United States Trash Pakistan in Super Over: టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. పటిష్ట పాకిస్థాన్‌పై పసికూన అమెరికా సూపర్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో యూఎస్ గెలుపొందింది. సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేయగా.. 19 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓ వికెట్ కోల్పోయి 13 రన్స్ చేసి ఓడిపోయింది. అంతకుముందు ఇరు జట్లు 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. చరిత్రాక విజయం సాధించిన అమెరికాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (9) త్వరగానే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ బాబర్ అజామ్ (44; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఉస్మాన్ ఖాన్ (3), ఫఖర్ జమాన్ (11), ఆజం ఖాన్ (0) నిరాశపరిచారు. షాదాబ్ ఖాన్ (40; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుతో పాక్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇప్తికార్ అహ్మద్ (18), షాహీన్ అఫ్రిది (23) విలువైన పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో కెంజిగే 3, నేత్రవల్కర్ 2 రెండు వికెట్స్ పడగొట్టారు.
Also Read: Amrabad Tiger Riserv : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుండి 415 కుటుంబాలు తరలింపు
160 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్టీవెన్ టేలర్ (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కమ్ కెప్టెన్ మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ఆరోన్ జోన్స్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ (14; 14 బంతుల్లో) ధాటిగా ఆడారు. చివరి ఓవర్‌లో అమెరికా విజయానికి 15 రన్స్ అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 10 పరుగులు వచ్చాయి. చివరి బంతికి నితీశ్ ఫోర్ బాదడంతో.. స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమిర్, నసీమ్ షా, హరిస్ రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ ఓవర్‌లో యూస్ అద్భుతం చేసి గెలిచింది.