బాల్ ఠాక్రే వేసిన పునాదుల్ని బిజెపి కదిలించగలదా?మరాఠా సెంటిమెంట్‌ని రాజకీయ వ్యూహాలు ఓడిస్తాయా?శివసేనకి మళ్లీ పుంజుకునేంత శక్తి ఉందా?మహా రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతున్నాయి?
పదవిలో ఉన్న ముఖ్యమంత్రి సాక్షాత్తూ అధికారిక నివాసం వదిలి సొంత ఇంటికి వెళ్లిపోయాడు. కిడ్నాప్‌కు గురయ్యామంటా రెబల్ ఎమ్మెల్యేలు కొందరు వెనక్కి వచ్చారు. రాయబారానికి వెళ్లిన ఎమ్మెల్యే అవతలి పక్షంలో చేరాడు. తిరుగుబాటు మానేసి దారికొస్తే, కూర్చుని మాట్లాడుకుందాం అని అధికార పక్షం ఆఫర్లు… వెరసి ప్రజాస్వామ్యమా ఇది లేక కేవలం అదికారం కోసం ఆడే డ్రామా మాత్రమేనా? ఒకటా రెండా.. ఎన్ని మలుపులు. ఎన్ని రాజకీయాలు. ఎన్ని ప్రశ్నలు..
మహాపరిణామాలు కొద్ది రోజులుగా సంచలనంగా మారాయి. సినిమాల్లో కూడా కనిపించనన్ని ట్విస్టులు మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అండతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో శివసేన నడుపుతున్న మహా వికాస్ అఘాడీ కూటమి సర్కార్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితే లేదని తిరుగుబాటు వర్గం స్పష్టం చేస్తోంది. ఇంకాచెప్తే మాదే అసలైన శివసేన అంటున్నారు. ఈ పరిస్థితిలో నేడో, రేపో… ఉద్ధవ్ ప్రభుత్వ పతనం తప్పదనిపిస్తోంది. పరిస్థితి చూస్తే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలాగూ కుదిరేలా లేదనేది ఉధ్ధవ్ కి స్పష్టమౌతున్న అంశం. ఈ సమయంలో ప్రభుత్వం సంగతి తర్వాత, చివరికి పార్టీ అయినా మిగులుతుందా లేదా అనే ప్రశ్న రాజకీయ పక్షాల్లో వినిపిస్తోంది.
మూడు రోజులు దాటినా ముగిసిపోని మహారాష్ట్ర సంక్షోభంలో తెరముందు కనిపిస్తున్నది కొందరే. వెనకున్నదెవరనే చర్చ పెద్ద ఎత్తున ఉంది. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని మమతా బెనర్జీ సహా ఎంతోమంది ఆరోపిస్తున్నారు. బీజేపీ మాత్రం ఇందులో మాకే సంబంధం లేదని చెప్తోంది. మరోసారి సీఎం పీఠం ఎక్కాలని తపిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ సహా సీనియర్ బీజేపీ నేతలెవరూ నోరు మెదపడం లేదు.
అటు తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్‌లోని సూరత్, అక్కడి నుండి అస్సామ్‌లోని గువాహటి దాకా ప్రత్యేక విమానాలు, బస్సుల్లో వందల కిలోమీటర్లు వెళ్ళడం, స్టార్ హోటళ్ళలో ఎకామడేషన్. ప్రతిచోట బిజెపి పాలిత రాష్ట్రాల పహారా.. ఇవన్నీ చూస్తుంటే తెరవెనుక ఉన్నదెవరో, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిదో స్పష్టమౌతుంది. పైగా, షిండే, స్వయంగా బిజెపితో పొత్తు పెట్టుకునే ఆప్షన్ గురించి మాట్లాడటం ఎలాగూ తెలిసిన విషయమే.
అయితే. ఈ ఎపిసోడ్ వెనుక ఎవరున్నారనేదానికంటే… దీని పరిణామాలు ఎలా ఉంటాయి… ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. నిజానికి ఈ పరిణామాలేవీ దేశంలో కొత్త కాదు. గతంలో గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్ సహా పలుచోట్ల ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చటానికి బీజేపీ సాగించిన ఆపరేషన్ కమల్‌ను తేలిగ్గా మర్చిపోలేం. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే జరుగుతోంది. కాకపోతే, 2019లో తగిలిన దెబ్బతో ఈసారి ఆచితూచి అడుగేస్తూ, ఆఖరి క్షణం వరకు తాను బయటపడకూడదన్న జాగ్రత్త వహిస్తోంది.
అయితే ఇక్కడ అలాగని తప్పంతా బీజేపీదే అనడానికి వీల్లేదు. ఇందులో ఉద్ధవ్ స్వయంకృతాపరాధమూ ఉంది. కరోనా కాలం, సర్జరీతో బలహీనపడ్డ ఆరోగ్యం కారణాలు ఏమైనా సొంత ఎమ్మెల్యేలకు సైతం ఉద్ధవ్ అందుబాటులో లేరనేది ప్రధాన ఆరోపణ. చుట్టూ ఉన్న కోటరీ ఉండనే ఉంది. అందరి బలవంతం వల్లే సీఎం అయ్యానంటున్న ఉద్ధవ్ తీరా తన రాజకీయ వారసుడిగా కుమారుడు ఆదిత్యను భుజానికెత్తుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పరిశ్రమించిన షిండే… లాంటివాళ్లకు ఇది రుచించలేదు. హిందూత్వ నినాదంతో బీజేపీకి సహజ మిత్రపక్షమైన శివసేన దానికి , లౌకికవాదాన్ని నెత్తినెత్తుకోవడమూ శివసైనికులకు మింగుడుపడట్లేదు. అన్నిటికీ మించి కేంద్రం చేతిలోని ఈడీ వేధింపుల భయం, సీబీఐ సవాళ్లు ఉండనే ఉన్నాయి.
అయితే ఈ ఎపిసోడ్ కు పునాదులు 2019 అక్టోబర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పడ్డాయని చెప్పాలి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం శివసేన బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, కాంగ్రెస్, ఎన్సీపీ లతో కలిసింది. మెజారిటీ లేకుండానే ఎత్తులు వేసే బిజెపి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నచోట చెలరేగిపోదా.. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది కూడా అదే..
పైగా బిజెపికి కాంగ్రెస్ ని దేశంలో లేకుండా చేయాలని ఎప్పటినుండో ఉంది. బిజెపి రాజకీయ లక్ష్యాలన్నీ దీని చుట్టూ ఉంటాయి. కానీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన కాంగ్రెస్ కు బలం పెరిగే ఛాన్స్ ఇచ్చింది. ఈ అసంతృప్తి కూడా బిజెపిలో ఉంది. అయితే, రెండువారాల క్రితం కూడా మహాపరిణామాలు ఇలా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. రాజ్యసభ ఎన్నికల్లో, ఆ వెంటనే విధాన పరిషత్ ఎన్నికల్లో ఎదురైన ఓటములతో రెండే వారాల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని కూటమి కోట బీటలు వారిపోయింది. శివసేనకు కొంతకాలంగా అంగబలం, అర్థబలమైన ఏక్‌నాథ్ శిండే రూపంలో ముప్పు ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. 285 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మొన్నటిదాకా 55 స్థానాలున్న శివసేన ఇప్పుడు 16 సీట్ల ఉద్ధవ్ సేనగా, 39సీట్ల షిండే శివసేనగా చీలిపోయిందని తెలుస్తోంది.
బాల్ ఠాక్రే గర్జింపులు శివసేన బలంగా మారితే, ఉధ్దవ్ ఠాక్రే మృదు స్వభావం ఆ పార్టీకి నష్టంగా పరిణమించిందనే వాదన వినిపించింది. గతంలో కూడా ఇలాంటి సంక్షోభాలు మూడు చూసింది శివసేన. కానీ అప్పుడు జరిగిన నష్టం స్వల్పమే. పైగా అప్పుడు బాల్ ఠాక్రే ఉన్నారు. ఇప్పుడు కంటిచూపుతో శాసించే నేతలేకపోవటం ఆ పార్టీకి మైనస్సే. అయితే మాత్రం శివసేన ఈ సంక్షోభానికే చెదిరిపోతుందా? ఈ ఎపిసోడ్ నుండి శివసేన ఎలా తేరుకుంటుంది? అంతటి శక్తి ఆ పార్టీకి ఉందా? ఇవన్నీ ఇప్పటికైతే ప్రశ్నలే.
మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. గంట గంటకో మలుపు తీసుకుంటున్నాయి. ఇప్పటికే 40 మంది వరకు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉంటే, ఇప్పుడు కొందరు ఎంపీలు కూడా ఏక్‌నాథ్ షిండే వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం అసోంలోని గువహటిలో ఉన్నారు. బ్లూ రాడిసన్ హోటల్‌లో 40 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి చూసి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉద్ధవ్ ఠాక్రేను వీడుతున్నారు. ఫలితంగా శివసేనలో రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓ దశలో ఏక్‌నాథ్ షిండే క్యాంపులో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు… బీఎంసీ కార్పోరేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా షిండే తో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
బాల్ థాక్రే వారసులం తామేనని.. అసలైన శివసైనికులం తామేనంటున్నారు ఏక్ నాథ్ షిండే. 14మంది రెబెల్ ఎమ్మెల్యేలపై 14 ఉద్ధవ్ ఠాక్రే సస్పెన్షన్ వేటు వేశారు. అయితే 37 మంది శివసేన ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్, డిప్యూటీ స్పీకర్‌కు లేఖలు రాశారు. అంతేకాదు గవర్నర్ ఎదుట బలనిరూపణకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు రెబల్స్ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి శివసేన పార్టీని నాశనం చేస్తున్నారనేది తిరుగుబాటు వర్గం నుండి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ.
తాజా పరిణామాలను చూస్తుంటే.. ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సొంత పార్టీలోనే సీఎం ఉద్ధవ్ థాక్రే ఒంటరిగా మిగిలిపోయారు. ఇంతటి హైడ్రామా మధ్య.. మహారాష్ట్రలో నెక్ట్స్ ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉద్ధవ్ థాక్రే సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు గానీ.. పదవికి రాజీనామా చేయలేదు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే.. గవర్నర్ అతి పెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశముంది. ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయకుంటే.. విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంఖ్యా బలం లేనందున ఆయన ప్రభుత్వం కూలిపోతుంది. ఆ తర్వాత శివసేన రెబల్స్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ మేజిక్ నెంబర్‌కు సరిపడా సంఖ్యా బలగాన్ని బీజేపీ పొందలేకుంటే.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే.. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే, ఇప్పటికైతే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండడానికి కావాల్సిన మూడింట రెండు వంతుల అంకెను షిండే వర్గం చేరుకుందనిపిస్తోంది. 106 సీట్ల బీజేపీ, షిండేసేనతో కలసి మెజారిటీ మార్కు 144ను దాటటం పెద్ద కష్టం కాదు.
ఈ రాజకీయ సంక్షోభం మధ్య క్యాడర్‌ను ఐక్యంగా ఉంచడానికి చివరి ప్రయత్నంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీఎంసీ కార్పొరేటర్లను సమావేశానికి పిలిచారు. అంతకుముందు అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. పార్టీ క్యాడర్ ఎవరి వైపు ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల తర్వాత శివసేనలో తదుపరి పెద్ద చీలిక BMC కార్పొరేటర్ల మధ్య ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. బీఎంసీని 1989 నుండి శివసేన ఏలుతోంది.అక్టోబరు-నవంబర్‌లో జరగనున్న బీఎంసీ ఎన్నికలపై ఈ సంక్షోభం ప్రభావం ఉంటుందనే వాదనలున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో శివసేన తన బలాన్నే కాదు… తన పూర్వ ప్రభావాన్నీ పోగొట్టుకుందని కొందరి వాదన. ఒకప్పుడు శివసేనదే రాజ్యమైన మహారాష్ట్రలో కొన్నేళ్లుగా బీజేపీ అనూహ్యంగా పెరిగితే, శివసేన ఊపు తగ్గింది. యూపీ తర్వాత మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కమలనాథుల వశమైతే, దేశంలో బీజేపీ సాగిస్తున్న ఆపరేషన్ కమల్ లో మరో టార్గెట్ పూర్తయినట్టే. కానీ, మరాఠీ సెంటిమెంట్‌ని అంత తేలిగ్గా తీసిపారేయలేం.. మహారాష్ట్రలో బాల్ ఠాక్రే వేసిన పునాదుల్ని తేలిగ్గా తీసుకోలేం. సాధారణ వ్యక్తిగా మొదలై, కార్టూనిస్టుగా, ఉద్యమకారుడిగా, కింగ్ మేకర్ గా ఎదిగిన బాల్ ఠాక్రే…దాదాపు నాలుగు శతాబ్దాలు ముంబయిని, మహారాష్ట్రను శాసించారు. బాల్ ఠాక్రే..మాతోశ్రీ నుండి కదలకుండా ముంబయిని, మహారాష్ట్రని శాసించారు. అసలు ముంబయి అంటే శివసేన.. శివసేన అంటేనే ముంబయి. మరాఠా నినాదానికి ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయలేం. అలాంటి చోట ఇప్పుడు ఆ పార్టీలో ఎదురైన సంక్షోభం చిన్నా చితకది కాదు. పార్టీ పునాదుల్ని సైతం పెకలించే రేంజ్ లో కనిపిస్తున్నా….ఇవన్నీ బాల్ ఠాక్రే మహారాష్ట్ర సమాజంలో రగిలించిన సెంటిమెంట్ ముందు ఇవన్నీ చిన్న సమస్యలే అనే వాదనలున్నాయి. అంతెందుకు సీఎం అధికారికి భవనం నుండి ఉద్ధవ్ ఠాక్రే వెళ్తూ కూడా శివసైనికుల్లో రగిల్చిన సెంటిమెంట్ కూడా సామాన్యమైంది కాదు.
టైమ్ చూసి దెబ్బకొట్టడం రాజకీయం. కాంగ్రెస్ కి ప్రాణం పోసి, తనను అధికారానికి దూరం నెట్టిన శివసేనపై బిజెపి ఎప్పటినుండో గుర్రుగా ఉంది. దానికి తోడు అత్యంత అజాగ్రత్తతో ఉన్న ఉధ్దవ్ ఠాక్రే ధోరణి కూడా శివసేన నష్టంగా మారింది. బాల్ ఠాక్రే అంటే ఉన్న భయభక్తులు, ఉధ్దవ్ ఠాక్రేపై శివసైనికులకు లేవు. పైగా ఆయన ఎమ్మెల్యేలకు దూరంగా ఉన్నారనే వాదన ఉండనే ఉంది. కానీ, ఇంత జరిగినా, ఎన్నో సంక్షోభాలను చూసిన పార్టీ, మరాఠా గడ్డమీద బలమైన పునాదులున్న పార్టీ కొందరు నేతలు గట్టుదాటితే, బలహీనమౌతుందనుకోవటం సరికాదు. శివసేన సెంటిమెంట్ బాల్ ఠాక్రే నుంచి మరే నేతకు బదిలీ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎంతమంది పార్టీ మారినా, ఠాక్రే వారసులను బలహీన పరచటం అంత తేలికైతే కాదు. దీన్ని బిజెపి ఎలా బ్రేక్ చేస్తుందో చూడాలి..
శివసేన గురించి మాట్లాడాలంటే ఓ ఐదు దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి..మరాఠా హక్కులు, భూమిపుత్రుల నినాదంతో శివసేన ఏర్పాటు చేశారు బాలాసాహెబ్ ఠాక్రే. తర్వాత హిందుత్వాన్ని భుజాలకెత్తుకున్నారు. భూమి పుత్రుల సిద్ధాంతంతో తెరపైకి వచ్చి… కరడుగట్టిన ప్రాంతీయ తత్త్వంతో ముందుకెళ్లి శివసేన నడిపించిన మరాఠా యోథుడు బాల్ ఠాక్రే. కరడు గట్టిన ప్రాంతీయ వాది అని విమర్శించినా… అరాచకవాదని ప్రత్యర్థులు ఆడిపోసుకున్నా…. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరిదాకా నిలబడ్డాడు బాల్ ఠాక్రే.
మహారాష్ట్ర రాజకీయాల్లో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా శివసేన.. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. మరాఠీల హక్కుల పరిరక్షణ ఎజెండాగా.. పార్టీ మొదలైంది. ఐతే మరాఠీల హక్కుల పరిరక్షణ, మరాఠీ అస్తిత్వ వాదాలకు హిందుత్వ ఎజెండా జోడించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే శివసేనను పటిష్ట పునాదుల మీద నిలబెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ పక్కా హిందూ పార్టీగా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత సుధీర్ఘకాలం పాటు బీజేపీకి సహజ మిత్రపక్షంగా కంటిన్యూ అయింది.
మరాఠా రాజకీయాలను శాసించిన ఠాక్రే…వేసిన పునాదులపై బలంగా ఎదిగిన శివసేన ముంబై రాజకీయాలను ఐదు దశాబ్దాలుగా రూల్ చేస్తోంది.. కరడు గట్టిన హిందూత్వ వాదిగా తెరపైకి వచ్చిన బాల్ ఠాక్రే… ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆ బాటను వీడలేదు. నేనో మరాఠా పుత్రుడిని. ఆ తర్వాతే భారతీయుడిని…అంటారు బాల్ ఠాక్రే. మఠారీ మనూస్ అంటే మరాఠీలకే మహారాష్ట్ర అన్న నినాదమే ఆయన్ను నడిపించింది. రాజకీయంగా గెలిపించింది. ఇంత చరిత్ర ఉన్న శివసేన ఇప్పుడు సంక్షోభం అంచున ఉంది.
గర్జించాల్సిన పెద్దపులి, సాత్వికంగా ఉంటే ఎలా? బాల్ ఠాక్రేకు ఉద్ధవ్ ఠాక్రేకు ఉన్న తేడా అదే. కనుసైగతో రాజకీయాలను, పార్టీని శాసించిన బాల్‌ఠాక్రే నుండి, తండ్రి తీరుతో ఏమాత్రం పొంతన లేని ఉద్ధవ్ ఠాక్రే హయాంలో పార్టీలో అనేక మార్పులు వచ్చాయి. హిందూత్వకు బ్రాండ్ అండాసిడర్ అనేలా ఉండే పార్టీ, సెక్యులర్ పార్టీలతో చేతులు కలపటం ఆ పార్టీ నేతలకు రుచించలేదు. అయితే, సీఎంగా ఉద్ధవ్ పగ్గాలు చేపట్టకపోయింటే ఏక్‌నాథ్ సీఎం అయ్యేవారు. అయితే ఉద్ధవ్ స్వయంగా సీఎం కావడంతో అయన ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
2019 ఎన్నికల తర్వాత రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్.. 48గంటల్లోనే రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2019లో అధికారం కోసం శివసేన బద్ధ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. దీంతో బీజేపీ, శివసేన మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయితే షిండే తిరుగుబాటు వ్యవహారం.. అనేక అనుమానాలకు కారణం అవుతోంది. నిజానికి ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్‌కు వెళ్లడానికి రెండు రోజుల ముందు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సీఎం ఉద్ధవ్‌తో కలిసి కనిపించారు. అకస్మాత్తుగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దాదాపు రెండున్నరేళ్లుగా మహావికాస్ అఘాడీ సర్కార్‌లో మంత్రి కొనసాగుతున్న ఏక్‌నాథ్ షిండేకు, ఆయన అనుచరులకు.. ఇంత హఠాత్తుగా హిందుత్వం ప్రమాదంలో పడిందని ఎందుకు గుర్తుకువచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. అఘాడీ కూటమి అసహజం అని ఇంత ఆలస్యంగా షిండేకు తెలియడం ఏమిటనే చర్చ మొదలైంది.
ఏక్‌నాథ్ షిండే.. తన బ్యాచ్ ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్‌కు, ఆ తర్వాత అస్సోంకు వెళ్లారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. ఈ రచ్చ అంతా జరుగుతున్న సమయంలో.. ఫడ్నవీస్ ఢిల్లీలో కీలక మంతనాలు మొదలుపెట్టారు. ఈ ఎపిసోడ్ అంతా పరిశీలిస్తే.. షిండే తిరుగుబాటు వెనక కమలం పార్టీ హస్తం ఉందనే అంశం స్పష్టం. ఈ పరిణామాల మశ్య ఇప్పుడు ఏకంగా శివసేన పార్టీ భవిష్యత్తే అయోమయంలో పడిందనే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ, సంక్షోభాలు, తిరుగుబాట్లు రాజకీయాల్లో సహజమే అని, అన్నిటిని తట్టుకుని మళ్లీ పుంజుకునే శక్తి తమకుందని ఉధ్దవ్ ఠాక్రే వర్గం భావిస్తోంది. అన్నిటికీ మించి బాల్ ఠాక్రే వారసులుగా, నేతలు గోడ దూకినా, పార్టీ కేడర్ తమవైపే ఉంటుందని ఠాక్రే బావిస్తున్నారు.