IND Vs SL: ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను చివరకు 160 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని అక్షర్ పటేల్ చేతికి ఇచ్చాడు. అతడు ఈ ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చి రెండు రనౌట్లు చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. దీంతో రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Read Also: Supreme Court: సినిమాలకు వెళ్లేవారికి షాక్.. థియేటర్లలో బయటి ఆహారాలకు అనుమతి లేదని తీర్పు
కాగా భారత బౌలర్లలో తొలి మ్యాచ్ ఆడుతున్న శివం మావి అదరగొట్టాడు. అతడు నాలుగు ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేయగా… దీపక్ హుడా 41 పరుగులతో అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక, మహీష్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వ, హసరంగ తలో వికెట్ సాధించారు.