Vijay Zol: టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ విజయ్ జోల్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 19మందిపై కిడ్నాప్, దోపిడి, అల్లర్లకు పాల్పడ్డారన్న కారణంతో కేసు నమోదైంది. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విజయ్, అతడి సోదరుడు విక్రమ్‌తో పాటు మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన కొడుకు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాడు కానీ ఎలాంటి తప్పు పని చేయలేదని విజయ్ తండ్రి, సీనియర్ క్రిమినల్ లాయర్ బావు సాహెబ్ వెల్లడించారు. అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
Read Also: Raghu Kunche: మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట విషాదం
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో స్థానికంగా నివసించే క్రిప్టో మేనేజర్‌పై విజయ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జల్నా పోలీసులు మాట్లాడుతూ.. రెండు వర్గాల నుంచి ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని, వీటిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విజయ్ అండ్ గ్యాంగ్ తనపై దాడి చేశారని, తనను కిడ్నాప్ చేసి ఒక గదిలో పదిరోజుల పాటు బంధించారని క్రిప్టో మేనేజర్ ఆరోపించాడు. అదే సమయంలో ఆ మేనేజర్ తమను మోసం చేశాడని, లక్షల సొమ్ము కాజేశాడని విజయ్ కేసు పెట్టాడు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన విజయ్ జోల్ 733 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీతో పాటు 2, శతకాలు, 2 అర్ధశతకాలు ఉన్నాయి.