న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అయితే లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో సెమీస్ చేరడమే కష్టం అనుకున్న తరుణంలో ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్ వైఫల్యం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. ఒకవేళ భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఉంటే.. ఇంగ్లండ్ ఇంటి దారి పట్టేది. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరగడం ఇది ఐదోసారి. ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లండ్ నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచాయి.
