Gummanur Narayana Arrested: కర్నూలు జిల్లాలో ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు.. గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్పీఎస్ నేత, కాంగ్రెస్ ఆలూరు ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగిందని జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా వెల్లడించారు.. లక్ష్మీనారాయణ హత్యకేసులో గుంతకల్ కి చెందిన గౌసియా అనే మహిళతోపాటు మరికొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. గౌసియా ఇచ్చిన సమాచారంతోనే గుమ్మనూరు నారాయణను కూడా అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన టిప్పర్ కొనుగోలుకు గుమ్మనూరు నారాయణ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారని.. లక్ష్మీనారాయణ హత్య జరిగిన తర్వాత మరో లక్ష రూపాయలు కూడా ఇచ్చారని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు.
కాగా, ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణ ఏప్రిల్ 27వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.. గుంతకల్ నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తుండగా హత్య చేశారు.. లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్‌తో ఢీకొట్టారు.. ఈ ఘటనతో కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే, తీవ్రగాయాలపాలైన లక్ష్మీనారాయణను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచినట్టుగా వైద్యులు వెల్లడించారు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది..