టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026కు ముందు మరో పొట్టి టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 నేటి నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో మాజీ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. గాయకుడు యోయో హనీసింగ్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై జట్టు పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, అమన్‌జ్యోత్, గుణాలన్ కమలినితో బ్యాటింగ్ బలంగా ఉంది. ఫాస్ట్‌బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ బౌలింగ్‌కు నాయకత్వం వహించనుంది. సైకా ఇషాక్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ జట్టులో ఉంది. మరోవైపు బెంగళూరు టీమ్ కూడా బలంగానే ఉంది. స్మృతి మంధాన, జార్జియా వోల్, గ్రేస్ హారిస్, నదైన్ డిక్లెర్క్, రిచా ఘోష్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. అయితే ఎలిస్ పెర్రీ లేకపోవడం లోటే. లారెన్, పూజ వస్త్రాకర్, అరుంధతి, డిక్లెర్క్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్ స్పిన్ విభాగంలో ఆడనున్నారు.
డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు మూడు సీజన్లు జరిగగా.. ముంబై రెండు సార్లు (2023, 2025) విజేతగా నిలిచింది. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. 5 జట్లు ఒకదానితో ఒకటి రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. లీగ్ దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి.