Ten Sri Lankan Athletes Missing From Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో ఓ అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. పతకాలు తీసుకురావాల్సిన 10 మంది శ్రీలంకన్ ఆటగాళ్లు.. గేమ్స్ మధ్యలోనే అదృశ్యమయ్యారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి మొత్తం 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు) వెళ్లగా.. అందులో నుంచి నలుగురు కనిపించకుండా పోయారని శ్రీలంక ప్రతినిధులు తెలిపారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు తెలిసింది.
ఈ సమాచారం అందుకున్న బర్మింగ్‌హామ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు అథ్లెట్లను వెతికి పట్టుకున్నారు. అయితే.. వాళ్లను ఎక్కడ ఉంచారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదని లంక ప్రతినిధులు పేర్కొన్నారు. మాయమైన అథ్లెట్లకు ఆరు నెలల పాటు వీసాలున్నాయి. వీళ్లంతా తమ బ్యాగుల్ని క్రీడా రంగంలోనే వదిలి వెళ్లిపోయారు. తాము ఎక్కడికి వెళ్లిపోయామన్న ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకే, ఆ అథ్లెట్లు ఇలా బ్యాగుల్ని సైతం వదిలి వెళ్లినట్లు అర్థమవుతోంది. అయినా.. పతకాల కోసం వెళ్లిన ఆటగాళ్లు, ఎందుకిలా చేశారు? శ్రీలంకలో నెలకొన్న సంక్షోభమే అందుకు కారణం.
ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే! రాజకీయ, ఆర్థిక సంక్షోభాల కారణంగా.. అక్కడి ప్రజలు ఒక్కపూట తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. స్వదేశానికి వెళ్లి తిండి కోసం తిప్పలు పడటం కన్నా, యూకేలోనే ఉండిపోయి ఏదో ఒక పని చేసుకోవడం మిన్న అనుకొని మాయమైనట్టు తెలుస్తోంది. అయితే.. అదృశ్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుందనేది ఆసక్తిగా మారింది. కాగా.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించింది. గత నెల 28న ప్రారంభమైన కామన్‌వెల్త్ గేమ్స్.. ఆగస్టు 8వ తేదీన ముగిశాయి.