Do You Know Why USA Fined 5 Runs vs India: టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శన చేస్తున్న అమెరికా.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించింది. కఠినమైన న్యూయార్క్ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్‌తో అదరగొట్టిన యూఎస్ఏ.. ఆపై సువర్ బౌలింగ్‌తో టీమిండియాని వణికించింది. ఓ దశలో అయితే మ్యాచ్‌పై పట్టు సాధించి.. గెలిచేలా కనిపించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్టాప్ క్లాక్’ రూల్ అమెరికా కొంపముంచింది. కొత్త రూల్ కారణంగా భారత్ ఖాతాలో 5 రన్స్ అదనంగా చేరాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
అంతర్జాతీయ మ్యాచ్‌లను సకాలంలో పూర్తి చేయడం కోసం ఐసీసీ ‘స్టాప్ క్లాక్’ రూల్‌ను తీసుకొచ్చింది. ఓవర్ ఓవర్‌కు మధ్య నిమిషం మాత్రమే విరామం ఉంటుంది. అంటే.. ఒక ఓవర్ ముగిశాక తదుపరి ఓవర్ వేసేందుకు బౌలర్ 60 సెకన్ల లోపే సిద్ధమవ్వాలి. ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ జట్టు మూడు సార్లు ఇలా చేయడంలో విఫలమైతే.. 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. దాంతో బ్యాటింగ్ జట్టు ఖాతాలో 5 రన్స్ చేరుతాయి. ఈ సమయాన్ని థర్డ్ అంపైర్ స్టాప్ క్లాక్ సాయంతో లెక్కిస్తారు.
Also Read: IND vs USA: అమెరికాపై చెమటోడ్చి నెగ్గిన భారత్.. సూపర్-8కు రోహిత్ సేన!
భారత్‌తో మ్యాచ్‌లో అమెరికా బౌలర్లు మూడుసార్లు 60 సెకన్లలోపు మరో ఓవర్‌ను ప్రారంభించలేదు. అప్పటికే రెండు సార్లు హెచ్చరించిన అంపైర్.. మూడోసారి 5 రన్స్ పెనాల్టీగా విధించాడు. ఛేదనలో రోహిత్ సేనకు 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సి రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 16వ ఓవర్ ఆరంభానికి ముందు.. అమెరికాకు అంపైర్ పెనాల్టీ విధించాడు. దాంతో ఒక్కసారి సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారింది. ఈ ఐదు పరుగులు టీమిండియాపై ఒత్తిడిని తగ్గించాయి. ఆపై సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మిగతా పని పూర్తి చేశారు.