Babar Azam React on Pakistan Defeat against United States: అమెరికా తనమా కంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రశంసించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమని దెబ్బతీసిందన్నాడు. పవర్ ప్లేలో తమ పేసర్లు రాణించలేదని, స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదని బాబర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ ఎలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పాక్ ఓటమిపాలైంది.
మ్యాచ్ అనంతరం బాబర్ ఆజామ్ మాట్లాడుతూ… ‘మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసింది. మ్యాచ్‌లో గెలవాలంటే భాగస్వామ్యాలు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో మేము అది చేయలేకపోయాం. మొదటి 6 ఓవర్లలో మా బౌలింగ్ కూడా పేలవంగా ఉంది. స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవడం కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అమెరికా చాలా కష్టపడింది. ఈ విజయం క్రెడిట్ వారిదే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో మా కంటే యూఎస్ మెరుగ్గా ఆడింది. పిచ్‌లో కొద్దిగా తేమ ఉంది. ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ పరిస్థితులను త్వరగా అంచనా వేయాలి’ అని అన్నాడు.
Also Read: PAK vs USA: అరగంట చాలు మాకు.. అన్నంత పని చేసిన అమెరికా కెప్టెన్!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఛేదనలో అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఆరోన్ జోన్స్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ ఒక వికెట్ నష్టానికి 13 రన్స్‌కే పరిమితమైంది.