టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ అరుణ్ లాల్ 66 ఏళ్ల లేటు వయసులో పెళ్లి పీటలెక్కనున్నాడు. అయితే ఆయనకు ఇది మొదటి పెళ్లి కాదు.. రెండో పెళ్లి. ఈ మేరకు మే 2న తన చిరకాల మిత్రురాలైన బుల్ బుల్ సాహా(38)ను అరుణ్‌లాల్ కోల్‌కతాలో వివాహం చేసుకోనున్నాడు. అయితే అరుణ్‌లాల్, బుల్ బుల్ సాహా మధ్య వయస్సు 30 ఏళ్లు ఉండటం గమనించాల్సిన విషయం.
బెంగాల్ రంజీ జట్టు ప్రస్తుత కోచ్‌గా వ్యవహరిస్తున్న అరుణ్ లాల్‌కు గతంలోనే వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య పేరు రీనా. వీరు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. అయినా ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్న తన మొదటి భార్యతోనే అరుణ్‌లాల్ సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితురాలు సాహాను పెళ్లి చేసుకుంటానని మొదటి భార్య రీనాతో చెప్పగా ఆమె అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం అరుణ్‌లాల్-సాహా ప్రీ వెడ్డింగ్ ఫోటోలు, పెళ్లి పత్రికల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అరుణ్ లాల్ కోచింగ్‌లో బెంగాల్ జట్టు 13 ఏళ్ల తర్వాత 2020లో తిరిగి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది.
