విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సెంచరీతో సత్తాచాటాడు. బుధవారం జైపూర్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ముంబై తరపున ఆడుతూ.. 62 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్స్‌లతో 155 రన్స్ బాదాడు. రోహిత్ చెలరేగడంతో సిక్కింపై ముంబై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ సెంచరీ చేసిన రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. అయితే రోహిత్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొంది.
టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో హిట్‌మ్యాన్ ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తప్పనిసరిగా ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ ముంబై తరఫున బరిలోకి దిగాడు. రోహిత్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు జైపూర్ మైదానానికి వచ్చారు. ‘ముంబై కా రాజా’ అంటూ ఫాన్స్ నినాదాలు చేశారు. ఓ అభిమాని మాత్రం ఫిల్డింగ్ చేస్తున్న రోహిత్‌ను సరదాగా ఆట పట్టించాడు. ‘రోహిత్ భాయ్.. వడాపావ్ కాయేగీ క్యా’ (రోహిత్ భయ్యా.. వడపావ్ తింటావా?) అని రెండుసార్లు గట్టిగా అరిచాడు. ఇందుకు రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. అస్సలు తినను అన్నట్లు చేతితో సంజ్ఞ చేశాడు. దీంతో ఫాన్స్ ఒక్కసారిగా అరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘వడాపావ్’ అనేది మహారాష్ట్రకు చెందిన ఒక ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్. దీనిని ‘ఇండియన్ బర్గర్’ అని కూడా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్థానిక ప్లేయర్ అయినా రోహిత్ శర్మకు ‘వడాపావ్’ అంటే ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం అతడు జంక్‌ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటున్నాడు. ఇటీవల తన ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ పెట్టడమే ఇందుకు కారణం. కఠిన ఆహార నియమాలు పాటిస్తున్న హిట్‌మ్యాన్.. దాదాపు 10 కిలోల వరకు బరువు తగ్గాడు. వన్డే ప్రపంచకప్ 2027లో పాల్గొనడమే లక్ష్యంగా రోహిత్ ముందుకు సాగుతున్నాడు. అందులో భాగంగానే ఫిట్‌నెస్ కోసం డైట్ పాటిస్తున్నాడు.
During the Vijay Hajre Trophy match in Jaipur, people are teasing Rohit Sharma by asking him for VadaPav. 😭 pic.twitter.com/8wXm9mDewT
— Honest Cricket Lover (@Honest_Cric_fan) December 24, 2025