టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో టీమిండియా ఆడబోతున్న తొలి టెస్టు విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ టెస్టులో మరో 38 పరుగులు చేస్తే టెస్టుల్లో 8వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. గతంలో భారత్ తరఫున సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే 8వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు.
కోహ్లీ ఇప్పటివరకు 99 టెస్టులు ఆడి 7,962 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 50.39గా ఉంది. అంతేకాదు మరో వైపు కెరీర్‌లో 100 టెస్టులు ఆడిన 12వ భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. జూన్ 20, 2011న వెస్టిండీస్ గడ్డపై తొలి టెస్టును విరాట్ కోహ్లీ ఆడాడు. అదే టెస్టు ద్వారా ప్రవీణ్‌కుమార్, అభినవ్ ముకుంద్ కూడా టెస్టుల్లో అరంగేట్రం చేయడం విశేషం. అయితే వాళ్లకు దక్కని ఫీట్ విరాట్ కోహ్లీకి మాత్రమే దక్కిందంటే అతడు ఏ రేంజ్‌లో ఆడాడో అర్థం చేసుకోవచ్చు.