టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను రిటైర్ కావాలని సూచించాడంటూ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే సాహా వ్యాఖ్యలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. సాహా తనపై చేసిన ఆరోపణలు తనను బాధించలేదని తెలిపాడు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాలకు కారణమైన సాహాపై తనకు గౌరవం కూడా ఉందన్నాడు. జట్టు ఎంపికలో తాను, కెప్టెన్ రోహిత్ శర్మ కఠినంగా ఉంటామని.. ఆటగాళ్లను తుది జట్టులో ఎందుకు ఎంపిక చేయడం లేదో కారణాన్ని వారికి ముందే చెప్తామన్నాడు.
సదరు కారణాలు ఆటగాళ్లకు బాధ కలిగించినా తాము నిజం చెప్తామని రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా చెప్పడం వల్ల ఆటగాళ్లు తమ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నాడు. అందుకే కాస్త కఠినంగా మాట్లాడాల్సి వస్తుందని వివరణ ఇచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలను సాహా మీడియా ముందు చెప్పాల్సింది కాదని అభిప్రాయ పడ్డాడు. ఆటగాళ్లందరికీ ఎలా చెప్పానో.. తనకు కూడా అలాగే వివరించానని ద్రవిడ్ అన్నాడు. కానీ సాహా తన వ్యాఖ్యలను స్వీకరించలేకపోయాడని ద్రవిడ్ పేర్కొన్నాడు. మనం చెప్పిన మాటలను అందరూ స్వీకరించాలనే రూలేమీ లేదు కదా అన్నాడు.