బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (31), పంత్ (26) ఫర్వాలేదనిపించారు. అయితే వాళ్లిద్దరూ అవుటయ్యాక ఇన్నింగ్స్ ఒడిదుడుకులకు లోనైంది. విరాట్ కోహ్లీ (1) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (15), హార్డిక్ పాండ్యా (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే దినేష్ కార్తీక్ (12) తో కలిసి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్) రాణించడంతో భారత జట్టు 170 పరుగుల స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ 4 వికెట్లతో సత్తా చాటగా అరంగేట్ర బౌలర్ రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లు తీశాడు.
Read Also: Cono Corpus: ఈ మొక్కను ఇంట్లో పెంచుతున్నారా? ప్రాణాలు కాపాడుకోండి
కాగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రెండు ఫోర్లు కొట్టడంతో ఇంటర్నేషనల్ టీ20ల్లో 300 ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా ఘనత వహించాడు. భారత్ నుంచి 300 ఫోర్లు బాదిన తొలి ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం. ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 325 ఫోర్లతో టాప్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (298) మూడో స్థానంలో ఉన్నాడు. అటు సిక్సర్లలో న్యూజిలాండ్ విధ్వంసక ఆటగాడు గప్తిల్ (165) టాప్‌లో ఉండగా రోహిత్ (157) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.