Site icon NTV Telugu

Virat Kohli: టెస్ట్‌ క్రికెట్‌లో ముగిసిన రోకో శకం.. టీమిండియాను నడిపించే నాయకుడెవరు?

Roko

Roko

Virat Kohli: ఇంగ్లాడ్‌ పర్యటనకు ముందు క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌. స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. టెస్టుల నుంచి రిటైరవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ.. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు.

Read Also: Miss World 2025: డబ్బులోద్దు.. చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకత మీ దేశాల్లో చెప్పండి..

అయితే, గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి పొట్టి క్రికెట్‌కు టాటా చెప్పారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్‌ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. అతడు వైదొలగడంతో ఇంగ్లాండ్‌ పర్యటనకు కోహ్లీ అత్యంత కీలకమవుతాడని అంతా భావించారు. అంతలోనే తాను కూడా రిటైర్‌ అవ్వాలనుకుంటున్నానని విరాట్‌ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దీంతో అతడికి సర్ది చెప్పేందుకు బోర్డు ప్రయత్నించింది. కానీ, కోహ్లీ మాత్రం తన టెస్టు కెరీర్‌ను ముగించేందుకే సుముఖత చూపించాడు. ఇక, 2011 మధ్యలో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఇప్పటి వరకు 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో విరాట్‌ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌.. పదివేల పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి.. ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలిగాడు.

Read Also: Randhir Jaiswal: కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు

కాగా, అంతకు ముందు హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్ ప్రకటించాడు. ఇప్పటికే టీ ట్వంటీలకు దూరమైన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్టులకు సైతం గుడ్ బై చెప్పాడు. అయితే మరికొంతకాలం వన్డేల్లో కొనసాగనున్నాడు రోహిత్‌. భారత క్రికెట్ ప్రేమికులంతా ముద్దుగా హిట్ మ్యాన్ అని రోహిత్ శర్మను పిలుచుకుంటారు. దేశానికి దశాబ్దకాలానికి పైగా సేవలందించిన ఈ సూపర్ బ్యాటర్.. అభిమానులకు షాకిచ్చాడు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని హిట్‌మ్యాన్‌ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానన్నాడు రోహిత్. 38 ఏళ్ల రోహిత్‌.. భారత్‌ తరఫున 67 టెస్ట్‌లు ఆడి 40.6 సగటున 4వేల 301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్‌ కోహ్లి నుంచి టెస్ట్‌ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్‌.. 24 టెస్ట్‌ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Read Also: Gummanur Narayana Arrested: కాంగ్రెస్‌ నేత హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. మాజీ మంత్రి కజిన్‌ అరెస్ట్‌..

అయితే, ఇటీవల టెస్ట్‌ల్లో రోహిత్‌ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. గత 10 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌ ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు. మొన్నటి బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రోహిత్‌ ఘోరంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఆ సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో రోహిత్‌ జట్టు నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లోనూ రోహిత్‌ ఫెయిలయ్యాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా ఫెయిల్యూర్ కావడమే కాకుండా ఈ రెండు సిరీస్‌ల్లో రోహిత్‌ కెప్టెన్‌గానూ సక్సెస్ కాలేకపోయాడు. ఈ రెండు సిరీస్‌లను భారత్‌ కోల్పోయింది.

Read Also: Indus Water treaty: అప్పటి వరకు నీళ్లు లేవు.. “సింధు జలాల ఒప్పందం”పై విదేశాంగ శాఖ స్పష్టత..

ఇక, సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో కెప్టెన్‌ ఎవరు అనే చర్చ జరుగుతోంది. టీమ్‌ఇండియా రేపొచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో అయిదు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకు ముందు వరకు తదుపరి కెప్టెన్‌గా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. గతంలో ఈ పేస్‌ గుర్రం మూడుసార్లు టెస్టుల్లో టీమ్‌ఇండియాకు సారథిగా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకసారి, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లో రెండుసార్లు కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. రోహిత్‌ శర్మ రాకపోవడంతో పెర్త్‌ టెస్టులో భారత్‌ను గెలిపించి చరిత్ర సృష్టించాడు. కానీ, ప్రస్తుతం బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి స్వయంగా తప్పుకొన్నట్లు తెలుస్తోంది.

Read Also: Bombay High Court: భార్యకి వివాహేతర సంబంధం, ‘‘వాయిస్ రికార్డ్’’లతో కోర్టుకెక్కిన భర్త.. హైకోర్టు సంచలన ఆదేశాలు..

మరోవైపు, జూన్‌లో జరగనున్న ఇంగ్లండ్‌ సిరీస్‌లో వర్క్‌లోడ్‌ కారణంగా బుమ్రా పూర్తి మ్యాచ్‌లు ఆవకాశం లేదు. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా గాయపడిన బుమ్రా ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడలేకపోయాడు. ఐపీఎల్‌లోనూ కొన్ని ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితిలో బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు మోయలేడని బీసీసీఐ వర్గాలంటున్నాయి. దీంతో ఇంగ్లండ్‌ టూర్‌కు జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల ఎంపిక సెలక్టర్లకు కఠిన పరీక్షగా మారింది. ఈ టూర్‌కు భారత జట్టు ఎంపిక ప్రస్తుతం సెలక్టర్లకు కఠిన సవాళ్లు విసురుతోంది. ఈ వారంలోనే సెలక్షన్‌ కమిటీ ఇంగ్లండ్‌ వెళ్లబోయే ఇండియా- ఎ జట్టును ఎంపిక చేయనుంది. సీనియర్‌ జట్టు ఎంపికకు కూడా పెద్దగా సమయం లేదు. గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందించే అవకాశం ఉందంటున్నారు. టీమ్‌ఇండియాకు సారథి ఎవరో ఇప్పటికైతే ఇంకా తేలలేదు.

Read Also: Operation Sindoor: పాక్‌లో ధ్వంసమైన ప్రాంతాలివే.. ఉపగ్రహ చిత్రాలు విడుదల

రంజీ ట్రోఫీలో దుమ్మురేపిన శార్దూల్‌ ఠాకూర్‌ టీమ్‌ఇండియా సీనియర్‌ టీమ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌ పిచ్‌లు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తాయి. అందుకే సెలక్టర్ల నుంచి శార్దూల్‌ పిలుపు అందుకునే ఛాన్స్‌ ఉందంటున్నారు మాజీలు. ధ్రువ్‌ జురేల్‌, రిషబ్ పంత్‌.. ఈ ఇద్దరు వికెట్‌ కీపర్లకు బెర్త్‌ ఖాయం. ఇషాన్‌ కిషన్‌ ఇటీవలే బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు పొందినప్పటికీ ఇంగ్లండ్‌ టూర్‌కు మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. టెస్టులకు విరాట్‌ కోహ్లీ రిటైర్‌మెంట్‌ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌కు టీమ్‌లో స్థానం దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన సాయి సుదర్శన్‌ వైపు కూడా సెలక్టర్లు మొగ్గు చూపే ఛాన్స్‌ ఉంది. ముఖేష్‌ కుమార్‌, యశ్‌ దయాళ్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, సర్ఫరాజ్‌ఖాన్‌, మహ్మద్‌ షమీలు సెలక్టవడమూ అంత తేలికగా కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఒకేసారి ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణతో ఇంగ్లండ్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శన ఎలా ఉండనుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version