలిస్థాన్ నాయకుడు బింద్రన్‌వాలే మేనల్లుడి కొడుకు గుర్‌ముఖ్ సింగ్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
మరోపక్క సామాజిక మాధ్యమాల్లో ఖలిస్థాన్‌తో సంబంధం ఉన్న వేలాది పోస్టులను సైబర్ సెల్స్ గుర్తిస్తున్నాయి. రైతు ఉద్యమ సమయంలో అకస్మాత్తుగా అవన్నీ క్రియాశీలంగా మారాయి. పాశ్చాత్య దేశాలనుంచి పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల ముఠాలతో ముప్పుందని ఇప్పటికే నిఘా సంస్థలు హెచ్చరించాయి. అందుకు తగ్గట్టే, ఖలిస్థాన్ జెండాను ఎగరేద్దాం… మోదీ త్రివర్ణ పతాకాన్ని నిరోధిద్దాం అని సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ ప్రకటించింది.
సిక్కులు తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా ప్రత్యేక దేశంగా అవతరించాల్సిందేనన్న భావన ఖలిస్తాన్ ఉద్యమానిది. 1946నుంచే సిక్కు ప్రత్యేక దేశం డిమాండ్ ఉన్నప్పటికీ.. స్వాతాంత్య్రానంతరం అది చాలా కాలం కనిపించలేదు. పైగా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ పేరుతో మూడు రాష్ట్రాలుగా విభజనకు గురవటంతో ఖలిస్తాన్ వాదన బలహీనమైంది. దీంతో తిరిగి మత ప్రాతిపదికన ఏకమయ్యేందుకు సిక్కులు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఖలీస్తాన్ ఉద్యమం అవతరించింది. 1970, 1980 దశకాల్లో ఊపందుకుని ఓ దశలో ఖలిస్థాన్ కరెన్సీ, పాస్‌పోర్టులను కూడా విడుదల చేసే వరకు వచ్చింది. ఇందిరా గాంధీ హత్య తర్వాత ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించటంతో సద్దుమణిగిన ఈ ఉద్యమం ఇప్పుడు మళ్లీ నిద్రలేచింది. దేశానికి ప్రమాదకరంగా మారుతోంది.
ముఖ్యంగా బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఆలిండియా సిఖ్ యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలు కెనడా, యూకేలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ప్రత్యేక ఖలిస్తాన్ ఎజెండాతో దాదాపు పదమూడు ఉగ్ర సంస్థలు విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా సిఖ్స్ ఫర్ జస్టిస్ సోషల్ మీడియా వేదికగా సిక్కు జాతీయ వాదం, వేర్పాటు వాద భావజాలాన్ని యువతలో నూరిపోస్తోంది. యువతకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు గుంజుతోంది. ఫలితంగా పంజాబ్‌లో మళ్లీ ఖలిస్తాన్ మాట గట్టిగా వినిపిస్తోంది. ఏకంగా ఉగ్రవాది బింద్రన్‌వాలే బొమ్మలతో టీషర్ట్స్ కూడా మార్కెట్లో కనిపిస్తున్నాయి.
బబ్బర్ ఖల్సా చీఫ్ వాధ్వా సింగ్, సిఖ్స్ ఫర్ జస్టిస్ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్, ఖలిస్తానీ తీవ్రవాది పరమ్ సింగ్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ నేత లఖ్బీర్ సింగ్ లాంటివాళ్లు విదేశాల నుండి ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అమెరికా, యూకె, కెనడా, యూరప్ దేశాల నుండి ఉగ్రకార్యకలాపాలకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే, నిఘా సంస్థలు నిరంతరం ఎలర్ట్ గా లేకపోతే పంజాబ్ అల్లకల్లోలం కావటానికి పెద్ద సమయం పట్టదని చెప్పాలి. సమాచార మాధ్యమాలు అంతగా లేని రోజుల్లోనే వేలాదిమందిని పొట్టనపెట్టుకుని దేశాన్ని ఆందోళనలో పడేసింది ఖలిస్తాన్ ఉద్యమం.
ఇప్పుడు వాట్సాప్ కాలంలో అది తిరిగి ప్రారంభమైతే.. జరిగే నష్టం ఊహకు కూడా అందదు