ఒకటి బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం.రెండోది టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం స్థాపించటం.మూడోది జనసేన ఒంటరిగా అధికారంలోకి రావటంఈ మూడు ఆప్షన్లే ఉన్నాయంటున్నారు వపన్ కల్యాణ్..పొత్తుల విషయంలో తానే కాదని..టీడీపీ కూడా తగ్గాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు.పొత్తుల విషయంలో గతంలో వన్‌సైడ్ లవ్ అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబుకు పరోక్ష సంకేతాలు ఇచ్చారు పవన్ కల్యాణ్.
గతంలో కుప్పంలో ఓ ర్యాలీలో కార్యకర్తల ప్రశ్నలకు చంద్రబాబు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. జనసేనతో పొత్తు గురించి వన్ సైడ్ లవ్ అన్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై గట్టిగానే స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్నారు. ఇప్పుడు మూడు ఆప్షన్లతో ముందుకొచ్చారు పవన్ కల్యాణ్.తాను సూచించిన మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని, తగ్గటంపై బైబిల్ సూక్తిని కూడా పవన్ గుర్తుచేశారు. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిదని పవన్ సూచించారు.
2014 ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి సునాయాసంగా అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అప్పట్లో జనసేన తన అభ్యర్థులను బరిలో దించకుండా టిడిపి, బిజెపికి మద్దతిచ్చింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నాయి. జనసేన పార్టీ బీఎస్పీ, వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీచేసినా సీట్లు సాధించలేకపోయింది. ఫలితంగా వైసీపీ 151 స్థానాలతో భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. టిడిపి 23 స్థానాలకే పరిమితం కాగా, జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో రెండు చోట్ల ఓడి పోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయినా, పట్టువదలకుండా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కల్యాణ్.
అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ బిజెపి, టిడిపిలకు ఆప్షన్లు ఇవ్వటంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అసలు పవన్ కల్యాణ్ ధైర్యం ఏమిటి? తగ్గేదేలా అనటం లో ఆయన వ్యూహం ఏమిటనే చర్చ నడుస్తోంది. 2014 నుండి టిడిపితో, బిజెపితో కలిసి పనిచేసిన పార్టీగా జనసేన ఇప్పుడు తమకు ప్రాధాన్యత కావాలని ఆశించటం తప్పు కాదు…కానీ, ఏపీలో టిడిపి బలం ఎంత? జనసేన బలం ఎంత? అనే దాన్ని వదిలేసి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ కి బలమైన ఫ్యాన్ బేస్, ఉండవచ్చు. గతంలో చిరంజీవి కూడా 18సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు జనసేనకు గత ఎన్నికలతో పోలిస్తే బలం మరికొంత పెరిగి ఉండొచ్చు. పైగా పవన్ కల్యాణ్ గతంలో చేసినట్టు, సీజనల్ గా కాకుండా రెగ్యులర్ గా పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు..సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని విషయాలపై స్పందిస్తున్నారు..అంత మాత్రాన సీఎం ఎవరు? ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలనే దాన్ని డిసైడ్ చేసే శక్తి ఆయనలో ఉందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న..
ఏపీలో గత రెండు ఎన్నికలను గమనిస్తే,2014లో కలిసి పనిచేసిన టిడిపి, బిజెపి, జనసేన కూటమి 46.69 శాతం ఓట్లు సాధించింది.ఆ ఎన్నికల్లో వైసీపీకి 45.01 శాతం ఓట్లొచ్చాయి.2019లో టిడిపికి 39.18శాతం ఓట్లు, జనసేనకు 6.8శాతం ఓట్లు, బిజెపికి 1 శాతంలోపే ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికల్లో వైసీపీకి 49.95శాతం ఓట్లు వచ్చాయి.
గత ఎన్నికల్లో 6.8శాతం ఓట్లు సాధించారు పవన్ కల్యాణ్.విడిగా పోటీచేసి నష్టపోయామని, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా చేయాలనేదే ఇప్పటికి వరకు వినిపించిన వ్యూహం. కానీ, అదొక్కటే కాదు.. ఇప్పుడు మిగతా పార్టీలు తగ్గాల్సిందే.. మాకు దారి ఇవ్వాల్సిందే అని జనసేనాని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ చిత్రంలో ఎవరు సీఎం కావాలి, ఏ పార్టీకి తగ్గాలి అని డిసైడ్ చేసే శక్తి పీకె లో ఉందని ఆయన భావిస్తున్నారని అనుకోవాలి.
మొత్తానికి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో లో ఎవరి వ్యూహం ఏమిటి? తగ్గటాలు, పెరగడాలు, త్యాగాలు, స్నేహాలు వర్కవుట్ అవుతాయా అనే చర్చమొదలైంది. ఇప్పటికి పవన్ 3 ఆప్షన్లు చెప్పాడు.. మరి నాలుగో ఆప్షన్ పై ఎందుకు మాట్లాడలేదు. అనే చర్చ నడుస్తోంది. మరోపక్క బిజెపి, పవన్ సీఎం అభ్యర్థిత్వంపై అప్పుడే చెప్పలేమంటోంది. టిడిపి ప్రస్తుతానికి మౌనంగా ఉంది. దీంతో ఎవరి వ్యూహం ఏమిటి? పొత్తుల రాజకీయం ఎటు వెళ్తుందనే ఆసక్తి ఏర్పడింది.
మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తుల చర్చ ఊపందుకుంది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి మాట్లాడుతూ వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆప్షన్లతో రావటంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. నిజానికి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే అధికారంలోకి వచ్చింది. దీంతో ఒంటరిగా పోటీ చేస్తే నష్టమే అనే విషయం టిడిపి, జనసేన, బిజెపి…మూడు పార్టీలకూ తెలుసు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పొత్తులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
అయితే, మహానాడు తర్వాత టిడిపికి కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పాలి.10, 20 సీట్లైనా జనసేనకు ఎందుకివ్వాలనే పరిస్థితికి టిడిపి వచ్చిందనే టాక్ ఉంది.టిడిపి కార్యకర్తలు దీనిపై బాహాటంగానే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు..కొందరు టిడిపి నేతలు పరోక్షంగా ట్వీట్లు చేస్తున్నారు. జనసేన తన బలాన్ని అతిగా ఊహించుకుంటోందని అసలు కంటే కొసరు గొప్పకాదనేలా విమర్శిస్తున్నారు. అంటే 40శాతం ఓట్లు సాధించి పవన్ కల్యాణ్ ని సీఎం చేయాలా అనే ప్రశ్న టిడిపి వర్గాల నుంచి ఉంది. ఇవన్నీ కాదు.. ఇప్పుడు టిడిపి ఉన్న పరిస్థితి చూస్తే, ఎప్పుడెప్పుడా అధికారం అన్నట్టుంది. అలాంటపుడు టిడిపి పవన్ కల్యాణ్ ని సీఎం చేయటానికి శ్రమిస్తుందా?
మరోపక్క మహానాడు తర్వాత టీడీపీ నేతలు భిన్నంగానే స్పందిస్తున్నారు. వార్ వన్ సైడ్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీని తామే ఢీకొంటామన్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా.. కొందరు టీడీపీ నేతల ధోరణి మాత్రం మారింది. పవన్ స్టేట్‌మెంట్‌పై టీడీపీ ఇంత వరకు నోరు విప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం టిడిపి, జనసేన శ్రేణులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఇంత వరకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఎవరికి ఎవరు షరతులు పెట్టాలో తెలుస్తుందని టిడిపి కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి…కానీ ఆ కొన్ని వడ్లు వల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా….సేనాధిపతి… అంటూ పోస్టు పెట్టారు. దీనికి జనసైనికులు సీరియస్ గా స్పందించారు. బుచ్చయ్య వ్యాఖ్యలను కౌంటర్ చేసారు. 2014లో పవన్ మద్దతుతో ఎలా ఓట్లు వచ్చాయి.. 2019 లో ఎలా ఓట్లు చీలాయో వివరిస్తూ జనసైనికులు…పవన్ అభిమానులు ఆయనకు సమాధానంగా ట్వీట్లు చేస్తున్నారు.
అయితే ఈ వాదనలు ఎలా ఉన్నా, పొత్తులున్న ఎన్నికల్లో టిడిపి లాభపడిందని చరిత్ర చెప్తోంది. అంటే ఇప్పుడు పవన్ ఆప్షప్లపై తేల్చుకోవాల్సింది టీడీపీనే. దీనికి బీజేపీ ఒప్పుకుంటుందా, లేదా అన్నది పక్కన పెడితే.. పార్టీ లైన్ ఏంటనేది చంద్రబాబు డిసైడ్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య లాంటివి. నౌ ఆర్ నెవర్ అన్న రేంజ్‌లో చంద్రబాబు పోరాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన వయసు 72 సంవత్సరాలు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందంటే.. ఆ పార్టీ కేడర్ చెల్లాచెదరు అవుతుందనే భయం ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిందంటే.. ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసే రాజకీయాలు మరింతగా పెరుగుతాయి. అప్పుడు పార్టీని, నేతల్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదు.
అంటే, జీవన్మరణ సమస్యలాంటి ఎన్నికలకు వెళ్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పొత్తులపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహానాడు తర్వాత కొందరు పార్టీ నేతలు.. తమ బలం పెరిగిందని చెబుతున్నా.. అది ఎంతవరకు పెరిగిందనేది ఎన్నికలయ్యాక కానీ తెలియదు. మహానాడు లాంటి పార్టీ కార్యక్రమం హిట్ అయిందని అనుకొని.. పొత్తులపై నిర్ణయం తీసుకుంటే అది పొరపాటే అవుతుందన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే సింగిల్‌గా పోటీ చేసి చేతులు కాల్చుకుంటే.. ఇక టీడీపీ భవిష్యత్తే ప్రశ్నార్ధకం అవుతుంది.
కానీ, పవన్ ఆప్షన్లతో రావటం, టీడీపీని డిఫెన్సులో పడేసినట్టే కన్పిస్తోంది. ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాననే పవన్ కామెంట్లతో తమతో కలిసి పని చేయడానికి సంసిద్దతను పవన్ తన కామెంట్ల ద్వారా తెలిపారని అంతా భావించారు. అదే తరహాలో టీడీపీ కూడా అనుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో కూడా పవన్ ఇదే తరహాలో మాట్లాడితే పొత్తు పక్కా అని తమ్ముళ్లూ ఫిక్స్ అయినట్టే కన్పించారు. పొత్తులపై స్పష్టత వచ్చేసినట్టేనని అనుకున్నారు. అయితే జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు టీడీపీ షాకుకు గురయ్యేలా చేశాయనే చెప్పాలి.
మహానాడు సక్సెస్ తర్వాత వైసీపీని ఉద్దేశించి వార్ వన్ సైడ్ అనే కామెంట్ చేశారు బాబు. ఇప్పుడీ కామెంటే పవన్ తగ్గేదేలే కామెంటుకు కారణంగా కన్పిస్తోందనే చర్చ జరుగుతోంది. వార్ వన్ సైడ్ అంటే తమను కూడా పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు చెప్పారనేది జనసేనలో జరుగుతోన్న చర్చగా తెలుస్తోంది. తమ అవసరం లేదనే రీతిలో చంద్రబాబు.. టీడీపీ వ్యవహరిస్తోన్నప్పుడు.. తామేమీ టీడీపీ వెంట పడడం లేదనే విషయాన్ని టీడీపీకి అర్థమయ్యేలా చెప్పడంతోపాటు.. ఆ పార్టీకి ఓ ఝలక్ ఇచ్చినట్టు అవుతోందనే భావనతోనే పవన్ ఈ తరహా కామెంట్ చేశారా అనే వాదనలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు జనసేన ఆప్షన్లను పట్టించుకోకుండా, టీడీపీ ఒంటరిగా పోటీకి దిగి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ – జనసేన తో సహా ఇతర పార్టీల మధ్య చీలితే అది పరోక్షంగా వైసీపీకి సహకరించటం ఖాయం. ఇదే జనసేన అంచనా. పైగా, ఇప్పుడు ఏపీలో ఉన్న పరిణామాల్లో కొన్ని సామాజిక వర్గాలు తమవైపే ఉంటాయని కూడా జనసేన నమ్ముతోంది. పవన్ కల్యాణ్ ఈ లెక్కలను కూడా ఓపెన్ గానే చెప్తున్నారు. ఆ ఓట్ల ద్వారా లబ్ది పొందాలంటే, టిడిపి తమ ఆప్షన్లను అంగీకరించటమే మార్గమనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది.
మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ స్వరం మారుతోంది.ఆయన మాటల వెనుక వ్యూహమేంటనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నా వాటిపై, టిడిపి, బిజెపి ఓ నిర్ణయానికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆప్షన్లను పరిశీలిస్తే, జనసేనల లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ లేదని ఆ పార్టీ నమ్ముతోందని తెలుస్తోంది. వైసీపీని ఓడించటం లక్ష్యం అయినా, దాన్ని చేరటానికి టీడీపీ – బీజేపీకి జనసేన అవసరం ఉందని పవన్ కల్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. తమ మద్దతు లేకుండా వైసీపీని టీడీపీని ఓడించలేదనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ చెప్పుకొచ్చిన మూడు ఆప్షన్లలోనూ ఇదే క్లియర్ గా కనిపిస్తోంది. అందుకే తాను ఇప్పటి వరకు తగ్గానని చెబుతూనే..ఇక, తగ్గేది లేదంటున్నారు.
అయితే టిడిపి ఈ విషయంలో ఎలా ఉన్నా, బిజెపికి మాత్రం ఈ ఆప్షన్లతో పెద్దగా నష్టం లేదనే చెప్పాలి. బిజెపి ఎప్పటినుండో ఏపీలో బలపడాలని చూస్తోంది. ఇప్పుడు జనసేన ఆప్షన్లతో ఆ పార్టీ అంతో ఇంతో ఒక సామాజిక వర్గం ఓట్లు బిజెపికి మళ్లే అవకాశాలు పెరుగుతాయి. నిజానికి బిజెపి వ్యూహం కూడా ఆ సామాజిక వర్గాన్ని ఆధారంగా చేసుకుని ఎదగాలనే కావటంతో … ఆప్షన్లు ఆ పార్టీకి లాభిస్తాయనే చెప్పాలి..
అయితే పొత్తులపై ఇచ్చిన మూడు ఆప్షన్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఇందులో టీడీపీతోపాటు బీజేపీని కూడా పవన్ టార్గెట్ చేసుకున్నారని స్పష్టమవుతోంది. అందుకే ఇప్పుడు జనసేన నుంచి వస్తున్న డిమాండ్ బీజేపీలో కలకలం రేపుతోంది. తమతో పొత్తు కొనసాగాలంటే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించాలని ఆ పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కొందరు నాయకులు నేరుగానే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ శ్రేణులు ఇదే డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నాయి. ఒకవేళ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్‌ను ప్రకటిస్తే… తర్వాత టీడీపీ పొత్తు కోసం ప్రయత్నించినా… ఇదే డిమాండ్ వారి ముందు ఉంచాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేన చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ మాత్రం అంత ఈజీగా అంగీకరించేలా కనిపించడం లేదు. ఒకరు ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన సీఎం అభ్యర్థిగా ప్రకటించలేమంటున్నారు బీజేపీ లీడర్లు. నడ్డా పర్యటన పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికే తప్ప పొత్తులు, సీఎం అభ్యర్థులను ప్రకటించడానికి కాదన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్.
జీవీఎల్ కామెంట్స్‌పై జనసేన లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. తమతో ఎవరు కలిసి వచ్చినా రాకున్నా 2024లో విజయం సాధించేది జనసేనే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కానీ, పవన్‌ను సీఎం అభ్యర్థిగా చూడాలని భాజపా అధినాయకత్వం కోరుకుంటోందని గతంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. మరోవైపు టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు జనసేన సుముఖంగా ఉంటే, బిజెపి పరిస్థితి ఏంటనే వాదన కూడా ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా టిడిపి నేతలు బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. అలాంటపుడు కమలం నేతలు టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ముందుకొస్తారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే, పొత్తుల అంశంపై పవన్ ప్రకటన చేసిన వెంటనే బిజెపి నాయకత్వం స్పందించింది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది.
ఒకప్పుడు ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బీజేపీపై విమర్శించిన పవన్ కళ్యాణ్.. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమలనాధులకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. పక్కరాష్ట్రం తెలంగాణలో ఫామ్‌లోకి వచ్చిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆపసోపాలు పడుతోంది. చాలా విషయాల్లో కన్‌ఫ్యూజన్‌తో ఉందనే విమర్శలూ ఉన్నాయి. బీజేపీలో రెండువర్గాలు ఉన్నాయని.. ఒకటి అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటే.. మరొకటి టీడీపీకి అనుకూలంగా ఉంటుందనే ప్రచారం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అంటే బీజేపీలో భిన్నాభిప్రాయాలు తప్పకుండా వస్తాయి. కానీ, గత ఎన్నికల్లో నోటాకంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ.. ఆ తర్వాత బలపడ్డ సూచనలు లేవు. కాబట్టే జనసేనతో జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీజేపీ పెద్దలు.
అయితే, వైసీపీ తరచు జనసేన అధినేతని టార్గెట్ చేస్తూ ఉంది.. ఆయన చంద్రబాబు దత్తపుత్రుడని కార్నర్ చేస్తోంది. ఇప్పుడు నేనే సీఎం అని పవన్ కల్యాణ్ చెప్పుకుంటే తప్ప, టిడిపికోసం కాకుండా జనసేన విడిగా పనిచేసే పార్టీ అని రుజువు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇటు జనసేనికులది మరో వాదన. ఎంత కాలం వేరే పార్టీలకి, చంద్రబాబుని సీఎం చేయటానికి పనిచేయాలనేది జనసైనికుల ప్రశ్న.. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లే అదే పని చేయటమా అనుకుంటున్నారు. కానీ, పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థిత్వానికి డిమాండ్ చేస్తే సంతోషపడేది వైసీపీనే. జనసేనకి టిడిపి ఎక్కువ సీట్లిచ్చినా అది కూడా వైసీపీకి లాభమే..ఇవన్నీ చూస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కల్యాణ్ వైసీపీ ట్రోలింగ్ ఎఫెక్ట్ లో పడ్డారా? దత్తపుత్రుణ్ని కాదు సీఎం క్యాండిడేటి ని అని చెప్పుకోవలసి వచ్చిందా? అనేది ఇప్పుడు జనసేన వైపు ఉన్న ప్రశ్నలు. మొత్తానికి పొత్తుల విషయంలో ద్వారాలు తెరిచే ఉన్నాయని చెబుతూ.. అన్ని ఆప్షన్స్ తమ చేతిలో ఉండేలా చూసుకుంటున్నారు జనసేనాని. ఈ పొత్తులాటపై స్పష్టత రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.