ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 వేలానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు వేలం జరగనుంది. మధ్యాహ్నం 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాల కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. 194 మంది భారత ప్లేయర్లలో 52 మంది క్యాప్‌డ్, 142 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. 66 మంది విదేశీ క్యాప్‌డ్ ప్లేయర్స్, 17 మంది విదేశీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ వేలంలో ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు 23 స్థానాల కోసం పోటీ పడనున్నారు. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని, గరిష్టంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు.
డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో మార్క్యూ క్రీడాకారులు ఉన్నారు. భారతదేశానికి చెందిన దీప్తి శర్మ, రేణుకా సింగ్ లపై కాసుల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు ఐసీసీ 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో రాణించారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ దీప్తి కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడొచ్చు. ప్రపంచకప్‌లో ఆడిన క్రాంతి గౌడ్, హర్లీన్ డియోల్, శ్రీ చరణి, ప్రతీక రావల్‌కు కూడా మంచి ధర పలికే అవకాశాలు ఉన్నాయి. స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడొచ్చు. అలానే విదేశీ ప్లేయర్స్ సోఫీ డివైన్, అమేలియా కెర్, ఎక్లెస్టోన్, మెగ్ లాన్నింగ్, లారా వోల్వార్డ్ట్, అలిస్సా హీలీలకు కూడా భారీ డిమాండ్ ఉండనుంది.
Also Read: Gautam Gambhir: ముగ్గురు దిగ్గజాలను తప్పించాడు.. గంభీర్ కూడా తప్పుకోవాలి కదా?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలం పట్టికలో అత్యధిక పర్స్ ఉన్న జట్టుగా యూపీ వారియర్స్ ఉంది. యూపీ వద్ద రూ.14.5 కోట్లు ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ వద్ద రూ.9 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.6.15 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.5.75 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.5.7 కోట్లు ఉన్నాయి. వేలంలో యూపీ 17 స్లాట్‌లకు బిడ్ వేయనుంది. ఇందులో కనీసం ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటారు. గుజరాత్ 16 స్లాట్‌లను కలిగి ఉండగా.. ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు స్థలం ఉంటుంది. ఆర్సీబీ 14 స్లాట్‌లు మిగిలి ఉండగా.. కనీసం నలుగురు విదేశీ ఆటగాళ్లు అవసరం. ఢిల్లీ, ముంబై ఒక్కొక్కటి 13 స్లాట్‌లను కలిగి ఉండగా.. విదేశీ ఆటగాళ్లకు నాలుగు స్లాట్‌లు ఉన్నాయి.