Team India: ప్రస్తుతం టీమిండియాలో స్పిన్ కోటా బౌలర్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. జడేజా గాయంతో దూరమైనా చాహల్, అశ్విన్, రవి బిష్ణోయ్‌లలో ఒకరికే తుది జట్టులో అవకాశం దక్కుతుంది. ఫామ్‌తో తంటాలు పడుతున్న కుల్దీప్ యాదవ్‌ను సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించి తాను కూడా ఈ రేసులో ఉన్నాననే సంకేతాలు పంపాడు. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఎతో జరిగిన రెండో వన్డేలో ఇండియా-ఎ తరఫున కుల్దీప్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 51 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.
Read Also: IND Vs AUS 3rd T20: ఉప్పల్‌లో ఊపేసిన భారత్.. సిరీస్ మనదే..!!
తొలుత వాన్ బీక్ (4)ను కుల్దీప్ క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి జో వాకర్ వచ్చాడు. వికెట్ల వెనకాల ఉన్న సంజూ శాంసన్ షార్ప్ క్యాచ్ అందుకోవడంతో అతను గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి జాకబ్ డఫీ (0)ని కూడా ఎల్బీడబ్ల్యూగా కుల్దీప్ బుట్టలో వేసుకోవడంతో హ్యాట్రిక్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్-ఎ జట్టు 47 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 34 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా (77 పరుగులు 48 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (30 పరుగులు 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడి భారత్-ఎ టీమ్‌ను గెలిపించారు.